పోచారం కోసం అసెంబ్లీ ముందు టీఆర్ఎస్ ధర్నా
posted on Apr 1, 2011 @ 12:31PM
హైదరాబాద్: పోచారం శ్రీనివాస రెడ్డి రాజీనామా ఆమోదంపై డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ జాప్యం చేస్తుండడాన్ని నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యులు శుక్రవారం ఉదయం అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా ప్రారంభించారు. మాజీ శాసనసభ్యులు, ఎమ్మెల్సీ కూడా ఈ ధర్నాలో పాల్గొన్నారు. తన రాజీనామా ఆమోదం పొందకుండా తెలుగుదేశం పార్టీ అడ్డుకుంటోందని పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. ధర్నా ప్రారంభించడానికి ముందు తెరాస శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కలుసుకున్నారు. పోచారం శ్రీనివాస రెడ్డి రాజీనామాను వెంటనే ఆమోదించాలని వారు కోరారు. బాలనాగి రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, పోచారం శ్రీనివాస రెడ్డిపై అనర్హతపై తాము చేసిన ఫిర్యాదుపై చర్యలు తీసుకునే వరకు పోచారం శ్రీనివాస రెడ్డి రాజీనామాను ఆమోదించకూడదని తెలుగుదేశం నాయకులు డిప్యూటీ స్పీకర్‌ను కోరుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగుకు పాల్పడిన ఆ ముగ్గురు శాసనసభ్యులపై అనర్హత వేటు వేయాలని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్‌ను కోరారు. పోచారం శ్రీనివాస రెడ్డి రాజీనామాను ఆమోదిస్తే వెంటనే నిజామాబాద్ జిల్లా బాన్సువాడ సీటుకు ఉప ఎన్నిక వస్తుంది. దానివల్ల తెరాస లాభపడే అవకాశాలున్నాయి. పోచారం శ్రీనివాస రెడ్డి ఆ సీటు నుంచి తెరాస తరఫున పోటీ చేస్తారు. కడప లోక్ సభ సీటుకు, పులివెందుల శాసనసభ సీటుకు జరిగే ఉప ఎన్నికలతో పాటు బాన్సువాడ శాసనసభ సీటుకు ఉప ఎన్నిక జరిగితే తమకు లబ్ధి చేకూరుతుందనే ఉద్దేశంతో తెరాస నాయకత్వం ఉంది. దానివల్ల తెలంగాణ ఉద్యమానికి ఊపు వస్తుంది. అందుకే డిప్యూటీ స్పీకర్‌పై పోచారం శ్రీనివాస రెడ్డి రాజీనామా ఆమోదానికి ఒత్తిడి తెస్తోంది.