కోదండరాముడితో కాంగ్రెస్ యంపీలు కొత్త పార్టీ పెట్టిస్తారా
posted on May 23, 2013 9:06AM
కాంగ్రెస్ అధిష్టానం ఈనెల 30లోగా తెలంగాణాపై స్పష్టమయిన ప్రకటన చేయకపోయినట్లయితే పార్టీని వీడి తెరాసలో చేరుతామని కాంగ్రెస్ యంపీలు హెచ్చరించినప్పటికీ, అధిష్టానం ఇంతవరకు స్పందించలేదు. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్చగా జీవించిన తాము ఇప్పుడు ఆ పార్టీని వీడి, దొరతనం ప్రదర్శించే కేసీఆర్ ముందు చేతులు కట్టుకొని నిలబడటం చాల కష్టమని తెలిసినప్పటికీ గత్యంతరం లేని పరిస్థితులలోనే వారు అయిష్టంగానే తెరసలోకి వెళ్లేందుకు సిద్దపడుతున్నట్లు తెలుస్తోంది.
కానీ, నాలుగయిదు రోజుల క్రితమే కేసీఆర్ ను ఆయన ఫారం హౌస్ లో కలిసివచ్చిన కేశవ్ రావు నిన్నఅకస్మాత్తుగా తెలంగాణా జేయేసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంతో సమావేశం అవడం చాలా ఆసక్తి కలిగిస్తోంది. ఎందుకంటే, ఆయన త్వరలో కొత్త రాజకీయ పార్టీ పెట్టనున్నారనే వార్తలు వస్తున్న నేపద్యంలో కేశవ్ రావు ఆయనతో సమావేశం అవడం చూస్తే, కాంగ్రెస్ యంపీలు తెరాసలో చేరడం కంటే, మేధావి, విద్యావంతుడు, సంస్కారి, పెద్దమనిషిగా తెలంగాణా ప్రజలలో మంచి గౌరవం కలిగిన ఆయన చేతనే రాజకీయ పార్టీ పెట్టించి, ఆయన నేతృత్వంలో పనిచేయడానికే మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది.
ప్రొఫెసర్ కోదండరాంకు కూడా కేసీఆర్ తో గతకొంత కాలంగా తరచూ చేదు అనుభవాలు ఎదురవుతున్న నేపద్యంలో, ఆయనకు రాజకీయాలపట్ల పెద్దగా ఆసక్తి లేకపోయినప్పటికీ, ఆయనపై వస్తున్న ఒత్తిళ్లకు తలొగ్గి రాజకీయ పార్టీ స్థాపనకు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణా ఉద్యమాలను పక్కన బెట్టి ఎన్నికలు, టికెట్లు అంటూ కేసీఆర్ పక్కదారి పట్టడంతో ఆయనకి తెలంగాణా సాధనపై చిత్తశుద్ధి లేనట్లు ప్రజలలో అభిప్రాయం వ్యక్తం అవుతుండటం, దానికి బలం చేకూరుస్తున్నట్లు రాబోయే ఎన్నికలలో డబ్బు ఖర్చు పెట్టగలవారికే పార్టీ టికెట్స్ అని ఆయన ఇటీవల చేసిన ప్రకటన, ఉద్యమాలు చేసిన వారిని, బడుగు బలహీన వర్గాలవారిని పక్కన బెట్టి ధన రాజకీయాలకు కేసీఆర్ స్వయంగా తెరలేపడం, రఘునందన్ రావు వంటివారు తెరాస నేతల బలవంతపు వసూళ్ల వ్యవహారాలు బయటపెట్టి సీబీఐకి పిర్యాదుచేయడం వంటి అనేక అంశాలు ప్రొఫెసర్ కోదండరాంను కేసీఆర్ కు దూరం చేసాయి. అందుకే ఆయన ఉద్యమ కారులకు, రాజకీయవేత్తలకు, మేధావులకు అందరికీ ప్రాతినిద్యం వహించే ఒక కొత్త రాజకీయ పార్టీ పెట్టేందుకు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే, ఉద్యమాలు చేయడం వేరు ఒక రాజకీయ పార్టీ స్థాపించి దానిని సమర్ధంగా నడిపించడం వేరే అనే సంగతి ఆయనకు బాగా తెలుసును గనుకనే ఇంతకాలంగా ఎంతమంది ఆయనపై ఒత్తిడి తెస్తున్నపటికీ ఆయన వెనుకంజ వేస్తునట్లు తెలుస్తోంది. అయితే, రాజకీయాలలో తలపండిన తెలంగాణా కాంగ్రెస్ యంపీలు ఇప్పుడు కొత్త పార్టీ స్థాపనలో, దాని నిర్వహణలో ప్రధాన పాత్ర పోషించేందుకు ముందుకు వస్తునపుడు, ఇక ఆయన కొత్త రాజకీయ పార్టీని స్థాపించడానికి అభ్యంతరం ఉండకపోవచ్చును. అందువల్ల కేశవ్ రావు-ప్రొఫెసర్ కోదండరాంల మధ్య నిన్న జరిగిన సమావేశానికి చాలా ప్రాదాన్యత సంతరించుకొంది.
తెలంగాణా ఉద్యమాలు పూర్తిగా చల్లబడిపోయిన ఈ తరుణంలో వారు తమ సమావేశానికి ఏమి ప్రాదాన్యత లేదని కేవలం తెలంగాణా ఉద్యమం గురించి చర్చించడానికే సమావేశమయ్యామని చెప్పడం మరింత ఆసక్తి కలిగిస్తోంది.
ఏది ఏమయినప్పటికీ, తెలంగాణాలో తెరాసకు ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ మరొకటి లేనంత కాలం కేసీఆర్ ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగుతూనే ఉంటుందని అభిప్రాయపడుతున్నఅనేక మంది రాజకీయ నాయకులు, ప్రజలు కూడా తెలంగాణాలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవశ్యకత ఎంతయినా ఉందని, దానికి ఇదే సరయిన తరుణమని భావిస్తున్నట్లు తెలుస్తోంది.