మళ్ళీ సెల్ఫ్ గోల్ చేసుకొన్నటీ-కాంగ్రెస్ యంపీలు
posted on May 23, 2013 @ 10:00AM
సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కే.కేశవ్ రావు సోనియా గాంధీతో ఇటీవల సమావేశం అయిన తరువాత అంతా భేషుగ్గా ఉందని సర్టిఫికేట్ జారీ చేసి రెండు రోజులు కూడా కాక మునుపే ఏఐసీసీ అధికార ప్రతినిధి పీసీ చాకో ‘మా ఎజెండాలో తెలంగాణా అంశం లేదంటూ’ బాంబు పేల్చడంతో కేశవ్ రావుతో సహా అందరూ అవాక్కయిపోయారు.
అప్పుడు వారికి కోపం రావడం సహజమే. వారు చాలా తీవ్రంగానే స్పందిస్తూ ఆయన మాటలను ఖండించడమే కాకుండా, తమ అధిష్టానానికి తెలంగాణా అంశంపై స్పష్టమయిన ప్రకటన చేసేందుకు తాజాగా మే 30వ తేదీ డెడ్ లైన్ విదించి, మరో వైపు తెరాసలో చేరబోతున్నట్లు స్పష్టమయిన సంకేతాలు పంపారు.
కానీ, ఆవేశంలో ఆవిధంగా అన్నపటికీ, వారికి నిజానికి పార్టీని వీడేందుకు మనస్పూర్తిగా ఇష్టం లేదనేది అందరికీ తెలిసిన విషయమే. అందుకే, ఇనుము వేడిగా ఉన్నపుడే సమ్మెట దెబ్బ పడాలనే ఆలోచనతో వారిని వెంటనే తెరాసలో చేరమని కేసీఆర్, హరీష్ రావ్ తదితరులు చాల ఒత్తిడి తెచ్చారు. కానీ, వారు మాత్రం తమ పార్టీ అధిష్టానం తెలంగాణా అంశంపై ఏదోఒకటి తేల్చిన తరువాతనే వచ్చి జేరుతామని స్పష్టం చేయడం, వారు ఆలోచించుకోవడానికి మరింత సమయం కోసమే. తద్వారా వారు తెరాసలో చేరాడానికి ఇంకా వెనుకాడుతున్నట్లే స్పష్టం అవుతోంది.
కానీ, వారు మే30వ తేదీ డెడ్ లైన్ విదించడంతో, అధిష్టానం యొక్క ఆగ్రహానికి గురయ్యి, ప్రస్తుతం పార్టీలోకొనసాగలేని, బయటకు వెళ్ళలేని దుస్థితిని తమకు తామే కల్పించుకొన్నట్లయింది. కొద్ది రోజుల క్రితమే సోనియా గాంధీ స్వయంగా కేశవ్ రావును పిలిపించుకొని ఆయనతో అన్ని విషయాలు మాట్లాడిన తరువాత మళ్ళీ ఆయన ఇప్పుడు తనకి డెడ్ లైన్ విదించడంపై పార్టీ సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. పార్టీ అధిష్టానం ఎంతగా నచ్చజెప్పుతున్నపటికీ, కొందరు నేతలు పదేపదే ఈవిధంగా తమను ఇరకాటంలో పెట్టి, ఎదురుతిరుగుతుండటం ఇక వారిని ఎంత మాత్రం సహించే పరిస్థిలోలేనట్లు స్పష్టం అవుతుండటంతో, ఇప్పుడు వారి పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లు తయారయింది. పార్టీకి విదించిన డెడ్ లైన్ ఇప్పుడు వారి పాలిట ఉరిత్రాడుగా మారింది. వారికి వారే విదించుకొన్న ఈ డెడ్ లైన్ ముగియడానికి ఇంకా కేవలం వారం రోజులు మాత్రమే సమయం మిగిలి ఉన్నందున, మరో కొత్త ప్రయత్నంలో భాగంగా కేశవ్ రావు నిన్న తెలంగాణా జేయేసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ను కలిసారు.
ఒకవేళ ఆయనచేత కొత్త పార్టీ పెట్టింఛి అందులో చేరేందుకు ప్రయత్నిస్తున్నారేమో ఇంకా స్పష్టం కావాల్సి ఉంది. ఈసారి తెలంగాణా కాంగ్రెస్ యంపీలు ఆవేశంలో తమ మెడకి తామే ఉచ్చు బిగించుకొన్నారనేది మాత్రం సుస్పష్టం.