కాంగ్రెస్ విస్తృత స్థాయి విభేధాల సమావేశం
posted on May 22, 2013 @ 9:30PM
ఈ రోజు హైదరాబాదులో జరిగిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు పార్టీ నేతల మద్య సయోధ్య కుదర్చకపోగా నేతల మధ్య ఉన్న అభిప్రాయ బేధాలను కార్యకర్తల ముందు బయటపెట్టుకొనేందుకు మాత్రమే ఉపయోగపడింది. నేతలు తమ అభిప్రాయ బేధాలు బయటపెట్టుకొంటే, ఈసారి సమావేశానికి హాజరయిన ప్రతినిధులు, నేతలను నిలదీయడం మరో విశేషం.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తనకు ప్రభుత్వంలో ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారని ఆగ్రహంతో ఉన్న ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నరసింహ, ఈ సమావేశం లో ముఖ్యమంత్రికి కాస్త గట్టిగానే చురకలు అంటించారు. ‘నేను’ అనుకొంటే అది అహంకారమని, ‘మనము’ అది అనుకొంటే మానవత్వం, ఐకమత్యానికి నిదర్శనమని అంటూ కిరణ్ ఒంటెత్తు పోకడలను ఎండగట్టారు. ప్రభుత్వం ఆర్భాటంగా పధకాలను ప్రవేశపెట్టడంతో సరిపెట్టుకోకుండా అవి సరిగ్గా అమలవుతున్నాయో లేదో కాస్త పట్టించుకొంటే మంచిదని అన్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అందరినీ కలుపుకుపోగలిగితేనే రాగల ఎన్నికలలో విజయం సాదించగలమని, అలాకాకుండా ఎవరయినా ఒంటరిగా ఏదో సాదించేద్ధామని అనుకొంటే అది భ్రమే అవుతుందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి చురకలు వేసారు.
ఆ తరువాత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నేతల మద్య ఐకమత్యం గురించి మాట్లాడుతున్నపుడు, ఆయన స్టేజ్ దిగివెళ్ళిపోయారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ పార్టీలో నేతల మధ్య సమస్యలు ఉంటే వాటిని పార్టీ అంతర్గత సమావేశాల్లోనే పరిష్కరించుకోవాలి తప్ప మీడియాకెక్కి నలుగురిలో తాము పలుచన అయ్యి, పార్టీని కూడా పలుచన చేయరాదని కోరారు. కార్యకర్తల కృషివల్లే నేడు తాము ఈస్థాయిలో ఉన్నామన్న సంగతిని వేదిక మీద ఉన్న ప్రతీ ఒక్కరూ గుర్తుపెట్టుకు మెలగాలని, కార్యకర్తలు లేనిదే పార్టీ లేదంటూ వారి మెప్పుపొందే ప్రయత్నం చేసారు. పార్టీలో పనిచేసే వారికి పదవులు వాటంతట అవే వెతుకొంటూ ఇంటికి వస్తాయని ఆయన అన్నారు.
పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్తిబాబు కూడా ఇంచుమించు అవే అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ రాబోయే ఎన్నికలలో పార్టీ విజయానికి అందరూ కలిసి కట్టుగా కృషి చేయాలని కోరారు.
అంతకు ముందు కొందరు కార్యకర్తలు మాట్లాడుతూ తాము పార్టీకోసం ఎంత కష్టపడి పనిచేసిన ఎన్నడూ పార్టీ గుర్తించలేదని, గత 30 ఏళ్లుగా పార్టీలో కార్యకర్తల పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేసారు. మరికొంత మంది కార్యకర్తలు నేతలు ఐకమత్యంగా మెలగుతూ పార్టీ విజయానికి కలిసి కట్టుగా కృషి చేయాలని కోరారు.
మొత్తం మీద ఈ సమావేశంలో ప్రసంగించిన నేతలందరూ కార్యకర్తలకి ప్రాధాన్యం ఈయాలని అంటూనే, కొందరు కార్యకర్తలు తమ తీరును తప్పుబడుతుంటే ‘విమర్శలు వద్దంటూ’ వారి మైక్ కట్ చేసి కూర్చోబెట్టేశారు. తమ మద్య ఉన్న అభిప్రాయ బేధాలను మీడియా ముందు బయటపెట్టుకోరాదంటూనే, మీడియా కవరేజ్ చేస్తున్న సమావేశంలో ఒకరిపై మరొకరు బాగానే కత్తులు దూసుకొన్నారు.
మరి కాంగ్రెస్ పార్టీ ఏమాశించి ఇటువంటి సమావేశాలు ఏర్పాటు చేసుకొంటుందో గానీ, ప్రతీ సారి అసలు కంటే ఈ కొసర్లే ఎక్కువ కనిపిస్తుంటాయి. కానీ, ప్రతీ సమావేశంలో పార్టీలో నేతలందరూ కేవలం కాంగ్రెస్ అధిష్టానానికి తప్ప మరెవరిని ఎవరూ కూడా ఖాతరు చేయరని తప్పక ఋజువు చేస్తుంటారు.ఈ సారి కూడా అదే మరో మారు ఋజువు చేసారు.