పాదయాత్ర ముగింపు సభకి రానున్న జూ.యన్టీఆర్
posted on Apr 26, 2013 @ 10:12AM
రేపటితో చంద్రబాబు సుదీర్గ పాదయాత్ర ముగియనున్నందున, ఈ సందర్భంగా తెదేపా విశాఖ నగరంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. రాష్ట్రం నలుమూలల నుండి దాదాపు 5 లక్షల మంది పార్టీ కార్యకర్తలు, నాయకులూ, పార్టీ అభిమానులు ఈ సభకు రానున్నట్లు అంచనా వేస్తున్న తెదేపా, ఈ సభలో పాల్గొనవలసిందిగా కోరుతూ పార్టీ నేతలకు, నందమూరి కుటుంబ సభ్యులకు, మిత్ర పక్షాల నేతలకు, దేశ విదేశాలలో ఉన్న పార్టీ అభిమానులకు ఆహ్వానాలు పంపింది.
అయితే అనారోగ్య కారణాల వల్ల పార్టీ రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ హాజరు కాకపోవచ్చునని ఆహ్వానకమిటీ భావిస్తోంది. పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సభలలో ఆయన స్వయంగా పాల్గొనలేకపోయినపటికీ తన కుమారుడు జూ.యన్టీఆర్ ను మాత్రం పంపుతున్నట్లు సమాచారం అందింది. ఇటీవల ఫ్లెక్సీబ్యానర్ల కారణంగా నందమూరి కుటుంబ సభ్యుల మద్య తలెత్తిన వివాదాలకు తెరదించాలని అందరూ భావిస్తున్నందున, ఈ సభకు జూ.యన్టీఆర్ తప్పనిసరిగా హాజరవుతాడని పార్టీ నేతలు భావిస్తున్నారు. అతనితో బాటు, తారక రత్న, కళ్యాన్ రామ్ తదితరులు కూడా వచ్చి ఈ సభలో పాల్గొంటారు. లక్షలాది ప్రజలు, పార్టీ కార్యకర్తలు హాజరవుతున్న సభకి హాజరవుతున్న సందర్బంగా, జూ.యన్టీఆర్ ఈ అవకాశాన్నిసద్వినియోగం చేసుకొని అందరిలో అపోహలు దూరం చేసే ప్రయత్నం చేస్తూ తెలుగుదేశం పార్టీలోనే కొనసాగనున్నట్లు, పార్టీకే మద్దతు ఉటుందని ఒక విస్పష్టంగా ప్రకటన చేయవచ్చునని అందరూ భావిస్తున్నారు. అందువల్ల ఈ సభలో విజయవంతంగా పాదయాత్ర ముగించుకొన్నచంద్రబాబు నాయుడు కంటే జూ.యన్టీఆర్, ఆ తరువాత వరుసగా లోకేష్, బాలకృష్ణలే ప్రధాన ఆకర్షణగా నిలువబోతున్నారని చెప్పవచ్చును.