పాదయాత్ర ముగింపుకి భారీ ఏర్పాట్లు
posted on Apr 25, 2013 @ 3:22PM
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గత ఏడాది అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా మొదలుపెట్టిన సుదీర్గ పాదయాత్ర ఈ నెల27న ముగియనున్నందున పార్టీ నేతలు చాలా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖ శివారు ప్రాంతమయిన గాజువాక సమీపంలో వడ్లపూడి వద్ద రూ.౩ కోట్ల ఖర్చుతో 275గజాల స్థలంలో ఒక సుందరమయిన పార్కు తీర్చిదిద్ది దాని మద్యలో 60 అడుగుల పొడవయిన పైలాన్ నిర్మిస్తున్నారు. దానిలో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహం నెలకొల్పనున్నారు. పైలాన్ నిర్మాణం దాదాపు పూర్తికావచ్చింది.
చంద్రబాబు 27వ తేదీన గాజువాక పరిసర ప్రాంతాలలో తన పాదయాత్ర ముగించుకొన్న తరువాత మద్యాహ్నం 3గంటలకు పైలాన్ ఆవిష్కరిస్తారు. ఆ తరువాత 10,000 మోటార్ సైకిళ్ళు, 400 ఇతర వాహనాలతో కూడిన భారీ ర్యాలీతో ఓపెన్ టాప్ జీపులో బయలుదేరి నగరం నడిబొడ్డునగల ఆంధ్రాయునివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ లో జరిగే భారీబహిరంగ సభలో పాల్గొంటారు.
ఈ ముగింపు వేడుకలకి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నపార్టీ కార్యకర్తలు, నాయకులూ అందరు కలిసి దాదాపు 10లక్షల మంది వరకు రావచ్చునని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే 12 ప్రత్యేక రైళ్ళను, 500 బస్సులను, అనేక మినీ వ్యాన్లను ముందుగానే బుక్ చేసారు. అదేవిధంగా నగరంలో ఉన్న చిన్న పెద్దా హోటల్స్ మరియు గెస్ట్ హౌసులలో రూములు కూడా ఇప్పటికే చాలావరకు బుక్ అయిపోయినట్లు సమాచారం.
ఇంత భారీ ఎత్తున తరలి వస్తున్న జనాలను అదుపుచేసేందుకు పోలీసులు కూడా అదనపు బలాలను ఇతర జిల్లాల నుండి రప్పిస్తున్నారు. ఇక 26వ తేదీ నుండే నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్ళింపులు ఉంటాయని పోలీసు అధికారులు తెలియజేసారు. సభాస్థలి జనసాంద్రత ఎక్కువ ఉండే నగరం నడిబొడ్డున ఉండటంతో పోలీసులు మరింత జాగురకతో వ్యవహరించాల్సి ఉంటుంది.
చంద్రబాబు తన 63 ఏళ్ల వయసులో దాదాపు 2,900కి.మీ. పాదయాత్ర దిగ్విజయంగా చేసుకొని ఇంత భారీ ఎత్తున ర్యాలీ, సభ నిర్వహించతుండటంతో పార్టీ కార్యకర్తలలో, నేతలలో మళ్ళీ చాలారోజుల తరువాత సమరోత్సాహం కనిపిస్తోంది.