సుబ్బిరామిరెడ్డిని కలవరపరుస్తున్న పురందేశ్వరి మౌనం
posted on Apr 26, 2013 @ 11:51AM
వైజాగ్ లోక్ సభ సీటు కోసం ఈ సారి టీ.సుబ్బిరామిరెడ్డి చాలా గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ప్రస్తుతం వైజాగ్ లోక్ సభ స్థానానికి ప్రాతినిద్యం వహిస్తు, తనకు పోటీగా ఉన్నకేంద్రమంత్రి పురందేశ్వరి తనకు చెల్లెలువంటిదని చెపుతూనే, వైజాగ్ ను తనకు వదిలిపెట్టి, ఆమె పక్కనున్న నర్సాపురం నియోజక వర్గానికి వెళ్ళిపోతే ఇద్దరికీ బాగుంటుందని ఆయన మీడియా ముఖంగా ఆమెకు సలహాలు కూడా ఇచ్చారు.
నగరంలో జరిగే పలు చిన్నా పెద్దా కార్యక్రమాలలో ఇప్పుడు చురుకుగా పాల్గొంటున్న ఆయన ప్రతీ సభలో, సమావేశంలో ఈ సారి తానూ వైజాగ్ నుండే పోటీ చేయడం ఖాయమని పదే పదే చెపుతున్నారు కూడా. పనిలో పనిగా వైజాగ్ నగరాన్ని తానూ ఏవిధంగా మార్చివేయాలనుకొంటున్నారో తెలియజేస్తూ ఒక పెద్ద దీర్ఘకాళిక ప్రణాళిక కూడా ప్రకటించేశారు. తద్వారా, ఇక తానే వైజాగ్ కి ప్రాతినిద్యం వహించబోతున్నట్లు ప్రకటించేసుకొన్నారు.
పనిలో పనిగా ఇటీవలే వైజాగులో ఒక సభ నిర్వహించి తానూ చేసిన సేవలకి గాను కిరీటం కూడా పెట్టించుకొన్నారు. అయినప్పటికీ, పురందేశ్వరి మాత్రం తన సహజ సిద్దమయిన హుందాతనం కనబరుస్తూ, ఏనాడు ఆయన మాటలకు జావాబు ఈయలేదు. ఆమె అంత నిశబ్దంగా ఉండిపోవడంతో ఆమె అంతర్యం ఏమిటో అర్ధం కాక, కంగారుపడుతూన్న సుబ్బిరామిరెడ్డి ఎందుకయినా మంచిదని నిన్ననే డిల్లీ వెళ్లి సోనియా గాంధీని కలిసి, వైజాగ్ ప్రజలకు తానూ చేస్తున్న సేవల లిస్టులు, దాన ధర్మాల లిస్టులు, తన ధార్మిక వ్యవహారాల వివరాలను పూర్తిగా అప్పజెప్పి, వైజాగ్ లోక్ సభ సీటు తనకే ఇప్పించవలసిందిగా కోరారు. మరి సోనియా గాంధీ ఏమి హామీ ఇచ్చేరో ఆయన ఇంకా బయటపెట్టలేదు.త్వరలోనే ఆ సంగతీ ఆయనే స్వయంగా ప్రకటించుకోవచ్చును.