పాపం...జగన్మోహన్ రెడ్డిని ఓదార్చేదెవరు?
posted on Feb 25, 2015 @ 11:51AM
సాధారణంగా ఎన్నికలలో ఓడిపోయి రాజకీయ పార్టీలు, తమను ఓడించి అధికారంలోకి వచ్చిన అధికార పార్టీని ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ఒకే ఒక్కసారి అభినందిస్తాయి. ఆ మరునాటి నుండి అధికార పార్టీ ప్రభుత్వాన్ని, దాని ముఖ్యమంత్రిని విమర్శించడం ద్వారానే తమ ఉనికిని కాపాడుకొంటూ, మళ్ళీ వచ్చే ఎన్నికల కోసం చకోర పక్షుల్లా ఎదురు చూస్తుంటాయి. కానీ ఓ రెండు మూడు నెలలు కాగానే ఇక అంతవరకు ఆగలేక ఏదో కారణంతో అధికార పార్టీకి రాష్ట్రాన్ని పాలించే నైతిక హక్కు లేదు కనుక ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని సన్నాయి నొక్కులు నొక్కడం మొదలుపెడుతుంటాయి. కానీ ముఖ్యమంత్రి అవుదామని తెగ తహతహలాడిపోతున్న జగన్మోహన్ రెడ్డి వంటి నేతలు మాత్రం తమ ఆత్రాన్ని మరో విధంగా బయటపెట్టుకొంటుంటారు.
రైతు భరోసా యాత్రలకి బయలుదేరిన ఆయన తన రోడ్ షోకి వచ్చిన జనాలని చూసి వారందరూ ఏవో తీరని కష్టాలలో ఉన్నట్లు ఊహించేసుకొంటూ, “మీరెవరూ అధైర్యపడకండి...త్వరలోనే మంచి రోజులు వచ్చేస్తున్నాయి. త్వరలోనే ఈ ప్రభుత్వం కూలిపోబోతోంది,” అంటూ చిలక జోస్యం చెపుతుంటారు. తను ముఖ్యమంత్రి అయ్యేందుకు ఐదేళ్ళపాటు పరిపాలించేందుకు ప్రజలు ఎన్నుకొన్న ప్రజాప్రభుత్వం కూలిపోవాలని కోరుకోవడం చూసి ప్రజలు కూడా విస్మయం చెందుతున్నారు. అసలు త్వరలో ఈ ప్రభుత్వం కూలిపోతుందని ఆయన ఏవిధంగా చెపుతున్నారో, కూలిపోతే ఆయన ఏవిధంగా ముఖ్యమంత్రి అయిపోతారో కూడా కాస్త ప్రజలకు వివరించి ఉండి ఉంటే బాగుండేది.
ఆయన చేస్తున్నది రైతు భరోసా యాత్ర...కానీ కంటున్న కలలు వేరే..నిజానికి ఆయన గత ఐదేళ్ళుగా చేస్తూన్న ఓదార్పు యాత్రల పరమార్ధం కూడా ఇదే. సమైక్యాంధ్ర ఉద్యమాల పరమార్ధం కూడా ఇదేనని ఆయన తన నోటితోనే తనే ప్రతీసారి చెప్పుకొంటుంటారు. అందుకే ప్రజలు ఆయనను తిరస్కరించారు. చనిపోయిన రైతుల కుటుంబాలను ఓదార్చేందుకు వెళ్ళినప్పుడు ఆ పని చక్కబెట్టుకొని తిరిగి రావాలి. కానీ ఆయన ఇలా వ్యానెక్కి ప్రభుత్వం కూలిపోతుందని శాపనార్ధాలు పెట్టినంత మాత్రాన్న ప్రభుత్వాలు కూలిపోవు..మారిపోవు.
ఆయన ముఖ్యమంత్రి అవలేకపోవడానికి ఇతరులను ఆడిపోసుకోవడం కంటే అందుకు తనను తనే నిందించుకోవడం మంచిది. తను అవలంభిస్తున్న ఇటువంటి ద్వంద వైఖరి, పార్టీలో సీనియర్ నేతలను సంప్రదించకుండా, వారి సలహాలను ఖాతరు చేయకుండా తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళన్నట్లు ముందుకు సాగుతుండటం చేతనే ఆయన పార్టీ ఎన్నికలలో ఓడిపోయింది. అయినా జగన్మోహన్ రెడ్డి నేటికీ తన మూడు కాళ్ళ కుందేలుతోనే పార్టీని నడిపిస్తున్నారు. అటువంటప్పుడు ఆ పార్టీ ఎప్పటికయినా అధికారంలోకి వస్తుందని ఎవరు మాత్రం అనుకొంటారు? ఈ సంగతి జనాలకి, వైకాపా నేతలకి అర్ధం అయింది కానీ జగన్మోహన్ రెడ్డికే అర్ధమయినట్లు లేదు. ఏడ్చే వారిని, ఏడవని వారిని ఏడ్పించి మరీ ఓదార్చుతున్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేకపోతే ఓదార్చేదెవరు?