ఏపీ రాజధాని మాస్టర్ ప్లాన్ కాపీ సిద్దం
posted on Feb 24, 2015 @ 3:35PM
ఆంద్రప్రదేశ్ రాజధాని నగర నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ అందిస్తున్న సింగపూర్ కి చెందిన సెంటర్ ఫర్ లివబుల్ సిటీస్ (సి.యల్.సి.) ప్రతినిధులు వచ్చేనెల 3వ తేదీన హైదరాబాద్ రాబోతున్నారు. వారు మాస్టర్ ప్లాన్ తాలూకు డ్రాఫ్ట్ (నకలు) కాపీని తయారుచేసి తీసుకొని వస్తున్నారు. దానిని రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కొరకు సమర్పిస్తారు. అదే సమయంలో వారు రాష్ట్రానికి చెందిన పట్టణాభివృద్ధి సంస్థకు చెందినా అధికారులకు హైదరాబాదులో మూడు రోజుల పాటు శిక్షణా తరగతులు కూడా నిర్వహిస్తారు. తాము గీసిన మాస్టార్ ప్లాన్ లో సాంకేతిక అంశాలన్నిటినీ వారికి వివరించి దానిని నిర్మాణ సమయంలో యధాతధంగా ఏవిధంగా అమలుచేయాలో శిక్షణ ఇస్తారు. ఇంతకు ముందు పట్టణాభివృద్ధి సంస్థకు చెందిన 20 మంది అధికారులకు సింగపూరులో శిక్షణ పొందారు.
ఇక మరో తాజా విశేషం ఏమిటంటే, రాజధాని నిర్మాణం కోసం కేంద్రం తొలివిడతగా రూ.1600 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని మునిసిపల్ శాఖా మంత్రి పి. నారాయణ మీడియాకు తెలిపారు. అందులో కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ రూ.1,000 కోట్లు, కేంద్ర ఆర్ధిక శాఖ రూ.600 కోట్లు విడివిడిగా మంజూరు చేశాయని, అవి మరొక వారం పది రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం తొలివిడతలో రూ.20, 000 కోట్లు నిధులు విడుదల చేయాలని కోరగా కేంద్రం కేవలం రూ.1600 కోట్లు మాత్రమే మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ కాపీని కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన తరువాత దానిని పరిశీలించి, అవసరాన్ని బట్టి తగినన్ని నిధులు విడుదల చేస్తామని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి యం.వెంకయ్య నాయుడు హామీ ఇచ్చారు. మాస్టర్ ప్లాన్ కాపీ ఎలాగూ త్వరలోనే చేతికి అందబోతోంది కనుక దాని ఆధారంగా మరిన్ని నిధులు విడుదల చేయమని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరే అవకాశం ఉంది.
మే నెల రెండవ వారంలో రాజధాని నిర్మాణానికి శంఖు స్థాపన చేయాలనుకొంటున్నట్లు మంత్రి నారాయణ ఇదివరకే తెలిపారు. తగినన్ని నిధులు, మాస్టర్ ప్లాన్ చేతికి వచ్చినట్లయితే శంఖు స్థాపన కార్యక్రమం పూర్తి చేసి వెంటనే రైతుల నుండి సేకరించిన భూములలో నగర నిర్మాణానికి అనువుగా అభివృద్ధి చేయడం మొదలుపెట్టే అవకాశం ఉంది. రానున్న మూడేళ్ళలో రాజధాని ప్రధాన నగరంలో సచివాలయం, అసెంబ్లీ, కౌన్సిల్, రాజ్ భవన్, ముఖ్యమంత్రి మరియు ఇతర మంత్రులు, అధికారుల కార్యాలయాలు, నివాస సముదాయాల నిర్మాణం పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.