కాషాయీక‌ర‌ణ నుంచి.. కిష‌న్ మార్క్ కార్పొరేటీక‌ర‌ణ దిశ‌గా బీజేపీ?

రాజాసింగ్ ఎపిసోడ్ చెబుతున్నదిదేనా?

గంగ పూర్తిగా చంద్ర‌ముఖిగా మారింద‌ని ఒక సినిమా డైలాగ్. తెలంగాణ బీజేపీ కూడా అలా కాషాయీక‌ర‌ణ నుంచి కిష‌న్ రెడ్డీక‌ర‌ణ చెందిన‌ట్టేనా? ఆయ‌న్ను వ్య‌తిరేకించిన వారు, ఆయ‌న గుట్టు ర‌ట్టు చేసిన వారి జాడే లేకుండా పోతుందా? అన్న చ‌ర్చ‌కు తెర‌లేచింది. ఇప్పుడంద‌రి మాట ఏంటంటే గోషా మ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా ఆయ‌న‌కేం పెద్ద‌గా న‌ష్టం క‌లిగించ‌దు. ఎందుకంటే ఆయ‌న ఇప్పుడు ఆ నియోజ‌క‌వ‌ర్గంలో బీజేపీని మించి పోయారు. బీజేపీ హ‌వా లేకున్నా గెలుస్తారు. ఉన్నా గెలుస్తారు. ఆయ‌న ఇండిపెండెంట్ గా గెలుస్తారు. పార్టీ టికెట్ మీదా గెలుస్తారు. ఇప్పుడాయ‌న‌ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప‌రిచ‌యం అవ‌స‌రం లేని హిందుత్వ బ్రాండ్ గా రూపాంత‌రం చెందార‌ని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఇప్పుడు స‌మ‌స్య అంతా ఏంటంటే రాజా సింగ్  తెలంగాణ బీజేపీకి ఒరిజిన‌ల్ సీడ్. కిష‌న్ రెడ్డ‌యినా అంబ‌ర్ పేట్ లో ఓడిపోతారేమోగానీ.. ఆయ‌న మాత్రం త‌న సెగ్మెంట్లో అస్స‌లు ఓడ‌రు. అంత‌టి సాలిడ్ ఓటు బ్యాంకు రాజాసింగ్  సొంతం. అలాంటి రాజాసింగ్ అంటే సిస‌లైన‌ కాషాయ సైనికుడు.  బీజేపీ దాని పొలిటిక‌ల్ డైన‌మిక్స్ ని ఆయన ఎప్పుడో దాటి పోయార‌న్న పేరుంది. ఒక ర‌కంగా చెబితే బీజేపీలో మ‌రే సాధార‌ణ నేత కూడా కామెంట్ చేయ‌లేని ఎన్నో అంశాల‌పై ఆయ‌న సంచ‌ల‌న కామెంట్లు చేసి స‌స్పెండ్ అయిన ప‌రిస్థితులున్నాయి. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఓల్డ్ సిటీలో ఎంఐఎంని ఢీ కొట్ట‌గ‌లిగే వారే లేరు. కానీ ఎంఐఎంని దాని విధానాల‌ను తూర్పార ప‌ట్ట‌గ‌ల ఒకే ఒక్క‌డుగా రాజాసింగ్ తనదైన గుర్తింపు పొందారు.

అలాంటి రాజాసింగ్ లేని బీజేపీ నేతి బీరకాయలో నెయ్యి అన్న చందంగా కాషాయంలేని కాషాయ పార్టీగా బీజేపీ మిగిలిపోతుందని అంటున్నారు.  ఇప్పుడు అక్క‌డున్న ఎమ్మెల్యే, ఎంపీల్లోనూ చాలా మందిది బేసిగ్గా ఈ పార్టీ కానే కాదు. హిందుత్వ భావజాలం అసలే లేదు.  మ‌రీ ముఖ్యంగా ఈట‌ల‌, డీకే అరుణ, కొండా విశ్వేశ్వరరెడ్డి వంటి వారు వేరే వేరే పార్టీల నుంచి కమలం గూటికి చేరారు. మరీ ముఖ్యంగా  ఈట‌ల విషయమే తీసుకుంటే ఆయన వామపక్ష సానుభూతి పరుడిగా గుర్తింపు పొందారు. ఇప్పుడు బీజేపీ శ్రేణులే ఆయనను బీఆర్ఎస్ కోవర్టుగా అభివర్ణిస్తున్నారు.  కాళేశ్వ‌రం అంశంలో బీఆర్ఎస్ ఇంత‌గా విచార‌ణ ఎదుర్కుంటుండ‌గా.. ఆయ‌న కూడా హాజ‌రైన సంగ‌తి తెలిసిందే. ఆ సందర్భంగా ఆయన బీఆర్ఎస్ కు కేసీఆర్ కు అనుకూలంగా మాట్లాడారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. 

ఇలా చెప్పుకుంటూ పోతే.. ప్రస్తుతం బీజేపీలో ఉన్న వారిలో చాలా మంది మూలాలు ఆర్ఎస్ఎస్ భావ‌జాలం కాదు. కేవ‌లం రాజ‌కీయ అనివార్యత వల్లనే కమలం గూటికి చేరిన వారి సంఖ్యే ఎక్కువగా ఉంది.  అలాంటి పార్టీలో ద ఒరిజిన‌ల్ కాషాయ ర‌క్తం బ‌య‌ట‌కు వెళ్ల‌డం అంటే ఆ పార్టీ మూల సిద్ధాంతం మ‌రుగున ప‌డ్డ ప‌రిస్థితులున్న‌ట్టుగానే భావించాల‌ని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

దీనంత‌టి వెన‌క కిష‌న్ రెడ్డి ఉన్న‌ట్టుగా పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతున్నది. బేసిగ్గా కిష‌న్ రెడ్డి గురించి రాజా సింగ్ గ‌తంలో  అధికారంలో ఎవ‌రుంటే వారితో కిష‌న్ చెట్టాప‌ట్టాలేసుకుని తిరుగుతార‌ని.. ఉగ్ర‌వాదం మీద పోరు చేస్తూనే ఉగ్ర‌వాదుల‌తో క‌ల‌సి వ్యాపారాలు చేసే అమెరిక‌న్ ప్రెసిడెంట్ల‌క‌న్నా పెద్ద ప్ర‌మాద‌కారి అనీ ఆరోపణలు, విమర్శలూ చేసిన సంగతి తెలిసిందే.  

అలాంటి కిష‌న్ రెడ్డి ఆడమన్నట్లు పార్టీ అధిష్టానం ఆడుతోందనీ.. కార‌ణం ఆయ‌న కేంద్ర అధిష్టాన పెద్ద‌ల‌కు అత్యంత ద‌గ్గ‌రి వాడు కావ‌డమేననీ, అందుకనే సాధార‌ణ కార్య‌క‌ర్త‌కు పార్టీలో చోటు ద‌క్క‌కుండా  పోతోంద‌నీ.. తెలంగాణలో ప్రస్తుత   ఇది ఒక‌ప్ప‌టి కాషాయ పార్టీ కాద‌ని..  పూర్తి కిష‌న్ మార్క్ క‌మ‌ర్షియ‌ల్ వ‌ర్షెన్ అని రాజాసింగ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పైకి చెప్పకపోయినా తొలి నుంచీ బీజేపీలో ఉన్నవారు అంతర్గత సంభాషణల్లో  రాజాసింగ్ తో ఏకీభవిస్తున్నారు. ఇక రాజాసింగ్ క్రమశిక్షణ గీత దాటారంటూ  రాణి రుద్ర‌మ వంటి చోటా మోటా లీడర్ల వివరణలను  పార్టీలో ప‌ద‌వుల వెంప‌ర్లాట కొద్దీ చేస్తున్నవిగా కొట్టి పారేస్తున్నారు రాజాసింగ్ మద్దతుదారులు. మొత్తానికి ఈ కాషాయ‌ త‌గువులాట ఎక్క‌డి వ‌ర‌కూ వెళ్తుందో చూడాలి.

Teluguone gnews banner