గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగరేయడమే లక్ష్యం : రామచందర్‌రావు
posted on Jul 1, 2025 @ 4:55PM
తెలంగాణ భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల అధికారి అయిన కేంద్ర మంత్రి శోభా కరండ్లాజే ప్రకటించారు. ఈ మేరకు రామచందర్‌రావుకు నియామిక పత్రాన్ని అందించారు. అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నుంచి కొత్త అధ్యక్షుడు రామచందర్‌రావు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతు బీజేపీలో పదవులు ముఖ్యం కాదని ఆయన అన్నారు. "రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరున్నా ఫర్వాలేదు. మన పార్టీకి కార్యకర్తలే నిజమైన నాయకులు, వాళ్లే మన బలం. నాయకత్వంలో ఎవరున్నా అందరూ ఐక్యంగా పనిచేయాలి అని ఆయన పిలుపునిచ్చారు.
నూతన అధ్యక్షుడు రామచందర్‌రావు నాయకత్వంలో నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలని కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్‌ను అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమని రామచందర్‌రావు అన్నారు. స్టేట్ చీఫ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన అనంతరం మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన పార్టీ సభలో ఆయన తొలిసారిగా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. తనను సౌమ్యుడిగా భావించవద్దని, ప్రజా సమస్యలపై పోరాటంలో తాను ఎప్పుడూ ముందే ఉంటానని ఆయన హెచ్చరించారు. గోల్కొండ కోటపై కాషాయ జెండాను ఎగరేస్తామని పిలుపునిచ్చారు. ఎంతోమంది కార్యకర్తలు, నేతల త్యాగాల పునాదులపైనే బీజేపీ నేడు ఈ స్థాయిలో నిలిచిందని రామచందర్‌రావు అన్నారు.
ప్రజాస్వామ్యబద్ధమైన, వికసిత తెలంగాణ నిర్మాణం బీజేపీతోనే సాధ్యం. అందుకే ప్రజలు మనవైపు ఆశగా చూస్తున్నారు. అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త ప్రజల్లోకి వెళ్లాలి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ దుందుభి మోగించాలి" అని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా వంటి జాతీయ నాయకత్వం సహకారంతో తెలంగాణలో పార్టీని మరింత ముందుకు నడిపిస్తానని ధీమా వ్యక్తం చేశారు. రాంచందర్ రావు ఒక మిస్సైల్ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కిషన్ రెడ్డి, నేను, లక్ష్మణ్ అధ్యక్షుడిగా ఉన్నపుడు మమ్మల్ని ట్రోల్ చేసే వారని బండి సంజయ్ పేర్కొన్నారు. నరేంద్రమోదీ ప్రధాన మంత్రి అయ్యాక కూడా చాయి అమ్ముకునే వాడు ప్రధాని ఏంది అని ట్రోల్ చేశారని కేంద్ర మంత్రి అన్నారు.