ఇప్పుడిస్తున్న జీతమే ఎక్కువ.. తగ్గించేద్దాం! సీఎంకు సీఎస్ కమిటి నివేదిక...

ఏపీ ఉద్యోగులకు సీఎస్ కమిటి షాకిచ్చింది. పీఆర్సీ ప్రతిపాదనల్లో ఉద్యోగులకు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. పీఆర్సీతో వేతనాలు పెరుగుతాయని ఉద్యోగులు ఆశిస్తుంటే.. సీఎస్ కమిటీ మాత్రం జీతాలు తగ్గేలా ప్రతిపాదనలు చేసింది. ఉద్యోగులకు ఇప్పుడు ఇస్తున్న జీతభత్యాలే ఎక్కువ. అంత అవసరంలేదు. తగ్గించేద్దామంటూ  సర్కారుకు సిఫారసు చేసింది. అసలు పీఆర్సీ నివేదికను గుట్టుగా దాచేసిన రాష్ట్ర ప్రభుత్వం... వ్యూహాత్మకంగా సీఎస్‌ కమిటీ నివేదికను బయటపెట్టింది. ఆ కమిటీ సిఫారసులు అమలైతే... ఉద్యోగుల జీతాలు పెరగడం కాదు, భారీగా తగ్గుతాయి.

పీఆర్సీ కమిషన్‌ 27 శాతం సిఫారసు చేసిందంటూనే... 14.29 శాతం ఇస్తే చాలు అని సీఎస్‌ కమిటీ పరోక్షంగా తేల్చింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 7వ సీపీసీ పదేళ్లకు 14.29 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చిందని తెలిపింది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇంతే ఇచ్చాయని పేర్కొంది. కానీ... ఈ పదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండు విడతల్లో కలిపి ఏకంగా 82 శాతం ఫిట్‌మెంట్‌ లభించిందని... ఇది చాలా ఎక్కువని అభిప్రాయపడింది. సీఎస్‌ కమిటీ సిఫారసు ప్రకారం... ఫిట్‌మెంట్‌ 14.29 శాతం చేస్తే, ఒక్కొక్కరి మూలవేతనంలో 12.71 శాతం తగ్గుతుందని చెబుతున్నారు. 

ఫిట్‌మెంట్‌కు ఎసరు పెట్టిన సీఎస్‌ కమిటీ... హెర్‌ఆర్‌ఏలోనూ భారీ మతలబులు చేసింది. ప్రస్తుతం... ఉద్యోగులు నివసిస్తున్న నగరాల జనాభా ప్రాతిపదికన 10 శాతం, 20 శాతం, 30 శాతం హెచ్‌ఆర్‌ఏ అమలవుతోంది. సెక్రటేరియట్‌, హెచ్‌వోడీ ఉద్యోగులందరికీ 30 శాతం హెచ్‌ఆర్‌ఏ వస్తోంది. ‘అంత అవసరం లేదు’ అని సీఎస్‌ కమిటీ అభిప్రాయపడింది. ‘‘రాష్ట్ర విభజన తర్వాత... హైదరాబాద్‌ నుంచి ఏపీకి వచ్చిన ప్రభుత్వ ఉద్యోగులకు తాత్కాలిక చర్యగా 30 శాతం హెచ్‌ఆర్‌ఏను, పరిమిత కాలానికి మాత్రమే అందించాలని నిర్ణయించినట్లు గుర్తించాం. ఉద్యోగులు అమరావతికి వచ్చి ఆరేళ్ల తర్వాత కూడా దీనిని కొనసాగించడం సహేతుకం కాదు. 30 శాతం హెచ్‌ఆర్‌ఏను నిలిపివేయాలి’’ అని తెలిపింది. 5లక్షల నుంచి 50 లక్షల వరకు జనాభా ఉన్న నగరాల్లో నివసించే ఉద్యోగులందరికీ 16 శాతం హెచ్‌ఆర్‌ఏ ఇవ్వాలని సిఫారసు చేసింది. 5 లక్షల్లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో నివసించే వారికి 8 శాతం హెచ్‌ఆర్‌ఏ ఇవ్వాలని సూచించింది. ఇక... 50 లక్షలకు మించిన జనాభా ఉన్న నగరాల్లో నివసించే వారికి 24 శాతం హెచ్‌ఆర్‌ఏ ఇవ్వాలని తెలిపింది. 

మన రాష్ట్రంలో 50 లక్షల జనాభా ఉన్న నగరం ఒక్కటీ లేదు.సీఎస్‌ కమిటీ సిఫారసులు అమలు చేస్తే సచివాలయం, హెచ్‌వోడీ ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏ 30 శాతం నుంచి ఒకేసారి 16కు తగ్గుతుంది. ఇక... కొన్ని జిల్లా కేంద్రాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు ఇప్పుడు అందుతున్న 20 శాతం హెచ్‌ఆర్‌ఏ కూడా 4 శాతం తగ్గి, 16కు చేరుతుంది. మండల, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇప్పుడు 12.5 శాతం హెచ్‌ఆర్‌ఏ అందుతోంది. సీఎస్‌ కమిటీ సిఫారసుల ప్రకారం... 5 లక్షలలోపు జనాభా ఉన్న అన్ని ప్రాంతాలు/పట్టణాల్లోని ఉద్యోగులకు 8 శాతం హెచ్‌ఆర్‌ఏ మాత్రమే అమలవుతుంది. అందరికీ... పల్లె నుంచి రాజధాని అమరావతి దాకా పనిచేస్తున్న ఉద్యోగులందరికీ హెచ్‌ఆర్‌ఏలో కోత పడుతుంది. 

నగరాల్లో పనిచేసే ఉద్యోగులకు ఇచ్చే ఉద్యోగులకు సిటీ కంపెన్సేటరీ అలవెన్సు (సీసీఏ) అందుతోంది. విజయవాడ, విశాఖ నగరాల్లో పనిచేసే వారికి రూ.400, ఇతర మునిసిపాలిటీల్లోని ఉద్యోగులకు రూ.300 సీసీఏగా అందుతోంది. దీనిని... రూ.వెయ్యి, రూ.700లకు పెంచాలని అశుతోష్‌ మిశ్రా కమిషన్‌ సూచించింది. కానీ... సీఎస్‌ కమిటీ మాత్రం అసలు సీసీఏ అక్కర్లేదని తేల్చేసింది. దానిని పూర్తిగా ఎత్తేసింది.కేంద్రం అనుసరించిన విధానాల ప్రకారమే రాష్ట్రంలో కూడా పీఆర్సీ అమలు చేస్తున్నామని చెబుతున్నప్పటికీ...  కేంద్ర ఉద్యోగుల వేతనాలే ఎక్కువగా ఉంటున్నాయి.

ఇళ్లు, వాహనాలు, పర్సనల్‌ కంప్యూటర్ల కొనుగోలు కోసం ఇచ్చే లోన్లను ఇప్పటి వరకు ప్రభుత్వం ఇచ్చేది. ఇకపై బ్యాంకులతో టైఅప్‌ అయి తీసుకోవాలని... 2.5 శాతం వడ్డీ రాయితీ ఇవ్వాలని మిశ్రా కమిషన్‌ సిఫారసు చేసింది. దీనిని సీఎస్‌ కమిటీ యథాతథంగా ఆమోదించింది. మహిళా ఉపాధ్యాయుల తరహాలో ప్రభుత్వ రంగంలోని ఇతర మహిళా ఉద్యోగులకు కూడా ఏడాదిలో అదనంగా  5 రోజుల క్యాజువల్‌ లీవులు ఇవ్వాలని నిర్ణయించారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu