టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
posted on Mar 30, 2011 @ 2:16PM
మొహాలీ: భారత, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న సెమీస్‌లో భారత్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మొహాలీ పిచ్‌పై టాస్ అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. ఈ పిచ్ బ్యాటింగుకు అనుకూలిస్తుంది. బ్యాటింగ్ బలంతో పాకిస్తాన్‌పై ఆధిపత్యం సాధించాలని ఇండియా భావిస్తోంది. టీమిండియా జట్టులో అశ్విన్ స్థానంలో నెహ్రాకు చోటు దక్కింది. గాలివాటం నెహ్రాకు అనుకూలిస్తుందని ధోనీ భావిస్తున్నాడు. సెమీ ఫైనల్ గెలిస్తే ఫైనల్ మ్యాచు గెలిచినట్లేనని భావిస్తున్నారు. అలాగే పాక్ జట్టులో షోయబ్ రెండో ఫిట్‌నెస్ పరీక్షలోనూ విఫలం కావటంతో అతని స్థానంలో వాహబ్‌కు అవకాశం లభించింది. మ్యాచును తిలకించడానికి పాకిస్తాన్ ప్రధాని యూసుఫ్ రజా గిలానీతో పాటు భారత ప్రధాని మన్మోహన్ సింగ్ మొహాలీ చేరుకున్నారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆయన కుమారుడు రాహుల్ గాంధీ, కూతురు ప్రియాంకా గాంధీ మొహాలీ చేరుకున్నారు. భారత ఉప ఖండానికే ప్రపంచ కప్ టైటిల్ దక్కుతుందనేది ఖాయమైనప్పటికీ ఫైనల్‌కు భారత్, పాకిస్తాన్‌ల్లో ఏ జట్టు చేరుతుందనేది ఆసక్తికరంగా మారింది. అతిరథ మహారథుల సాక్షిగా దేశ ప్రధానుల సమక్షంలో ఇరుదేశాల్లోనూ కలిపి 150 కోట్ల మంది ప్రేక్షకులు చూస్తుండగా వేల కోట్ల రూపాయలు చేతులు మారుతున్న సమయాన చావోరేవో తేల్చుకునేందుకు దాయాది దేశాలు సిద్ధమయ్యాయి.