పత్రికల్లో మళ్ళీ పెయిడ్ ఆర్టికల్స్
posted on Mar 2, 2012 9:21AM
తెలుగువన్.కామ్ స్పెషల్ స్టోరీ
హైదరాబాద్: రాష్ట్రంలో ఉప ఎన్నికల జరగబోతున్న అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మళ్ళీ వివిధ పత్రికల్లో పెయిడ్ ఆర్టికల్స్ దర్శనమిస్తున్నాయి. అభ్యర్ధుల ప్రచార వ్యయాలపై ఆంక్షలు ఉండటంతో వారు తెలివిగా పత్రికలకు వ్యాపార ప్రకటనలు ఇవ్వకుండా ఆర్టికల్స్ రాయించుకుని ఆ ఆర్టికల్స్ కు డబ్బు చెల్లిస్తున్నారు. ఇటువంటి ఆర్టికాల్స్ ఆయా అభ్యర్ధుల ఇంటర్వ్యూల రూపంలోనూ, లేదా ఆయా అభ్యర్ధుల గెలుపు తధ్యమంటూనో స్టోరీల రూపంలో ఉంటాయి. ఇటువంటి పెయిడ్ ఆర్టికల్స్ ను ఎన్నికల సంఘం నిషేధించినప్పటికీ రాష్ట్రంలోని ప్రధాన పత్రికలన్నీ ఆదాయాన్ని పెంచుకోవడానికి ఈ ఆంక్షలు కాలరాస్తున్నాయి. తమ యాడ్ ఎగ్జిక్యూటివ్ లు అభ్యర్ధుల శిబిరాల్లో మోహరించి పెయిడ్ ఆర్టికల్స్ కోసం వెంటపడుతున్నారు. రాష్ట్రంలోని మూడవ అత్యధిక సర్క్యులేషన్ పత్రిక అయితే పెయిడ్ ఆర్టికల్స్ ద్వారా ఆదాయం పొందడానికి కొత్త మార్గాన్ని ఎంచుకుంది. ఉప ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో అన్ని పార్టీల అభ్యర్ధులకు అనుకూలంగా ఇప్పటికే ఫోటోలతోకూడిన వ్యాసాలను తయారుచేయించింది. వీటిని తమ యాడ్ ఎగ్జిక్యూటివ్స్ ద్వారా ఆయా అభ్యర్ధుల వద్దకు పంపుతుంది. అంటే ఆయా అభ్యర్ధుల కనీసం ఇంటర్వ్యూలు కూడా ఇవ్వనక్కరలేదు. వారు ఏం చెప్పాలనుకుంటారో పత్రికలోని సబ్ ఎడిటర్లే రాసేస్తుంటారు. విజయావకాశాలు అతనికే ఉన్నాయంటూ జోస్యం చెబుతారు. ఇలా అందరికీ విజయావకాశాలు ఉన్నాయంటూ అందరి పేరునా వ్యాసాలు తయారుచేయించడం విశేషం. ఇప్పటికే కొన్ని ఆర్టికల్స్ ప్రధాన పత్రికల్లో దర్శనమిచ్చాయి. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే తాటికాయంత అక్షరాల్లో హెడ్డింగులు పెట్టి వార్తలు రాసే ఈ పత్రికలూ పెయిడ్ ఆర్టికల్స్ ఎన్నికల నిబంధనలకు విరుద్దమైనప్పటికీ డబ్బుకోసం కక్కుర్తి పడి వాటిని తమ పత్రికల్లో ప్రచురించడం శోచనీయం.