రాజకీయాల్లోకి దివాకర్ తనయుడు పవన్
posted on Mar 2, 2012 @ 9:49AM
అనంతపురం: రాష్ట్ర రాజకీయాల్లో మరో రాజకీయ వారసుడు అరంగేట్రం చేయబోతున్నాడు. అనంతపురం జిల్లా రాజకీయాలను శాసించి మంత్రి పదవిని కూడా చేపట్టిన జెసి దివాకర్ రెడ్డి హఠాత్తుగా రాజకీయ వైరాగ్యంలో మునిగిపోయారు. వచ్చే ఎన్నికల్లో తాడిపత్రి నుంచి తాను పోటీ చేయనని ప్రకటించారు. రాష్ట్ర రాజకీయాల నుంచి జాతీయ రాజకీయాలు, జాతీయస్థాయి పదవులపై జెసి దివాకర్ రెడ్డి కన్నువేశారని తెలిసింది. తాడిపత్రిలో తన స్థానంలో తన వారసుడు పవన్ ను దింపాలని ఆయన యోచిస్తున్నట్లు తెలియవచ్చింది. పవన్ 2009 సార్వత్రిక ఎన్నికల్లో తండ్రి తరపున తాడిపత్రి నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేశారు. అంతకు ముందు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా పవన్ కుమార్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారంలో పాల్గొన్నారు. మరోవైపు ఆయన సోదరుడు జెసి ప్రభాకరరెడ్డి కూడా రాజకీయాల్లోకి చురుగా పాల్గొంటున్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో అనంతపురం టిక్కెట్ కోసం ప్రభాకరరెడ్డి తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యారు. అన్నదమ్ముల మధ్య సయోధ్య ఉన్నప్పటికీ తాడిపత్రి తన కొడుకు పవన్ కుమార్ నే రంగంలోకి దించాలని జెసి యోచిస్తున్నట్లు తెలిసింది. జెసి దివాకర్ రెడ్డి వరుసగా ఆరు సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు.