విషతుల్యంగా మారిన పటాన్ చెరు పారిశ్రామిక వాడ
posted on Mar 1, 2012 @ 2:14PM
హైదరాబాద్: హైదరాబాద్ సమీపంలోని పటాన్ చెరు పారిశ్రామిక వాడ విషతుల్యంగా మారింది. ఇక్కడ రసాయన పదార్దాలు తయారుచేసే పరిశ్రమలు ఇరవై ఉన్నాయి. ఇవి నిత్యం గాలిలో వదులుతున్న వాయువులు, భూమిపై వదిలేస్తున్న కలుషిత జలాలతో ఈ ప్రాంతం విషతుల్యంగా మారింది. ఈ ప్రాంతానికి సమీపాన ఉన్న ప్రజలు నిత్యం విషవాయువులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ముసలివారు తీవ్ర అస్వస్తతకు గురవుతున్నారు. ఈ ప్రాంతంలోని భూగర్భ జలాలన్నీ ప్రమాదకర రసాయనాలతో విషతుల్యంగా మారాయి. ఇక్కడున్న పరిశ్రమల్లో కొన్ని రసాయన విష జలాలను రాత్రివేళల్లో ట్యాంకులపై తరలించి సమీపాన ఉన్న అటవీ ప్రాంతంలో కుమ్మరిస్తున్నాయి. దీంతో అటవీప్రాంతం కూడా తీవ్రంగా నష్టపోతోంది. ఈ కలుషిత నీటివల్ల పారిశ్రామిక వాడ చుట్టుప్రక్కల ప్రాంతాలు బీడుగా మారాయి. ఈ కంపెనీలు బాధ్యతారాహిత్యంగా వదులుతున్న కలుషిత నీటిని తాగి గేదెలు, వన్యప్రాణులు మరణిస్తున్నాయి. ఈ దారుణాన్ని నివారించాల్సిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఈ పరిశ్రమల యజమానులకు కొందరు ప్రజా ప్రతినిధులు వత్తాసు పలుకుతుండటంతో బోర్డు అధికారులు నిస్సహాయులవుతున్నారు.