అంగన్ వాడీలకు అష్టకష్టాలు
posted on Mar 1, 2012 @ 1:50PM
అరకొర వేతనం....అదనపు భారం
హైదరాబాద్: అంగన్ వాడీలు అందించే సేవలను, చేసే సపర్యలను పరికించి చూస్తే వారిని సమాజానికి సేవలందించే మాత్రు మూర్తులుగా అభివర్ణించవచ్చు. గర్భిణులకు ప్రసవం, ఆ తర్వాత జన్మించిన శిశువుకు పౌష్టికాహారం అందించడం, ఆరోగ్య సూచనలు ఇవ్వడం ఇలా అడుగడుగునా తల్లి బిడ్డల ఆరోఘ్య సంరక్షణకు నిరంతరం శ్రమిస్తున్నారు. కానీ వీరికి ప్రభుత్వం అందించే ప్రోత్సాహం అంతంత మాత్రమే. వీరిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం లేదు, కనీసం కనీస వేతనాలు కూడా ఇవ్వడం లేదు. ఇంటి అద్దెలు, పంట చెరకుకు అయ్యే అదనపు ఖర్చులను అంగన్ వాడీలే తమ అరకొర జీతాల నుంచి భరిస్తున్నారు. అంగన్ వాడీ కార్యకర్తలకు కేవలం రూ.2200 మాత్రమే చెల్లిస్తున్నారు. అనేక ఏళ్ళుగా ఈ కేంద్రాల్లో పనిచేస్తున్న వారికి ఉద్యోగ భద్రత లేదు. రిటైర్మెంట్ అయ్యాక అందే బెనిఫిట్స్ అంగన్ వాడీలకు అందడం లేదు. గతంలో వీరికి సూపర్ వైజర్ టెస్టుల ద్వారా ప్రమోషన్స్ ఇచ్చేవారు. పదేళ్లుగా ఇటువంటి ప్రమోషన్లు నిలిచిపోయాయి. ఈ కేంద్రాల నిర్వహణకు అద్దెలను ప్రభుత్వమే చెల్లిస్తున్నప్పటికీ ఆ అద్దెలు సకాలంలో అందడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.200, పట్టాణ ప్రాంతాల్లో రూ.500 మాత్రమే అద్దెలుగా చెల్లిస్తున్నారు. ఈ అరకొర డబ్బుకు చిన్న చిన్న గదులు కూడా అద్దెకు రావడం లేదు. పలు సమస్యలతో సతమతమవుతున్న అంగన్ వాడీ కార్యకర్తలు గత్యంతరం లేక దేశవ్యాప్త సమ్మెకు దిగారు.