Read more!

మీకూ  శ్వాస సమస్యలున్నాయా? దీపావళి సీజన్ లో ఈ జాగ్రత్తలు  పాటించండి!

 

దీపావళి అంటే చిన్నా పెద్ద అందరికీ చాలా ఇష్టం.  ఈ పండుగ రోజున పెద్దలు కూడా చిన్నపిల్లలలై తమ పిల్లలతో కలసిపోతారు. ఒకప్పుడు దీపావళి అంటే ఇల్లంతా దీపాలు పెట్టడం, కాసిన్ని టపాసులు పేల్చడం జరిగేది. కానీ ఇప్పుడు మాత్రం అలా లేదు. కేవలం దీపావళి మాత్రమే కాదు శుభకార్యాలు, జాతరలు, ఉత్సవాలు, సినిమా రిలీజ్ ఫంక్షన్లు, రాజకీయనాయకుల రాక, సినీతారల రాక ఇలా చాలా సందర్బాలలో  బాణసంచా పెద్ద ఎత్తున కాలుస్తారు. కాలం గడిచే కొద్దీ వాహనాల రద్దీ ఎక్కువ కావడం, వాయు కాలుష్యం పెరుగుతూ వస్తోంది. దీనికారణంగా గతంతో పోలిస్తే శ్వాస సంబంధ సమస్యలు కూడా ఎక్కువ అయ్యాయి. ఇక దేశం అంతా పెద్ద ఎత్తున జరుపుకునే దీపావళి నాడు బాణసంచా చాలా ఎక్కువగానే కాలుస్తారు. ఈ సమయంలో ఆరోగ్యపరంగా అందరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తెలుసుకోవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి.

శ్వాస సంబంధ సమస్యల ముప్పు..

ఇప్పటికే ఆస్తమా, ఊపిరితిత్తుల బలహీనత, ఇతర శ్వాస సంబంధ సమస్యలు ఉంటే దీపావళి సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.  బాణసంచా కాల్చినప్పుడు వెలువడే సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, చిన్న రేణువులతో కూడిన అనేక హానికరమైన వాయువులను విడుదల చేస్తాయి. ఇవి గాలిని కలుషితం చేస్తాయి. ఇవి శ్వాసకోశ  వ్యవస్థ ద్వారా శరీరంలోకి ప్రవేశించి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగిస్తాయి.  ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే శ్వాస సంబంధ సమస్యలున్నవారు  చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ పొగకు దూరం ఉండాలి.

ముందు చూపు..

ఆస్తమా, శ్వాస కోశ సమస్యలున్నప్పుడు  చాలామంది ఇన్ హేలర్ ఉపయోగిస్తుంటారు. బాణసంచా పొగ, వాతావరణ కాలుష్యం మొదలైనవి ఎక్కువగా ఉండే ఈ సమయంలో బయట ఉన్నప్పుడు, అందరిలో సందడిగా ఉన్నప్పుడు ఉన్నట్టుండి సమస్యలు ఎదురయ్యే అవకాసశం  ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా  ఇన్ హేలర్ ను వెంట ఉంచుకోవాలి.  శ్వాస సమస్యలు ఏర్పడినప్పుడు ఇన్ హేలర్ లు చాలా గొప్పగా సహాయపడతాయి.

మాస్క్..

కరోనా వచ్చినప్పటి నుండి మాస్క్ వినియోగం పెరిగింది. ఆ మాస్క్ లు అంటువ్యాధుల నుండే కాదు విపరీతమైన వాయు కాలుష్యం నుండి కూడా కాపాడుతాయి. దీపావళి బాణసంచా ప్రభావం నుండి రక్షణ కావాలి అంటే మాస్క్ ధరించడం చాలా మంచిది. ఇది శ్వాసకోశ సమస్యలు తలెత్తకుండా నిరోధిస్తుంది.

బయటకు వెళ్లొద్దు..

ఆస్తమా, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు బాధిస్తుంటే దీపావళి బాణసంచా కాల్చే సమయంలో అసలు బయటకు వెళ్లకుండా ఉండటం ఎంతో మేలు. ఇంట్లో కూడా గాలి వెలుతురు బాగా ఉండేలానూ, గాలి కాలుష్యం అరికట్టడానికి ఎయిర్ ప్యూరిపైయర్లు, గాలి కాలుష్యాన్ని అరికట్టే ఇండోర్ మొక్కలు వంటివి  పెంచుకోవాలి. దీనివల్ల సమస్యను అరికట్టచ్చు.  ఒక వేళ బయటకు తప్పనిసరిగా వెళ్లాల్సివస్తే మాస్క్ తో వెళ్లాలి, అలాగే వెంట ఇన్ హేలర్ ఉంచుకోవాలి.

                              *నిశ్శబ్ద.