Read more!

మౌత్ వాష్ వాడే అలవాటుందా? ఈ నిజాలు తెలుసుకోవాల్సిందే.!

నలుగురిలో మాట్లాడాలన్నా, నవ్వాలన్నా, అందరి ముందు ఆహారం తినాలన్నా దంత సంరక్షణ, నోటి ఆరోగ్యం బాగుండాలి. అయితే చాలామంది నోటి శుభ్రత, దంతాల రంగు విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. నోరు దుర్వాసన లేకుండా తాజాగా ఉండాలన్నా, దంతాలు తెల్లగా ఉండాలన్నా  మంచి టూత్ పేస్ట్, మౌత్ వాష్ వాడుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా చిన్న పిల్లలు పళ్లు సరిగ్గా తోముకోరనే కారణంతో వారికి మౌత్ వాష్ ఉపయోగిస్తుంటారు. కానీ మౌత్ వాష్ వాడటం ప్రమాదాలతో కూడుకుని ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అసలు మౌత్ వాష్ వాడటం ఎంతవరకు సేఫ్? వీటిని వాడితే జరిగేదేంటి?

మౌత్ వాష్ లో ఏముంటుంది?

మార్కెట్లో బోలెడు మౌత్ వాష్ లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో అధిక మొత్తంలో ఇథనాల్ ఉంటుంది.  మరీ ముఖ్యంగా ఆల్కహాల్ నుండి సేకరించిన ఎసిటాల్డిహైడ్ అనే రసాయం ఉంటుంది. ఇది క్యాన్సర్ కారకం. క్యాన్సర్ రావడానికి ప్రేరేపిస్తుంది.  ఏ మౌత్ వాష్ అయినా సరే.. వాటిలో 25శాతం కంటే ఎక్కువ ఆల్కహాల్ ఉంటుంది.

ఎంత వరకు సేఫ్..

మౌత్ వాష్ సేఫా కాదా అనే విషయం గురించి వైద్యులు స్పష్టంగా చెబుతున్నారు. దంత సంరక్షణకు, నోటి శుభ్రతకు ఇది మంచిదే అయినప్పటికీ మౌత్ వాష్ ఎక్కువ వాడితే మాత్రం నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంటుందని చెబుతున్నారు. మౌత్ వాష్ ను మితంగా వాడితే అది దంతాల మీద మరకలను, దంతాల  మధ్యలో ఉండే మురికిని తొలగిస్తుంది. నోటికి తాజాదన్నాన్ని కూడా ఇస్తుంది. కానీ మౌత్ వాష్ ఎక్కువ  వాడటం వల్ల అది నోటి క్యాన్సర్ కు దారితీస్తుంది.

మౌత్ వాష్ వాడితే జరిగేది ఇదే..

మౌత్ వాష్ వాడటం వల్ల కేవలం నోటి క్యాన్సర్ మాత్రమే కాదు.. తల, మెడ, క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుందని అధ్యనాలు చెబుతున్నాయి. వీటిని ఎక్కువగా వాడే వారి నోరు తొందరగా పొడిబారుతుంది. వీటిలో ఉండే ఆల్కహాల్ దీనికి కారణం అవుతుంది.  నోటి లోపలిచర్మం చాలా సున్నితంగా మారి నోటి పూతలు, నోటి పుండ్లు, నోటి క్యాన్సర్ తొందరగా రావడానికి కారణం అవుతుంది. అందుకే మౌత్ వాష్ లను వీలైనంత అవాయిడ్ చేయడం మంచిది. ఆరోగ్యకరమైన అలావాట్లు ఉంటే దంతాలు,నోరు సహజంగానే శుభ్రంగా ఉంటాయి.  ఒకవేళ నోటి ఆరోగ్యం, దంత సంరక్షణ గురించి ఏవైనా సందేహాలు కానీ, ఇబ్బందులు  కానీ ఉంటే దంత వైద్యుడిని కలిసి సమస్య పరిష్కరించుకోవడం మంచిది.

                                        *నిశ్శబ్ద.