సబ్బం కన్నా ముందే ద్వారంపూడి?
posted on Oct 17, 2012 @ 10:14AM
విశాఖ జిల్లాకు వెళ్లాలంటే తూర్పుగోదావరి జిల్లా దాటాలి కదా! అంటే అనకాపల్లి ఎంపి సబ్బం హరి కన్నా ముందు కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి వైఎస్‌ఆర్‌సిపి బాధ్యతలు చేపడతారు. పైకి చెబుతూనే సబ్బం హరి కాంగ్రెస్‌తో కాలక్షేపం చేస్తున్నారు. ద్వారంపూడి అయితే ఏకంగా కాపురమే చేసేస్తున్నారు. తాను పచ్చికాంగ్రెస్ వాదిని అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీతో పూర్తిస్థాయి సవాసం చేస్తున్న ద్వారంపూడి ఇక పూర్తి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మారతారు. షర్మిల సమక్షంలో ద్వారంపూడి చేరిక ఉండవచ్చని ఊహాగానాలు వెలువడుతున్నాయి. సిబిఐ కేసు ప్రారంభించిన వెంటనే మద్దతు ప్రకటించిన చంద్రశేఖరరెడ్డి, జగన్మోహనరెడ్డిని కలిసి తాను కాంగ్రెస్‌ను వదిలేశానని చెప్పారు. కానీ, అధికారికంగా ఎమ్మెల్యే అవటం వల్ల ఇప్పటి దాకా కాంగ్రెస్ మంత్రులతో సర్దుకుంటున్నారు. మంత్రులు పురమాయించే పనులు చేస్తూ తనకు అవసరమైన పనులు ప్రభుత్వంతో చేయించుకుంటూ చంద్రశేఖరరెడ్డి కాలక్షేపం చేశారు. షర్మిల పాదయాత్రల సమయంలో పూర్తి బాధ్యతలు తీసుకున్న తరువాత మాత్రం జనంలో తిరగాలని ద్వారంపూడి నిర్ణయించుకున్నారు. అందుకని షర్మిల పాదయాత్రల సమాచారం తెలుసుకుని ద్వారంపూడి ఆమె రాకకోసం ఎదురుచూస్తున్నారు.