హుస్సేన్ సాగర్‌లో వినాయక నిమజ్జనాలు
posted on Sep 29, 2012 @ 1:01PM
నగరంలోని హుస్సేన్ సాగర్‌లో వినాయక నిమజ్జనాలు జోరుగా సాగుతున్నాయి. శనివారం ఉదయం నుంచే భారీ వినాయకులు సాగర్‌లో నిమజ్జనం అవుతున్నాయి. అనేక ప్రాంతాల నుంచి వస్తున్న అందమైన విగ్రహాలు ట్యాంక్‌బండ్‌పై బారులు తీరాయి. 'గణపతి బబ్బా మోరియా' అంటూ సాగరతీరమంతా మారుమ్రోగుతోంది. ట్యాంక్‌బండ్, నెక్లస్‌రోడ్డులో భక్తుల కోలాహలం నెలకొంది. చిన్నా, పెద్దా అంతా ఆనందంగా నిమజ్జన వేడుకలో పాల్గొంటున్నారు. వీలైనంత త్వరగా విగ్రహాల నిమజ్జనానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా పేరొందిన ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి ఉత్సవ కమిటీ ఏర్పాట్లు ప్రారంభించింది. విజ్ఞేష్వరున్ని తరలించడానికి 26 టైర్ల లారీని సిద్ధం చేశారు. 11 రోజుల పాటు అశేష పూజలందుకున్న మహా గణపతి శోభయాత్ర భక్తుల కోలాహలం మధ్య కొనసాగనుంది. 56 అడుగుల ఎత్తున్న వినాయకుడి నిమజ్జనాన్ని దర్శించడానికి రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులతో ఖైరతాబాద్ ప్రాంతం నిండిపోయింది.