ఉద్యమమా? విధేయతా? తేల్చుకోలేకపోతున్న టిఆర్‌ఎస్?
posted on Oct 30, 2012 8:14AM
తెలంగాణా ప్రత్యేకరాష్ట్రం సాధనే లక్ష్యంగా ఏర్పాటైన పార్టీ టిఆర్‌ఎస్. అయితే ఆ పార్టీ అధినేత కేసిఆర్ ఢల్లీలో లాబీయింగ్ ద్వారా ప్రత్యేక తెలంగాణా సాధించేందుకు పూర్తిస్థాయి ప్రయత్నాలు చేశారు. అవన్నీ బెడిసి కొట్టినందున ఇప్పుడు ఉద్యమదిశగా పయనించాలని పార్టీశ్రేణులు సిద్ధమయ్యాయి. దానికి ఇటీవల తెలంగాణామార్చ్ ద్వారా తెలంగాణాజెఎసి పాపులర్ అయింది. టిఆర్‌ఎస్ శ్రేణుల ద్వారా జెఎసి పాపులార్టీ సంపాదించిందని పరిశీలకులు తేల్చారు. దీంతో టిఆర్‌ఎస్ నాయకత్వ స్థానం నుంచి దిగజారకుండా ఉండాలంటే ఉద్యమాలు తప్పని సరి అని కేసిఆర్ మేనల్లుడు హరీశ్‌రావు అభిప్రాయపడుతున్నారు. ఆయన కేసిఆర్‌ను కూడా ఇదే విషయమై ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, కేసిఆర్ ఇటీవల మంత్రి పదవుల నియామకాన్ని పరిశీలించి ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా విధేయతకు ఓటేశారని గుర్తించారు. దీంతో పార్టీని సైతం కలిపేస్తానని తాను చేసిన ప్రకటన సోనియాను స్పందింపజేస్తుందని కేసిఆర్ భావిస్తున్నారు. అది ఆలస్యమైతే ఉనికికే ప్రమాదమని టిఆర్‌ఎస్‌లోని ఇతర నాయకులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఉద్యమం వైపు మొగ్గుచూపాలో, విధేయతను కొనసాగించాలో తేల్చుకోలేని స్థితికి కేసిఆర్ వచ్చారు. ఒకవేళ ఉద్యమం వైపు వెళితే నిన్నటి దాకా చేసిన చర్చలు వృథా అయ్యే అవకాశమూ ఉంది. అలా అని విధేయత వైపు మొగ్గు చూపితే ఇప్పటికే ఢల్లీిలోని నాయకులు తెలంగాణా ఒక్కటే సమస్య కాదని ప్రసంగిస్తున్నారు. దీంతో అడకత్తెరలో పోకచెక్కలా కేసిఆర్, టీఆర్‌ఎస్ నేతలు చర్చల్లో నలిగిపోతున్నారు. ఎటుతేల్చుకోలేక కొట్టుమిట్టాడుతున్నారు.