మీ కోసం....మీరు ఉన్నారా??
posted on Mar 26, 2022 @ 10:45AM
ప్రతి మనిషి జీవితంలో బతకడానికి ఎన్నో పనులు చేస్తూ ఉంటాడు. ఇది ఒక వర్గం అయితే చాలామంది కొన్ని లక్ష్యాలు, కొన్ని కలలు అంటూ వాటిలో మునిగి తేలుతూ ఉంటారు. ఇల్లు, పనిచేసే చోటు, ప్రయాణం చేసే చోటు, బంధువులు కలిసే కార్యక్రమాలు, పరిచయస్తులు పార్టీలు, ఫంక్షన్ లు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో జీవితాల్లో భాగంగా ఉంటాయి. అయితే అలాంటివి జరిగే ప్రతిచోటా మనిషి ఎదుటివాళ్లను గమనిస్తూ ఉంటారు. వాళ్లలో ప్రత్యేకత, వాళ్లలో బలహీనత, వాళ్ళ బలం ఇలాంటివన్నీ గమనిస్తూ ఉంటారు.
అంటే మనిషి తన జీవితంలో తన రోజువారీ పనులలో మునిగిపోయి, ఎప్పుడైనా ఇలాంటి సందర్భాలలో ఎదుటివారిని చదువుతూ, ఇంకొకరి గురించి తెలుసుకుంటూ బతికేస్తున్నాడు అనే విషయం గమనిస్తే తప్ప అర్థమవ్వదు. కానీ ప్రతి మనిషి చెయ్యాల్సిన పని ఒకటుంది. అదే తమ గురించి తాము తెలుసుకోవడం. ఇది ఒకరకంగా ఆత్మ విమర్శ లాంటిదే అనుకోవచ్చు. మరి ఇందులో ఏముంటుంది??
ప్రాధాన్యతలు!!
మీరు వేటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు?? అవి మీ ఇష్టాఇష్టాలకు ఎంతమాత్రం సరోపోతున్నాయి. నిజంగానే ప్రాధాన్యతలన్నీ పూర్తి సంతృప్తిగా ఉన్నాయా?? లేక ఆర్థిక కోణం చూసి వాటిని ప్రాధాన్యతలుగా మార్చుకున్నారా?? మనిషి జీవితంలో ఎన్నో ఉండచ్చు కానీ తనకు కాసింత తృప్తినిచ్చే వాటిని వదిలేసుకోకూడదు కదా. చాలామంది అదేదో చిన్నతనం అనే ఫీలింగ్ తో కొన్ని తృప్తికరమైన వాటిని వదిలేసుకుంటారు.
బలాలు, బలహీనతలు!!
మనిషిలో ఉన్న మానసిక జీవితంలో బలాలు, బలహీనతలే బలగాలు. బలం మనిషి పట్టు అయితే బలహీనత మనిషిని వెనక్కులాగేది అవుతుందని అనుకుంటారు కానీ మీకు తెలుసా బలహీనతలు ఉన్నవాడే గొప్పగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. బలహీనతను బలంగా మార్చుకోవడం, ఆ బలహీనతపై పై చెయ్యి సాధించడం, దానిని అధిగమించడం దీని వల్ల సాధారణ బలం కంటే ఎన్నోరెట్ల ఆత్మవిశ్వాసం సొంతమవుతుంది.
ప్రవర్తన!!
ఇక్కడ ప్రతి మనిషి తన మెంటాలిటీని బట్టి ప్రవర్తన అంటే ఇలా ఉండాలి అని ఒక వివరణ ఇస్తాడు. అయితే అందరి విషయానికి సరిపోదు ఎందుకంటే ఒక్కొక్కళ్ళ ఆలోచన ఒక్కో విధంగా ఉంటుంది కాబట్టి. అందుకే ప్రవర్తన అనేదానికి ఒక ఖచ్చితమైన నిర్వచనం అంటూ ఇవ్వలేము. ఇంకా దాని మీద విభిన్న వాదనలను కూడా చూస్తుంటాము. కానీ ప్రవర్తన విషయంలో మాత్రం కాసింత సాటిసిఫాక్షన్ ఉండాలి. కారణాలు ఎన్నైనా ఉండచ్చు కానీ ఒకరిని పలకరించడం, ఒకరు పలకరించినపుడు స్పందించడం. నలుగురిలో మాట్లాడినప్పుడు హుందాతనం, పెద్దల విషయంలో కాసింత గౌరవం, చిరునవ్వుతో పలకరించడం. ఇలాంటివన్నీ చాలా సాధారణమైన విషయాలు. మీరు ఒకరిని గమనిస్తున్నట్టు, మిమ్మల్ని వేరే వాళ్ళు గమణిస్తుంటారు అనే విషయాన్ని మరచిపోకూడదు.
మీకోసం మీరు!!
మీకోసం మీరు కొంచమైనా ఉన్నారా లేదా అనే విషయాన్ని కాస్త ఆలోచించాల్సిందే. ప్రస్తుత కాలంలో మనిషుల్లో frustration పెరిగిపోవడానికి కారణం ఎవరికి వారు లేకుండా పోవడమే. అంటే మీకోసం మీరు కొంచమైనా ఉండాలి. తల్లిదండ్రులు, భార్య, పిల్లలు, వృత్తి, బయటకు వెళ్తే స్నేహితులు, సన్నిహితులు వీళ్ళందరి కోసం ఇష్టం లేనివాటిని భరించేస్తూ ఉండటం వల్ల అసహనం ఎక్కువైపోతుంది. కనీసం అలా ఏదైనా చిన్న షాప్ కు వెళ్లి నచ్చిన టీ తాగుదామా అంటే అక్కడే ఎవరో ఒకరు ఆత్మీయులు కనబడి అధోద్దు ఇది బాగుంటుంది అని నచ్చనిది చేతికిచ్చి తాగమన్నట్టు, ఎంతమందికి ఎన్ని సమకూర్చినా మీ విషయంలో మీకు నచ్చిన దేన్నీ మార్చుకోవద్దు. హాయిగా మీదైన ఇష్టాన్ని ఆస్వాదించాలి. అప్పుడే కాసింత తృప్తి లభిస్తుంది. అది చిన్నపుడు తిన్న పుల్లైసులాంటిది.
◆వెంకటేష్ పువ్వాడ.