ఏప్రిల్ పూల్ అవ్వకండి ఈసారైనా!!
posted on Mar 28, 2022 @ 9:30AM
మార్చ్ ముగింపు వచ్చేసింది. మార్చ్ అవ్వగానే ఏప్రిల్ వస్తుంది. అయితే ఏంటి?? ఏప్రిల్ అవ్వగానే మే వస్తుంది, తరువాత జూన్, మళ్ళీ జులై ఇంతేగా అని అందరూ అంటారేమో. కానీ ఏప్రిల్ నెలకు ఒక తుంటరి తనాన్ని జోడించారు అందరూ. ఆ తుంటరి తనమే ఏప్రిల్ ఫూల్ చెయ్యడం. ఎదో ఒకటి చెప్పి నమ్మించి తీరా గాభరా పడో, నమ్మేయడమో చేయగానే ఏప్రిల్ పూల్ అని అని వెక్కించే వాళ్ళు చాలా మంది. ముఖ్యంగా పిల్లలకు, యూత్ కు ఇదొక పెద్ద సరదా. ఆ సరదా ఏప్రిల్ ఒకటవ తారీఖు మొత్తం హంగామా చేస్తుంది. అయితే సరదాగా సంవత్సరానికి ఒకసారి అయిపోయే ఈ ఫ్యూలిష్ నెస్ జీవితంలో కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది మరి.
నిర్ణయాలు!!
తీసుకునే నిర్ణయాలు ఆవేశంతో లేకుండా ఆలోచనతో ఉంటే వాటి తాలూకూ ఫలితాలు బానే ఉంటాయి. అలాగే ఎవరికోసమో మీకు ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడం కాకుండా మీకు తృప్తి కలిగించేలా తీసుకుంటే తరువాత బాధపడాల్సిన అవసరమే ఉండదు.
ఫూల్స్ ఏమి కాదు!!
ఏదో ఏప్రిల్ 1st న ఫూల్ అవ్వగానే ఇక సంవత్సరమంతా ఫూల్ అయిపోయినట్టు ఫీలవుతుంటారు చాలామంది. అయినా మీద రంగు పడిందనో, డ్రెస్సు చిరిగిపోయిందనో చెప్పే మాటలు వినేసి ఫూల్స్ అయిపోయినదానికి, ఎంతో ప్రాముఖ్యత ఉన్న సంవత్సర కాలానికి ఎలా ముడిపెడతారు?? ఆ సంవత్సరమంతా ఫూల్స్ అయిపోయినట్టు ఎందుకు అనుకుంటారు. ఎంత అర్థం లేని విషయం కదా అది.
ఎప్పుడూ ఇవి కూడా ఉండవు!!
భగవద్గీతలో కృష్ణుడు ఒక మాట చెబుతాడు. మనిషికి దుఃఖం పుడుతుంది, ఆ దుఃఖం పుట్టగానే అది పోయేవరకు మనిషి ఎంతో ఇదైపోతాడు. ఆ తరువాత సుఖం వచ్చాక అది కూడా దుఃఖంలా కొన్నిరోజులు ఉంటుంది అని అర్థం చేసుకోడు, మనిషికి ఎప్పుడూ సుఖమే కావాలి అదే కదా మనిషి అత్యాశ. అందుకే సుఖాలు కూడా ఎప్పుడూ ఉండవని, సుఖం, దుఃఖం ఒకదాని తరువాత మరొకటి వస్తూ వుంటాయని అర్థం చేసుకుంటే ఇక నిశ్చింతనే.
అనవసర ఆందోళనలు!!
అందరూ చేసే చాలా పెద్ద తప్పు అనవసర విషయాలకు ఆందోళన పడటం. ఏదైనా చేయాలన్నా ఆందోళన, ఏదైనా చెప్పాలన్నా ఆందోళన, నిర్ణయాలు తీసుకోవాలన్న ఆందోళన, ఏదైనా వద్దనుకోవాలన్నా ఆందోళన ఇలా ఆందోళన వలయంలో పడి మనుషులు నిజంగా ఫూల్స్ అయిపోతారు. ఆ ఆందోళనలో చాలా వరకు ఎన్నో రకాల తప్పులు చేసి తరువాత అయ్యో అనుకుంటారు. కాబట్టి ఇలాంటి ఆందోళన, ఖంగారు లాంటివి ఉంటేనే నిజమైన ఫూల్స్ అన్నట్టు మరి.
తొక్కి పడేయండి!!
ఒత్తిడులు, వేదనలు మనిషిని ఊరికే బాధిస్తాయి. అవన్నీ జీవితం నుండి వెళ్లిపోవాలి. అందుకే మెల్లగా వాటి కోసం ఎక్సిట్ గేట్ వెతకండి. వాటిని కాలికింద తొక్కి బయటకు తన్నేయండి. ఈ ఒక్క పని మనిషిలో ఎన్నో ప్రశ్నలను పటాపంచలు చేస్తుంది.
గెలుపు సూత్రం!!
ఒకే ఒక పని మనిషిని అన్ని కాలాలలోనూ స్థిరంగా, ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. అదే అంతా మంచికే అనుకోవడం, నవ్వుతూ ఉండటం. ఎవరేమన్నా పట్టించుకోకుండా చెయ్యాల్సిన పనిని ఏకాగ్రతగా చేసెయ్యడం. ఇంకా ఇంకా చెప్పాలి అంటే మనిషి ఎప్పుడూ ఏ విషయంలో మాట్లాడకూడదు, పని మాత్రమే కనిపించాలి. అలాంటి మనస్తత్వాన్ని తీర్చిదిద్దుకుంటే ఇలాంటి ఏప్రిల్ ఫూల్స్, ఇంకా ఫెయిల్యూర్స్ ఏమీ చేయలేవు మరి. లేదూ వాటిని మనసుకుని ఫీలైపోతే నిజంగా ఏప్రిల్ ఫూల్స్ అయినట్టే మీరు.
◆వెంకటేష్ పువ్వాడ.