బాబు యాత్రకు బాలయ్య ఊతం
posted on Oct 26, 2012 @ 1:36PM
చంద్రబాబు పాదయాత్ర పాలమూరులో దిగ్విజయంగా సాగుతోంది. తెలంగాణ వాదులనుంచి ప్రతిఘటన చప్పబడిపోయింది. బీసీలు, ఎస్సీలు బాబుకు అండగా వుండడంతో తెలంగాణ వాదుల నిరసన మీడియా ప్రకటనలకు పరిమితమైపోయింది. ఈ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ మహబూబ్‌నగర్ జిల్లా అమరవాయి వద్ద చంద్రబాబును కలవడానికి వెళ్లడం, కుశలప్రశ్నలు వేయడం, అక్కడ ప్రజలతో కాసేపు గడపడం ‘వస్తున్నా.. మీకోసం’ పాదయాత్రలో నూతన ఉత్సాహాన్ని నింపింది. నిజానికి బాలకృష్ణకూడా పాదయాత్రలో పాల్గొంటారనే ఊహాగానాలు వినిపించాయి. అయితే భద్రతా కారణాల దృష్ట్యా, జనం తొక్కిసలాటలు లాంటి వాటిని దృష్టిలో వుంచుకొని బాలయ్య తన పాదయాత్రను విరమించుకున్నారని అంటున్నారు. అయినప్పటికీ తాను కూడా పాదయాత్ర చేసే విషయం గురించి ఆలోచిస్తానని చెప్పారు. చంద్రబాబు పాదయాత్రకు అపూర్వ స్పందన లభిస్తోందని బాలయ్య కితాబు ఇచ్చారు. అనారోగ్యంతో వున్నప్పటికీ చంద్రబాబు ప్రజలకోసం పాదయాత్ర చేస్తున్నారని బాలయ్య చెప్పారు. బాబు పాదయాత్ర 25వ రోజున బాలకృష్ణ రంగప్రవేశం చేశారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్.టి.రామారావు కుటుంబంనుంచి ఇలా అప్పుడప్పుడు ఎవరో ఒకరు వచ్చి యాత్రలో పాల్గొనే పక్షంలో చంద్రబాబు పాదయాత్ర మరింత సక్సెస్ అవుతుందని చెప్పవచ్చు.