రేవంత్‌రెడ్డికి ఎర్రబెల్లి ఫ్రెండ్‌షిప్ రిక్వెస్ట్!
posted on May 30, 2024 @ 4:50PM
రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు వుండరని అంటారు.. అది నిజమే.. ఎందుకంటే, నిన్నటి వరకు నువ్వా నేనా అనుకున్నవాళ్ళు అకస్మాత్తుగా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతారు. నిన్నటి వరకూ నువ్వే నేను అన్నట్టుగా వున్నవాళ్ళు సడెన్‌గా నువ్వెంతంటే నువ్వెంత అనుకునే స్థాయికి వెళ్ళిపోతారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు మధ్య వున్న ఫ్రెండ్‌షిప్ అలాంటిదే. వీళ్ళిద్దరూ తెలుగుదేశం పార్టీలో వున్నప్పుడు ఇద్దరి మధ్య స్నేహం వుండేది. అయితే ఓటుకు నోటు కేసు సందర్భంలో తన మీద కుట్ర చేసింది ఎర్రబెల్లి దయాకర్ రావే అనే అభిప్రాయం రేవంత్ రెడ్డిలో కలిగింది. మిత్రుడిలా వుంటూనే మిత్రద్రోహం చేశారన్న అభిప్రాయాలున్నాయి. ఓటుకు నోటు సంఘటనతో రేవంత్, ఎర్రబెల్లి మధ్య పూడ్చలేనంత అగాథం ఏర్పడిందన్నమాట మాత్రం వాస్తవం.
కాలం గిర్రున తిరిగింది. ఓటుకు నోటు కేసు సమయంలో రేవంత్ రెడ్డి ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఆయనకు దెబ్బకు దెబ్బతీసే అవకాశం ఫోన్ ట్యాపింగ్ కేసు ద్వారా వచ్చింది. ఈ కేసులో కేసీఆర్ కుటుంబంతోపాటు ఎర్రబెల్లి దయాకర్ రావుకు కూడా భాగస్వామ్యం వుందని పర్వతగిరిలో వార్ రూమ్ ఏర్పాటు చేసి, అక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్ కార్యక్రమాలు నిర్వహించడానికి ఎర్రబెల్లి సహకరించారన్నది ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రస్తుతానికి విచారణ దశలోనే వుంది. పోలీసు అధికారుల అరెస్టు దగ్గరే వుంది. ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత పెద్ద పెద్ద పొలిటికల్ తలలే అరెస్టు అయ్యే అవకాశం వున్నట్టు తెలుస్తోంది. ఈ అరెస్టుల లిస్టులో ఎర్రబెల్లి దయాకర్ రావు వున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ ప్రమాదాన్ని అర్థం చేసుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావు సీఎం రేవంత్ రెడ్డికి ఫ్రెండ్‌షిప్ రిక్వెస్ట్ పంపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
‘మనిద్దరం గతంలో మంచి ఫ్రెండ్స్. ఓటుకు నోటు కేసు సమయంలో జరిగిందేదో జరిగిపోయింది. ఇక మనిద్దరం అవన్నీ మరచిపోదాం. నువ్వు నామీద మనసులో ఏమీ పెట్టుకోకుండా వుంటే చాలు’ అని కామన్ ఫ్రెండ్స్ ద్వారా రేవంత్‌కి ఎర్రబెల్లి స్నేహ సందేశం పంపినట్టు తెలుస్తోంది. ఆ రిక్వెస్ట్ ఇంకా ఓకే కానట్టు సమాచారం. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అన్నట్టుగా వున్న ఎర్రబెల్లి వ్యవహారం మీద రేవంత్ ఎలా స్పందిస్తారో అంతు చిక్కకుండా వుంది. పాత స్నేహితుడు కదా అని చూసీ చూడనట్టు వ్యవహరిస్తారో... లేక చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది అంటారో చూడాలి.