ఏబీ వెంకటేశ్వరరావుకు ఒకరోజు పోస్టు?
posted on May 30, 2024 @ 4:46PM
ఐదేళ్ళుగా జగన్ ప్రభుత్వం ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుని కేసులు పెట్టి, పోస్టింగ్ ఇవ్వకుండా వేధిస్తోంది. ఆ వేధింపులకు ముగింపు వస్తోంది. రేపు ఒక్కరోజుతో ఏబీ వెంకటేశ్వరరావు సర్వీస్ ముగియనుంది. యూనీఫామ్‌లోనే రిటైర్ అవ్వాలని ఆయన పట్టుదలతో వున్నారు. ‘కాట్’ కూడా వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇవ్వాలని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో హైకోర్టును ఆశ్రయిస్తే, హైకోర్టు కూడా వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇవ్వాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఏబీ వెంకటేశ్వరావు గురువారం నాడు చీఫ్ సెక్రటరీ జవహర్‌రెడ్డిని కలిశారు. తనకు పోస్టింగ్ ఇవ్వాలన్న హైకోర్టు ఆదేశాలను చీఫ్ సెక్రటరీకి అందించారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కార్యాలయానికి కూడా వెంకటేశ్వరరావు హైకోర్టు ఉత్తర్వుల ప్రతిని అందించారు. ఇప్పుడు ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇవ్వక తప్పని పరిస్థితి. వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇచ్చిన పక్షంలో ఆయన ఒక్కరోజు మాత్రమే ఆ పోస్టులో వుండి, ఆ తర్వాత రిటైర్ అవుతారు. యూనీఫామ్‌లో రిటైర్ అయిన గౌరవం ఆయనకు దక్కుతుంది. ఇప్పటి వరకు అయితే ఆయనకు ఒక్కరోజు పోస్టు ఇవ్వాలన్న ఉద్దేశంలో సీఎస్ వున్నట్టు తెలుస్తోంది. అలా ఇవ్వని పక్షంలో ఈ దేశంలో మానవత్వం, చట్టం, ధర్మం, న్యాయం అనేవి ఉన్నాయని అనుకోవడం అనవసరం అనే అభిప్రాయానికి నిస్సందేహంగా రావచ్చు.