ఏపీలో మొట్టమొదట ఫలితం వెలువడే నియోజకవర్గమేదో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ లో ఓట్ల లెక్కింపు, ఫలితాల విడుదలకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, పాతిక లోక్ సభ నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు సజావుగా సాగేందుకు అవసరమైన ఏర్పాట్లను ఎన్నికల సంఘం పూర్తి చేసింది. కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకూ తావులేకుండా గట్టి భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది. 

అది పక్కన పెడితే జూన్ 4న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన జరుగుతుంది. కాగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు గాను 111 అసెంబ్లీ నియోజకవర్గాలలో కౌంటింగ్ మధ్యాహ్నం రెండు గంటల వరకూ పూర్తి అయిపోతుంది. ఇక మరో 61 నియోజకవర్గాలలో కౌంటింగ్ ముగిసే సరికి సాయంత్రం నాలుగు గంటలు అవుతుంది. ఇక మిగిలిన మూడు నియోజకవర్గాలలో కౌంటింగ్ పూర్తయ్యే సరికి సాయంత్రం గంటలు దాటే అవకాశం ఉంది. ఆ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు ఎన్ని రౌండ్లలో సాగుతుంది అన్నదానిపై ఫలితం కౌంటింగ్ ముగియడానికి పట్టే సమయం ఆధారపడి ఉంటుంది. సరే ఇంతకీ రాష్ట్రంలో మొట్ట మొదట ఫలితం వెలువడే నియోజకవర్గం ఏమిటంటే మాత్రం రెండు నియోజకవర్గాల పేర్లు చెప్పుకోవలసి ఉంటుంది. అవి కొవ్వూరు, నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గాలు.

ఈ రెండు నియోజకవర్గాలలోనూ కౌంటింగ్ పదమూడు రౌండ్లలో జరుగుతుంది. అంటే రాష్ట్రంలో తొలి ఫలితం కొవ్వూరు లేదా నరసాపురం నియోజకవర్గాల నుంచి వెలువడుతుందన్నమాట. ఇక అన్నిటి కంటే చివరిగా ఫలితం వెలువడే నియోజకవర్గం రంపచోడవరం. రంపచోడవరం నియోజకవర్గంలో మొత్తం 29 రౌండ్లలో కౌంటింగ్ జరుగుతుంది. అందుకే రాష్ట్రం లో అన్ని నియోజకవర్గాల కంటే చివరన ఈ నియోజకవర్గం ఫలితం వెలువడుతుంది.  

Teluguone gnews banner