పవన్ బలమేంటో తెలుసా!?
posted on Sep 2, 2025 @ 9:55AM
చాలా మంది పవన్ కళ్యాణ్ బలం.. ఆయనకున్న ప్రజాదరణగా భావిస్తారు. కానీ, అది కానే కాదు. పవన్ కళ్యాణ్ స్ట్రెంగ్త్ ఆయన ఓపిక. దేనికైనా ఓపిక పట్టడం ఆయన నైజం. అందుకే పవన్ పాలిటిక్స్ లో అంతగా క్లిక్ అయ్యారు. అదే తన అన్నయ్య చిరంజీవికి అలాంటి ఓపిక లేక పోవడం వల్లే ఆయన రాజకీయాల్లో రాణించలేక పోయారు. పార్టీ పెట్టినట్టే పెట్టి ఎత్తేశారు. పవన్ అలాక్కాదు. 2014లో ఆయన నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేయలేదు. నాటి టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు ప్రకటించారు. అంటే ఒక వ్యక్తి నేలపై పడుకున్న వాడు పడుకున్నట్లే నిటారుగా నిలుచోలేడు.. ముందు నిదానంగా కూర్చుని ఆపై ఎలా లేస్తాడో అలాంటి వ్యవహారం అన్నమాట. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి.. తాను స్వయంగా పోటీ చేసిన రెండు చోట్ల ఓడి పోవడం. ఆపై తన పార్టీ తరఫున గెలిచిన ఒకే ఒక్కడు, రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వైసీపీలోకి వెళ్లినా.. తన కౌంట్ అసెంబ్లీలో జీరో అయినా ఆ ఐదేళ్లు నిలబడి, కలబడి ఆపై 2024లో తిరిగి పొత్తు కలుపుకుని వంద శాతం స్ట్రైక్ రేట్ తో విజయం సాధించడం ఆయన ఘనత.
చాలా మంది అప్పటి వరకూ అన్న మాట ఏంటంటే.. పవన్ కి అసలు రాజకీయాలే తెలియవని. కానీ ఆయన తన పంథాలో తాను చేయాల్సిన రాజకీయ ప్రయోగాలన్నీ చేసేశారు. ఒక సారి మద్దతిచ్చాం. మరోమారు ఒంటరిగా పోటీ చేశాం. మనం ఒంటరిగా పోటీ చేయడంతో 2009నాటి రిజల్ట్స్ వచ్చాయ్. అప్పట్లో తన అన్నయ్య కారణంగా తిరిగి వైఎస్ రాజశేఖరరెడ్డి విజయానికి ఎలో దోహదపడ్డారో , 2019 ఎన్నికల్లో జగన్ ఒంటరిగా పోటీ చేయడం వల్ల వైసీపీ విజయానికి దోహదపడ్డారు. దీంతో ఆయన మళ్లీ పొత్తులతో వెడితే.. 2014 నాటి ఫలితాలు పొందవచ్చని అంచనా వేసి దాని ప్రకారమే ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు ముందు పొత్తు ప్రకటన చేశారు. అప్పటికీ పవన్ ని బీజేపీ మైండ్ వాష్ చేయకుండా పోలేదు. కానీ అది కరెక్టు కాదని తానే ఓన్ డెసిషన్ తీసుకుని రాజకీయ పరిణితిని ప్రదర్శించారు జనసేనాని పవన్ కల్యాణ్. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూశారు. దీంతో కూటమి ఘన విజయం సాధించింది. ఒకప్పుడు రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన పవన్.. తర్వాత వందకు వందశాతం ఫలితాలతో.. విజయ ఢంకా మోగించి.. ప్రస్తుతం 21 ఎమ్మెల్యే 2 ఎంపీ, ఆపై మరో ఇద్దరు ఎమ్మెల్సీలతో తిరుగులేని విజయం సాధించారు.
ఇప్పుడు పవన్ టార్గెట్ జనసేన జాతీయ పార్టీ కావాలని భావించడం. ఈ విషయంలోనూ కొందరు గణాంకాలు వల్లె వేస్తున్నారు. మీకు ఆ మాత్రం ఓటు శాతం లేదని అంటున్నారు. అది కూడా ఒకటికన్నా ఎక్కువ రాష్ట్రాల నుంచి కావాలని దెప్పి పొడుస్తున్నారు. కానీ ఆయన తొలుత అందరూ ఎగతాళి చేశారని ఎంత మాత్రం వెరవరు. ఒక టార్గెట్ పెట్టుకుని ఆ దిశగా వెళ్తూనే ఉంటారు. ఒక మినీ బీజేపీ స్థాయిలో ప్రో హిందూ స్టాండ్ తీసుకున్నారు. ఆ విధంగానే ముందుకెళ్తున్నారు.
ఇప్పటికే ఆయన ఏపీలో అత్యధిక శాతం గల కాపు సామాజిక వర్గానికి చెందిన వారు. ఆపై తన భార్య క్రిష్టియన్. ఇప్పుడు తాను చూస్తే సనాతన సారథిగా దూసుకెళ్తున్నారు. ఇక తనకు తాను ప్రతి ప్రాంతాన్ని ఓన్ చేసుకునేలా ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉంటారు. తద్వారా ఆయా ప్రాంతాల స్థానికతను సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇదంతా కూడా రాజకీయాల్లో ఒక భాగమే. అందుకే ఆయన్ను ఎగతాళి చేసిన వారంతా ప్రస్తుతం అసెంబ్లీలో పత్తా లేకుండా పోయారు. దమ్ముంటే అసెంబ్లీ గేటు తాకి చూడు అన్నారు. ఆయన ఎంట్రీ ఇచ్చాక అక్కడ అసెంబ్లీలో వారి ఊసే లేకుండా పోయింది. దీనంతటికీ కారణం ఆయన దగ్గర టన్నుల కొద్దీ ఉన్న ఓరిమి. భూదేవికి ఉన్నంత ఓపిక. ఇదే పవన్ ఆయుధంగా చెప్పాలంటారు పలువురు పొలిటటికల్ ఎనలిస్టులు.