శతృవులు చెల్లెళ్లు, మరదళ్ల రూపంలో ఉంటారుగా కవితక్కా!
posted on Sep 2, 2025 @ 10:24AM
కేసీఆర్ కి ‘టి ’కలసి వచ్చినంతగా ‘బి’ కలసి రాలేదా? అంటే అవుననే చెప్పాలి. ఎప్పుడైతే ఆయనకెంతో అచ్చి వచ్చే టీని విడిచిపెట్టారో అప్పటి నుంచి కష్టాలు తరుముకొస్తున్నాయి. టీలోని తెలంగాణ అనే సెంటిమెంటు ఒక తల్లిలా కాపాడుతూ వచ్చింది. అదే.. బీ ఆయన్ను పూర్తిగా విడిచి పెట్టేసింది. ఏ ముహూర్తాన ఆయన టీ తో మొదలయ్యే టీఆర్ఎస్ అన్న పార్టీ పేరును బీతో ఆరంభమయ్యే భారత రాష్ట్ర సమితిగా మార్చారో.. అక్కడి నుంచి మొదలైంది కేసీఆర్ కు కష్టాల పరంపర. మొదట ఓటమి ఎదురైంది. ఆపై వరుస కేసులు. కాళేశ్వరం, టెలిఫోన్ ట్యాపింగ్. ఇక తాను అల్లుడు కలసి కాళేశ్వరం అవినీతి ఊబిలో పీకలోతు చిక్కుకుపోగా.. తన కొడుకు ఈ ఫార్ములా కేసులో.. బిడ్డ ఢిల్లీ స్థాయిలో లిక్కర్ స్కామ్.
ప్రస్తుతం హరీష్, సంతోష్ అవినీతి వల్లే కేసీఆర్ కి మచ్చ అంటోన్న కవిత.. పార్టీకి మేలు చేస్తోందా కీడు చేస్తోందా? కూడా ఎవరికీ అర్ధం కావడం లేదు. అప్పటికీ హరీష్ అసెంబ్లీలో ఒంటరి పోరాటం చేస్తూ అరివీర భయంకరుడిలా పోరాడి పేరు సాధిస్తున్నారు. ఆయనకు బూస్టింగ్ ఇవ్వాల్సిన కవిత.. అలాక్కూడా వదలడం లేదు. అనవసరమైన కామెంట్లు చేసి చెడ్డపేరు తెస్తున్నారు.
శతృవులు ఎక్కడో ఉండరు,, చెల్లెళ్ల రూపంలో, మరదళ్ల రూపంలో ఉంటారన్న మాటను నిజం చేస్తున్నారామె. ఒక సమయంలో కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో ఇరుక్కుంటే కేటీఆర్ ఆమె చేసిందసలు తప్పే కాదు. ఇది రాజకీయ కక్ష సాధింపు. ఢిల్లీ ప్రభుత్వం పాలసీ మార్చితే అందులో తాను కూడా ఒక వ్యాపార భాగస్వామిగా ఇన్ వాల్వ్ అయ్యారని ఆమెపై పడ్డ మరకను తుడిచేసే యత్నం చేశారు. హరీష్ , సంతోష్ ఎలాంటి ప్రో కామెంట్ చేయకపోయినా.. నెగిటివ్ గా అయితే ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
ఇప్పుడు కళేశ్వరం విషయంలో అలా వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన కవిత ఒకపక్క పార్టీపై ఫ్రంట్ అండ్ బ్యాక్, లెఫ్ట్ అండ్ రైట్ విమర్శలతో చెడుగుడు ఆడేస్తుంటే.. ఏం చేయాలో పాలు పోవడం లేదు కేసీఆర్ కి. అంటే టైం బాగలేకుంటే కర్రే పామై కరుస్తుందన్నట్టు.. మన అదృష్టం తిరగబడితే బిడ్డే అడ్డం తిరిగి ఇదిగో ఇలాంటి చిక్కులు తెచ్చి పడేస్తున్నారు.
ఇప్పుడు కేసీఆర్ ని, హరీష్‌ని, సంతోష్ ని వేరు చేసి చూడాలని ఇక్కడ ఎవరికీ ఉండదు. తలసానిని ఆయన ఓఎస్డీ కలసి కాకుండా తలసానికి తెలీకుండా కేవలం ఆ ఓఎస్డీ గొర్రల స్కామ్ కి కారకుడని అంటే ఎలా ఉంటుందో.. ఇదీ అంతే. ఒక వేళ కవిత చెప్పినట్టు వీరు ఇరువురూ.. అంత అవినీతికి పాల్పడి ఉంటే.. మరి కేసీఆర్ వైఫల్యం కూడా ఇందులో ఉన్నట్టేగా?
రాష్ట్రంలోని ప్రత్యర్ధి పార్టీల వారు, ఆపై సినీ వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేసి వారి వారి రహస్యాలను కనుగొన్న కేసీఆర్.. తన సొంతింట్లోని వారు ఇంత భారీ ఎత్తున అవినీతికిపాల్పడుతుంటే మాత్రం ఎందుకు వదిలేశారు? ఇది మిలియన్ డాలర్ క్వశ్చిన్. ప్రస్తుతం కవిత పిచ్చి ప్రయత్నమేంటంటే.. కేసీఆర్ పులుగడిగిన ముత్యం.. ఆయన్ను కాపాడ్డానికి ఇటు కేటీఆర్, అటు హరీష్ తో పాటు సంతోష్ ని కూడా బలిపెడుతోంది కావచ్చని అంటున్నారు. అది కూడా తన తండ్రికి చేటు తెచ్చేదేనని ఆమె ఎందుకు తెలుసుకోలేక పోతున్నారో అర్ధం కావడం లేదంటారు పలువురు. ఇప్పుడు కాళేశ్వరం కేసు సీబీఐ వరకూ వెళ్లింది. దీంతో ఏ విధంగా ముందుకెళ్లాలో అని కేసీఆర్ ఓ పక్క తలపట్టుకుంటుంటే.. మధ్యలో కవిత తగుదునమ్మా అంటూ ఈ మేటర్ లో వేలు పెట్టి.. ఇటు సొంత కుటుంబాన్ని, అటు పార్టీని ఇరుకున పెట్టడంఎంత వరకూ సమంజసం అన్న మాట వినిపిస్తోంది.