‘టి’ విషయంలో డికె అరుణ సొంత అజెండా ?
posted on Jan 4, 2013 @ 11:39AM
ప్రత్యెక తెలంగాణా రాష్ట్రం విషయంలో మంత్రి డి.కె.అరుణ ఇతర తెలంగాణా కాంగ్రెస్ నేతలతో సంభందం లేకుండా తన సొంత అజెండాతో ముందుకు వెళ్ళాలని భావిస్తున్నారని సమాచారం. అఖిల పక్ష సమావేశం తర్వాత ప్రస్తుతం తెలంగాణా అంశం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చేతిలో ఉన్న విషయం తెలిసిందే.
ఈ అంశంఫై ఓ నెల రోజుల్లో తమ నిర్ణయం వెల్లడిస్తామని కేంద్ర మంత్రి షిండే ప్రకటించారు. అయితే, రాష్ట్ర విభజన అసలు జరగదని సీమంధ్రా కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఈ విషయాలతో కొంత ఆందోళనకు గురి అయిన తెలంగాణా కాంగ్రెస్ నేతలు నిర్ణయాన్ని తమకు అనుకూలంగా రప్పించేందుకు అధిష్టానంఫై వత్తిడి తేవాలని నిర్ణయించారు. దీనికి తగిన కార్యాచరణను ఖరారు చేసేందుకు ఈ రోజు హైదరాబాద్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ లో వారు సమావేశం అవుతున్నారు.
ఈ సమావేశానికి ఎంఎల్ఏ లు, ఎంఎల్సి లు హాజరవుతారని భావిస్తున్నారు. అయితే, మంత్రుల విషయం మాత్రం ఇంకా తేలలేదు. అసలు హైదరాబాద్ బ్రదర్స్ దానం, ముకేష్ లకు ఆహ్వానం అందలేదని సమాచారం.
తెలంగాణా విషయంలో వీరితో చేతులు కలపడం ఇష్టం లేని మంత్రి అరుణ ఈ సమావేశం జరుగుతున్న సమయంలోనే మరో సమావేశం నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.