తెలంగాణాలో పట్టుకు సిపిఐ వ్యూహరచన !
posted on Jan 4, 2013 4:45AM
తెలంగాణా ప్రాంతంలో పట్టు కోసం సిపిఐ వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతంలో టిఆర్ఎస్ కు చెక్ పెట్టడానికి అవసరమైతే బిజెపి తో కూడా చేతులు కలపాలని ఆ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కెసిఆర్ వ్యవహరిస్తున్న తీరు పట్ల సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ ఇప్పటికే పలుమార్లు విమర్శలు చేశారు.
నిన్న జరిగిన పార్టీ సమావేశంలో ఈ విషయంలో బిజెపితో జత కట్టాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టిఆర్ఎస్ అధినేత వాదనలకు విలువ ఇవ్వకుండా,అవసరమైతే కాంగ్రెస్, తెలుగు దేశం, జగన్ పార్టీలను కూడా కలుపుకుపోవాలని నారాయణ పధక రచన చేసినట్లు సమాచారం. తెలంగాణా విషయంలో కాంగ్రెస్ పార్టీఫై వత్తిడి తెచ్చేందుకు ఈ పార్టీలు అన్నింటితోను జత కట్టాలని ఆయన భావించినట్లు తెలుస్తోంది.
నెల రోజుల్లో తెలంగాణా విషయంలో ఓ ప్రకటన చేస్తామని హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రకటించిన నేపధ్యంలో ఈ నెల రోజుల్లోపు చేపట్టాల్సిన ఆందోళన కార్యక్రమాలను కూడా సిపిఐ ఇప్పటికే ఖరారు చేసినట్లు సమాచారం.
ఒక వేళ ఆయన ప్రత్యెక రాష్ట్రానికి వ్యతిరేకంగా ప్రకటన చేస్తే, ఆ తర్వాత చేపట్టాల్సిన ఉద్యమ కార్యక్రమాలఫై కూడా నారాయణ తన పార్టీ నేతలతో చర్చిస్తునట్లు తెలుస్తోంది.