కవాతును వాయిదా వేసుకొండి: దినేష్‌రెడ్డి
posted on Sep 28, 2012 @ 4:39PM
తెలంగాణ మార్చ్‌కు ప్రభుత్వం అనుమతి లేదని, తెలంగాణవాదులు ఎవరూ కూడా హైదరాబాద్ రావద్దని డీజీపీ దినేష్‌రెడ్డి పేర్కొన్నారు. వినాయక నిమజ్జనం, జీవ వైవిధ్య సదస్సు దృష్ట్యా కవాతును మరో రోజుకు వాయిదా వేసుకోవాలన్నారు. కవాతును మరో రోజుకు వాయిదా వేసుకుంటే అనుమతిస్తామని చెప్పారు. కవాతులో అసాంఘిక శక్తులు, మతకల్లోల వంటి హింసాకాండ పెచ్చరిల్లే అవకాశాలున్నాయన్నారు. ఈ నెల 30వ తేదిన ట్యాంక్‌బండ్‌ను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుంటారన్నారు. మంత్రులు కవాతుకు అనుమతించాలని తనను ఇప్పటి వరకు కోరలేదని, అలా కోరుతారని కూడా తాను భావించడం లేదన్నారు. నిరసన తెలపడం తెలంగాణవాదుల హక్కు అయినప్పటికీ... ఇతరులకు విఘాతం కల్పించడం ప్రజాస్వామ్య విరుద్దమన్నారు. కవాతు కోసం ఎవరైనా వస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. నగరంలో ఎక్కడికి అక్కడ సిసి కెమెరాలు ఉన్నాయని, హింసాకాండకు పాల్పడిన వారిని గుర్తించి కేసులు పెడతామని హెచ్చరించారు. మరో రోజుకు కవాతును వాయిదా వేసుకుంటే భద్రత కల్పిస్తామని డిజిపి హామీ ఇచ్చారు.