ప్రేమ, ఆకర్షణ.. రెండింటి మధ్య తేడా తెలుసుకోవడం ఎలాగంటే..!
posted on Jan 5, 2024 @ 10:09AM
ప్రేమ, ఆకర్షణ రెండు వేర్వేరు విషయాలు కాదు. ప్రేమను, ఆకర్షణను సరిగ్గా అర్థం చేసుకుంటే ప్రేమ అనేది మొదట ఇద్దరు వ్యక్తుల మధ్య ఆకర్షణతోనే మొదలవుతుందని అర్థమవుతుంది. ఇది ఒకే దారిలో రెండు స్టాపింగ్ పాయింట్స్ లాంటిది. ఈ దారిలో వెళ్లే కొందరు వ్యక్తులు ప్రేమను చేరుకుంటే, కొందరు తమ సంబంధాన్ని కేవలం ఆకర్షణకే పరిమితం చేస్తారు. ఎందుకంటే ఆకర్షణ నుండి ప్రేమకు వెళ్ళడం సులభం కాదు. అందుకే రెండింటి మధ్య తేడాను గుర్తించాలి. ఎవరైనా.. ఎవరినైనా ప్రేమిస్తున్నట్టైతే ప్రేమలో ఉన్నారా లేదా ఆకర్షణలో ఉన్నారా అనే విషయం తరచి చూసుకోవడం ముఖ్యం. దీన్ని ఎలా తెలుసుకోవాలంటే..
ఇతర విషయాల ప్రాధాన్యత..
ప్రేమలో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఒకరితో ఒకరు వీలైనంత ఎక్కువ సమయం గడపాలని అనుకుంటారు. తన భాగస్వామిని కలిసిన ప్రతిసారీ తను మొదటి సారి కలిసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారో అలాగే ఫీలవుతారు. కానీ సంబంధం కేవలం ఆకర్షణపై మాత్రమే ఆధారపడి ఉన్నప్పుడు కలిసి సమయాన్ని గడపడానికి కాస్త పరధ్యానం చూపిస్తారు.
భవిష్యత్తు విషయాలు..
ఒకరితో ఒకరు ప్రేమలో ఉన్నవారు తమ భవిష్యత్తును మరొకరితో గడపాలని అనుకుంటారు. ఎప్పుడూ కలిసి ఉండేందుకు, కలిసి తమ భవిష్యత్తు ప్రణాళికలను రూపొందించుకుంటారు. దాని కోసం కష్టపడతారు. కానీ ఆకర్షణలో ఉన్నవారు ఎప్పుడూ భవిష్యత్తు ప్రణాళికలు వేయరు. వారు దాని గురించి మాట్లాడటానికి కూడా ఇష్టపడరు. ఒకవేళ అలాంటి సందర్భం తీసుకుని వస్తే.. ఇప్పుడే అవన్నీ అవసరమా అంటూ సిల్లీగా వాటిని కొట్టేపడేస్తారు. సరళంగా చెప్పాలంటే వారి భవిష్యత్తులో మీకు చోటు ఉండదు.
శారీరక సంబంధం..
ప్రేమ అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య శారీరక సంబంధం అవసరాన్ని కలిగి ఉండదు. దీనిలో వ్యక్తులు ఒకరికొకరు మానసికంగా దగ్గరగా ఉంటారు. అయితే శారీరక సంబంధమే ఆకర్షణకు కేంద్ర బిందువు. ఒక వ్యక్తి తన భాగస్వామి ఇష్టాయిష్టాలను పట్టించుకోకుండా, ఏమి కావాలో కూడా తెలుసుకోకుండా కేవలం వారి అవసరం కోసం మాత్రమే శారీరక సంబంధం గురించి మాట్లాడుతున్నట్టైతై వారు మీతో ఎక్కువ కాలం ఉండరు అనేది నిజం.
వ్యక్తిగత జీవితం గురించి రహస్యాలు..
ప్రేమలో ఉన్న వ్యక్తి తన భాగస్వామి ముందు అద్దంలా మారతాడు. అతని తప్పులు, లోపాలు లక్షణాలు, ఏదీ దాచరు. కానీ ఆకర్షణలో ఉన్న వ్యక్తులు ఎల్లప్పుడూ తమ వ్యక్తిగత జీవితాన్ని చాలా ప్రైవేట్‌గా ఉంచడానికి ప్రయత్నిస్తారు. ప్రతి విషయానికి అందరమైన కథలు అల్లి మభ్యపెడతారు.
*నిశ్శబ్ద.