Read more!

తల్లిదండ్రులు పొరపాటున కూడా ఈ విషయాలు మగపిల్లలతో చెప్పకూడదట..!

పిల్లల పెంపకం తల్లిదండ్రులకు పెద్ద సవాల్. లింగ సమానత్వం అనే మాటను ఎంత సీరియస్ గా తీసుకున్నా సరే.. ఆడపిల్లలను, మగపిల్లలను పెంచే విధానంలో ఎంతో కొంత తేడా ఉండనే ఉంటుంది. ముఖ్యంగా జెండర్ కారణంగా తల్లిదండ్రులు మగపిల్లలకు కొన్ని విషయాలు చెబుతుంటారు. తల్లిదండ్రులు మంచి కోసమని చెప్పే ఆ విషయాలు  పిల్లల భవిష్యత్తు మీద చాలా ప్రభావం చూపిస్తాయి. పిల్లల వ్యక్తిత్వాన్ని ఊహించని విధంగా మార్చేస్తాయి. తల్లిదండ్రులు మగపిల్లలకు చెప్పకూడని విషయాలేంటో తెలుసుకుంటే..


మగపిల్లాడు ఏడవకూడదని చెప్పొద్దు..

అబ్బాయిలు ఏడవకూడదని, ఏడవడం తప్పు అని చాలా మంది తల్లిదండ్రులు తమ కొడుకులకు చిన్నప్పటి నుంచి నూరిపోస్తారు. ఎప్పుడైనా మగపిల్లాడు ఏడుస్తుంటే అదేంటి అలా ఏడుస్తున్నావు ఆడపిల్లలాగా అని ఎగతాళి కూడా చేస్తారు.  కానీ నిజమేంటంటే ఈ విషయం మగపిల్లలకు అస్సలు చెప్పకూడాదు. ఇవి పిల్లల మనస్సుపై తీవ్ర ప్రభావం చూపుతాయి. దీనితో పిల్లలు తన ఆలోచనలను, భావోద్వేగాలను  తమలోనే ఉంచుకోవడం మొదలుపెడతారు.

మగపిల్లలను వెక్కిరిచకూడదు..

పిల్లలు ఎదిగేకొద్ది వారి వ్యక్తిత్వం కూడా మెరుగవుతూ వస్తుంది. తల్లిదండ్రులు అయినంతమాత్రాన మగపిల్లలు పెద్దవారు అయినా సరే వారిని  ఏదైనా అనేయవచ్చు అనే ఆలోచన తల్లిదండ్రులు మానుకోవాలి. ఓ వయసుకు వచ్చాక మగపిల్లలు ఇంట్లో ఉంటే చాలామంది తల్లిదండ్రులు ఎగతాళిగా మాట్లాడుతుంటారు. ఇంకెన్నాళ్లు ఇంట్లోనే కూర్చుని తింటావు అని అంటూ ఉంటారు. కానీ ఈ మాటలు  మగపిల్లలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి.

అనుమానించకూడదు..

చాలామంది తల్లిదండ్రులకు కొడుకుల మీద అనుమానం ఉంటుంది. దీనికి కారణం మగపిల్లల స్నేహాలు, పరిచయాల లిస్ట్ పెద్దది. అవసరాల కోసం మగపిల్లలు తల్లిదండ్రులతో అబద్దాలు కూడా చెబుతారని అనుకుంటారు. పొరపాటున ఇంట్లో ఏదైనా వస్తువు మిస్ అయినా, ఇంట్లో ఏదైనా ఇబ్బంది ఎదురైనా వెంటనే కొడుకునే అంటూ ఉంటారు. ఇది మగపిల్లల దృష్టిలో తల్లిదండ్రును చెడ్డగా మారుస్తుంది.

పోలికలు పెట్టకూడదు..

మగపిల్లలు చదువు, ఉద్యోగంలో ఏమాత్రం సెటిల్ కాకపోయినా వారిమీద పోలికల యుద్దం చాలా దారుణంగా ఉంటుంది. కేవలం కొడుకులు అనే కాదు, కూతుర్లను కూడా ఈ విషయాలలో పోల్చి చూస్తారు. వాడు ఎంత బాగా చదువుతాడో, ఎంత మంచి ఉద్యోగం తెచ్చుకున్నాడో, మీకు తల్లిదండ్రులంటే భయం గౌరవం లేదు.. వాళ్లు ఎంత రెస్పెక్ట్ ఇస్తారో.. ఇలాంటి మాటలు తరచుగా అంటూ ఉంటారు. కానీ ఇవి అస్సలు అనకూడదు.  తల్లిదండ్రుల మీద పిల్లలకు ద్వేషం పెరగడానికి కారణమవుతుంది.

                                            *నిశ్శబ్ద.