ప‌వ‌న్ చెప్పిన‌...ఎర్ర‌చంద‌నం కొత్త సెంటిమెంట్ క‌థ‌!

 

శేషాచలంలో మాత్ర‌మే పెరిగే ఎర్ర‌చంద‌నం చెట్ల వెన‌క ఉన్న ఒకానొక ఆధ్యాత్మిక గాథ‌ను వెలుగులోకి తెచ్చారు డిప్యూటీ సీఎం, అట‌వీ శాఖా మంత్రి కూడా అయిన ప‌వ‌న్ క‌ళ్యాన్‌. గ‌తంలో ఈ ప్రాంతంలో సంచ‌రించిన వెంక‌టేశ్వ‌ర‌స్వామివారికి గాయం అయ్యింద‌ని. ఆ గాయం  కార‌ణంగా ర‌క్తం చిందింద‌ని. ఆ ర‌క్త‌మే  ఇక్క‌డి గంధ‌పు చెట్ల‌కు అంటి అవి ఎర్ర‌చంద‌నం చెట్లుగా మారాయ‌ని అన్నారాయ‌న‌. ఇంత‌టి డివైన్ స్టోరీస్ ఈ రెడ్ శాండ‌ల్ ట్రీస్ వెన‌క దాగి ఉన్నాయి కాబ‌ట్టి.. ఎవ్వ‌రూ వీటి స్మ‌గ్లింగ్ కి పాల్ప‌డ వ‌ద్ద‌ని సూచించారు.

కొన్నాళ్ల పాటు చూసి ఇలాంటి రెడ్ స్మ‌గ్ల‌ర్ల ప‌ట్ల తాము క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నామ‌ని కూడా వార్న్ చేశారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. అదెలా ఉండ‌బోతుందంటే ఇప్ప‌టికే తాము నాలుగు కింగ్ పిన్స్ ని ఐడెంటిఫై చేశామ‌నీ.. ఇలాంటి వారి కింద  ప‌ని చేసే చోటా మోటా సాధార‌ణ  కూలీల‌తో స‌హా త‌మ వ‌ద్ద వివ‌రాలున్నాయ‌ని.. ఎవ‌రైనా స‌రే వ‌చ్చే రోజుల్లో ఈ ఎర్ర‌చంద‌నం  స్మ‌గ్లింగ్ ని గానీ కంటిన్యూ చేస్తే.. వారిని ఆప‌రేష‌న్ క‌గార్ లా.. మ‌రో కొత్త ఆప‌రేష‌న్ని నిర్వ‌హించి.. ఈ రెడ్ స్మ‌గ్ల‌ర్ల‌ను స‌మూలంగా నాశ‌నం  చేస్తామ‌ని హెచ్చ‌రించారు.

ఇప్ప‌టికే రెడ్ శాండ‌ల్ దేశాంత‌రాలు దాటుతోంద‌ని.. ఇక్క‌డి శేషాచ‌లం కొండ‌ల్లో మాత్ర‌మే  పెరిగే  ఎర్ర‌చంద‌నం ఎక్కోడో నేపాల్లో ప‌ట్టుబ‌డుతోంద‌ని అన్నారు డీసీఎం ప‌వ‌న్. ఇటీవ‌ల మొత్తం ఐదు రాష్ట్రాల‌తో తాము ఒప్పందం చేసుకున్నామ‌నీ.. ఈ ఒప్పందంలో భాగంగా ఎక్క‌డ ఎర్ర‌చంద‌నం దుంగ‌లు ప‌ట్టుబ‌డ్డా వాటిని  ఏపీకి అప్ప‌గించాల‌న్న టై- అప్ చేస్తున్న‌ట్టు చెప్పారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. ఇటీవ‌ల ఒక రాష్ట్రం వారు త‌మ‌కు ప‌ట్టుబ‌డ్డ ఎర్ర‌చంద‌నం దుంగ‌ల‌ను అమ్మితే ఏకంగా వంద కోట్ల‌కు పైగా  సొమ్ము వారి రాష్ట్ర ఖ‌జానాకు అందివ‌చ్చింద‌ని అన్నారు ప‌వ‌న్.

తాము అడ‌వుల్లోకి వెళ్లి చూడ‌గా.. ఎర్ర‌చంద‌నం చెట్టు ఒక్క‌టీ  స‌జావుగా క‌నిపించ‌లేద‌నీ.. అన్ని చెట్ల‌ను న‌రికివేసిన‌ట్టు గుర్తించామ‌నీ చెప్పుకొచ్చారు ప‌వ‌న్.. ఇలా చేస్తే ఈ ప్రాంత  జియోగ్రాఫిక‌ల్ ఐడెంటిఫికేష‌న్ గా ఉన్న ఈ ఎర్ర‌చంద‌నం చెట్టు కొన్నాళ్ల‌కు పూర్తిగా క‌నుమ‌రుగై పోతుంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు ప‌వ‌న్.

ఇప్ప‌టికే ల‌క్ష‌లాది చెట్ల‌ను న‌రికి, కోట్లాది రూపాయ‌ల‌ను వెన‌కేశార‌నీ.. ఇలాంటి  నేరం ఘోరం ఇక‌పై జ‌ర‌గ‌గ‌డానికి వీల్లేదంటూ.. సాక్షాత్ ఆ వెంక‌టేశ్వ‌ర స్వామి  ర‌క్తంతో త‌డిసిన  ఈ చెట్ల ప‌ట్ల  అంద‌రూ జాగ్ర‌త్త వ‌హించాల‌ని అన్నారు. ఈ సంద‌ర్భంగా ప‌ట్టుబ‌డ్డ దుంగ‌ల‌ను ప‌రిశీలించారు ప‌వ‌న్. వీటి విలువ ఐదు వేల కోట్ల రూపాయ‌ల వ‌ర‌కూ ఉంటుంద‌ని అంచ‌నా. 

ఇదిలా ఉంటే.. గ‌తంలో టాస్క్ ఫోర్స్ వారు త‌మ‌కు ప‌ట్టుబ‌డ్డ త‌మిళ‌నాడు స్మ‌గ్ల‌ర్ల చేత వెంక‌టేశ్వ‌ర‌స్వామి వారిపై ఒట్టు వేయించేవారు. ఈ సెంటిమెంటు ద్వారానైనా త‌మిళ‌నాడు జావాదిమ‌లై వంటి ప్రాంతాల నుంచి వ‌చ్చే స్మ‌గ్ల‌ర్ల‌ను అరిక‌ట్టాల‌ని చూశారు. ఆపై ఎన్ కౌంట‌ర్లు చేయ‌డం, అటు పిమ్మ‌ట‌ చెట్ల కోసం మ‌నుషుల‌ను చంపుతారా!? అంటూ త‌మిళ‌నాట పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్తం కావ‌డం  తెలిసిందే. ప‌వ‌న్ హెచ్చ‌రిక‌ల‌ను బ‌ట్టీ చూస్తుంటే.. మ‌ళ్లీ అలాంటి ఉప‌ద్ర‌వం ఏదో జ‌ర‌గ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. ప‌వ‌న్ హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో  స్మ‌గ్ల‌ర్లు వెన‌క్కు త‌గ్గుతారా? లేక‌.. ఎప్ప‌టిలాగా లైట్ తీస్కుని త‌మ న‌రుకుడు తాము చేస్కుంటూ పోతారా; తేలాల్సి ఉంది.

భ‌క్తుల సౌక‌ర్యార్థం తిరుప‌తిలో ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్ : టీటీడీ

  టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు బీఆర్ నాయుడు అధ్యక్ష‌త‌న మంగ‌ళ‌వారం తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌మావేశం నిర్వహించారు. ఇందులో ముఖ్య నిర్ణ‌యాలు ఇలా ఉన్నాయి. టీటీడీ ఆలయాలకు ధ్వజస్తంభం, రథాలు తయారు చేసేందుకు ప‌ల‌మ‌నేరులో 100 ఎకరాలలో దివ్య వృక్షాలు పెంచేందుకు నిర్ణయంచారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో అత్యాధునిక సౌకర్యాలు కల్పించేందుకు అదనంగా రూ.48 కోట్లు మంజూరుకు ఆమోదం తెలిపారు. టీటీడీ బోర్డు ఎడ్యుకేషన్ స‌బ్ క‌మిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా టీటీడీలోని 31 విద్యా సంస్థల్లో డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌లు, సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, అందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌లు,  అవసరమైన సిబ్బంది, తదితర సౌకర్యాలను కల్పించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో రూ.14.40 కోట్లతో శ్రీవారి ఆలయం నిర్మాణానికి ఆమోదం. భ‌క్తుల సౌక‌ర్యార్థం తిరుప‌తిలోని 20 ఎక‌రాల‌లో ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్ నిర్మాణానికి ప్లానింగ్ కొర‌కు, ఆర్కిటిక్ట్ నియామ‌కానికి ఆమోదించారు.  దాత‌ల కాటేజీల నిర్వ‌హ‌ణ‌, నిర్మాణాల‌పై నూత‌న స‌మ‌గ్ర విధానం తీసుకురావాల‌ని నిర్ణ‌యంచారు. తిరుపతి జిల్లా తలకోనలోని శ్రీ సిద్దేశ్వర స్వామివారి ఆలయ పునః నిర్మాణ ప‌నుల‌లో భాగంగా రెండ‌వ ద‌శ‌లో రూ.14.10 కోట్లు మంజూరు చేశారు. తిరుపతిలోని  పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో ప్రస్తుతం ఉన్న 2100 హాస్టల్‌ సీట్లకు అదనంగా మరో 270 హాస్టల్‌ సీట్లు పెంచాలని నిర్ణయంచారు. టీటీడీ ఇంజనీరింగ్‌ విభాగంలో నాలుగు కేటగిరిలలో ఖాళీగా ఉన్న 60 పోస్టులకు ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్‌ ఆధారంగా త్వరలో భర్తీ చేసేందుకు నిర్ణయంచారు. టీటీడీ అనుబంధ ఆలయాలలో ప‌ని చేస్తున్న‌ 62 మంది అర్చక, పరిచారక, పోటు వర్కర్లు, ప్రసాదం డిస్ట్రిబ్యూట‌ర్లకు వేతనాలు పెంచాలని నిర్ణయం. ఇందులో అర్చకులకు రూ.25,000/- నుండి 45,000/- పరిచారకులకు రూ.23,140/- నుండి 30,000/- పోటువర్కర్లకు రూ.24,279/- నుండి 30,000/- ప్రసాదం డిస్ట్రిబ్యూట‌ర్లకు రూ.23,640/- నుండి 30,000/-కు జీతాలు పెంచారు  

ఆస్ట్రేలియా కాల్పుల నిందితుడి వద్ద ఇండియన్ పాస్‌పోర్ట్‌

అస్ట్రేలియా సిడ్నీలోని బోండీబీచ్ కాల్పులకు తెగబడి నరమేథం సృష్టించిన నిందితుడి వద్ద ఇండియన్ పాస్ పోర్టు లభించడం సంచలనం సృష్టిస్తోంది. ఈ కాల్పుల ఘటనకు సంబంధించిన దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వచస్తున్నాయి.  ఈ ఘటనలో నిందితుడైన   సాజిత్ అక్రమ్ వద్ద ఇండియన్ పాస్‌పోర్ట్ ఉన్నట్లు దర్యాప్తు అధికారులు నిర్ధారించారు.సాజిత్ అక్రమ్ హైదరాబాద్ నుంచి పాస్‌పోర్ట్ పొందినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అంతే కాకుండా, అతడు  హైదరాబాద్ నుంచి ఫిలిప్పీన్స్, పాకిస్తాన్‌కు ప్రయాణించినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తు న్నాయి. ఈ ప్రయాణాల వెనుక ఉద్దేశాలు ఏమిటన్న కోణంలో  దర్యాప్తు కొనసాగుతోంది. ఇలా సాజిత్ వద్ద లభించిన పాస్‌పోర్ట్ వివరాలు హైదరాబాద్ చిరునామాతో ఉండటంతో భారత కేంద్ర, రాష్ట్ర నిఘా సంస్థలు అప్రమత్తమయ్యాయి. అతడి కుటుంబ సభ్యుల వివరాలు, నేపథ్యం తదితర  అంశాలపై నిఘావర్గాలు కూపీలాగుతున్నాయి.  ఈ ఘటన అంతర్జాతీయ స్థాయిలో ప్రాధాన్యత సంతరించుకోవడంతో, భారతదేశం– ఆస్ట్రేలియా అధికారుల మధ్య సమన్వయంతో మరింత లోతైన దర్యాప్తు చేపట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు. 

కన్నకూతురిని కడతేర్చిన తల్లి!

కడుపు చించుకు పుట్టిన కుమార్తెనే కడతేర్చిన ఒక తల్లి ఉదంతమింది. తన కుమార్తెను దేవుడు మళ్లీ పుట్టిస్తాడన్న నమ్మకంతోనే చంపేసినట్లు చెబుతున్న ఆ తల్లిది ఉన్మాదమా, మూఢనమ్మకమా, పిచ్చా అని స్థానికులు దుయ్యబడుతున్నారు. వివరాలిలా ఉన్నాయి.  మల్కాజ్‌గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో వసంతపురి కాలనీలో నివాసముంటున్న మోనాలిసా అనే మహిళ తన ఏడేళ్ల కుమార్తె  షారోని మేరిని ఒక్కసారిగా బిల్డింగ్  మూడో అంతస్తు పైనుంచి కిందకు తోసివేసింది‌. పెద్ద ఎత్తున శబ్దం రావడంతో స్థానికులు బయటికి వచ్చి చూడగా చిన్నారి రక్తమడుగులో పడి ఉంది.  వెంటనే చిన్నారిని గాంధీ ఆస్పత్రికి తర లించగా చికిత్స పొందుతూ  చెందింది. ఈ ఘటనపై సమా చారం అందుకున్న మల్కాజ్‌గిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిం చారు. తల్లి మోనాలిసాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  దేవుడు తన పాపను మళ్లీ పుట్టిస్తాడన్న నమ్మకం తో తన పాపను చంపానని తల్లి చెప్పడంతో  ఆమెది మూఢ విశ్వాసమా, మానసిక స్థితి సరిగా లేదా అన్న కోణంలో విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  

కోఠి మహిళా వర్సిటీ మెస్ ఇంఛార్జ్ సస్పెండ్

  కోఠి వీరనారి చాకలి ఐలమ్మ మ‌హిళా యూనివ‌ర్సిటీ మెస్ ఇంఛార్జ్ వినోద్‌ను  ప్రిన్సిపాల్ సస్పెండ్ చేశారు. విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థనులను వేధిస్తున్నాడు అంటూ వినోద్ పై ఆరోపణలు వచ్చాయి. హాస్టల్ లో చదువుతున్న విద్యార్థినులే షీ టీమ్‌కు ఫోన్ చేసి వినోద్ వేధింపులకు గురి చేస్తున్నాడని ఫిర్యాదు చేశారు. అతడి ప్రవర్తన ఇబ్బందికరంగా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. యాజమాన్యం కూడా అతడికే మద్దతుగా ఉందని, ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని విద్యర్థులు షీ టీమ్‌తో వాపోయారు.  తమను పర్సనల్ గా టార్గెట్ చేస్తారనే కారణం కంప్లైంట్ చేయలేకపోతున్నామని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు.  రంగలోకి దిగిన షీ టీమ్ ప్రిన్సిపాల్‌ను ఘటనపై ఆరా తీసింది. అయితే మొదట ప్రిన్సిపాల్ మీడియాతో మాట్లాడుతూ తమకు వినోద్ పై విద్యార్థినుల నుండి ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు. మరోవైపు యూనివ‌ర్సిటీలో పీజీ విద్యార్థినిలు ఆందోళన చేపట్టారు. వేధింపుల ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. యూనివర్సిటీ ప్రాంగణంలో జరుగుతున్న షూటింగ్స్ కారణంగా తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని విద్యార్థినులు ఆరోపించారు.  ముఖ్యంగా వర్కింగ్ డేస్‌లో షూటింగ్స్‌కు అనుమతిస్తే సెక్యూరిటీ గార్డులు వేధింపులకు గురిచేస్తు న్నారని వారు వాపోయారు. గత కొన్ని రోజుల క్రితం జరిగిన ఓ షూటింగ్ సమయంలో క్యారీ వాన్‌లో విద్యార్థినులను నిర్బంధించారని ఆరోపిస్తూ విద్యార్థినులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. షూటింగ్స్ వల్ల చదువుకు ఆటంకం కలుగుతోందని, భద్రతా సమస్యలు కూడా తలెత్తుతున్నాయని వారు తెలిపారు.  ఈ క్రమంలో షూటింగ్స్‌కు అనుమతి ఇవ్వకూడదని, అత్యవసర పరిస్థితుల్లో ఇచ్చినా శని, ఆదివారాల్లో మాత్రమే అనుమతించాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యార్థిను లను వేధింపులకు గురిచేస్తున్న వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో యూనివర్సిటీ ప్రిన్సిపల్ స్పందించారు.  ఇకపై షూటింగ్స్‌కు శని, ఆదివారాల్లో మాత్రమే అనుమతి ఇస్తామని ప్రిన్సిపాల్ హామీ ఇచ్చారు. వర్కింగ్ డేస్‌లో షూటింగ్స్‌కు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. వీసీని కలిసేందుకు పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాల నాయకులు సైతం తరలి వచ్చారు. మరోవైపు యూనివర్సిటీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా  విశ్వవిద్యాలయంలో పోలీసులు మోహరించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

బ్రెజిల్‌లో నేలకొరిగిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహం

దక్షిణ అమెరికాలోని బ్రెజిల్ దేశంలో తుఫాను బీభత్సానికి  స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కూలిపోయింది. 79 అడుగుల ఎత్తు ఉన్న ఈ  విగ్రహం తుపాను ధాటికి గంటకు 90 కిలోమీటర్ల వేగంతో వీచిన బలమైన గాలులకు కుప్పకూలింది.  ఇలా ఉండగా బ్రెజిల్ ను తుపాను అతలాకుతలం చేసింది.  రియో గ్రాండే డో సుల్ రాష్ట్రంలో గుయైబా నగరంలో సంభవించిన తీవ్ర తుఫాను ధాటికి  స్థానిక రిటైల్ స్టోర్ హవాన్ మెగాస్టోర్ బయట ఏర్పాటు చేసిన  79 అడుగుల ఎత్తైన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ  విగ్రహం నెమ్మదిగా ముందుకు వంగి చూస్తుండగానే ఖాళీ పార్కింగ్ స్థలంలో పడిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోలు,ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.  తుపాను హెచ్చరికల నేపథ్యంలో ముందుగానే అప్రమత్తమైన  ప్రభుత్వం  ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించి, అక్కడి నుంచి వాహనాలను తరలించడంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు.   విగ్రహం కూలిపోయిన ఘటనను గుయైబా మేయర్ మార్సెలో మరానటా సోషల్ మీడియాలో ధృవీకరించారు. హవాన్ సిబ్బంది తక్షణమే ఆ ప్రాంతంలో అందర్నీ ఖాళీ చేయించడం వల్ల ఎవరికీ గాయాలు కాలేదని తెలిపారు.   ఇక హవాన్ మెగాస్టోర్ కార్యకలాపాలకు ఎలాంటి అంతరాయం కలగకుండానే స్టాట్యూ ఆఫ్ లిబర్టీ శిథిలాల తొలగింపు చేపట్టారు. అయితే.. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని విగ్రహాలు సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని సదరు కంపెనీ స్పష్టం చేసింది. మరోవైపు.. ఈ ఘటనపై అంతర్గత దర్యాప్తును ప్రారంభించింది. బ్రెజిల్ పౌర రక్షణ సంస్థ తుఫాను హెచ్చరికలను ముందస్తుగానే ప్రజలకు తెలియజేయడానికి మొబైల్ ఫోన్‌లకు మెసేజ్‌లు పంపించింది. తుఫాను, బలమైన గాలులు, కూలిపోయే ప్రమాదం ఉన్న నిర్మాణాల గురించి హెచ్చరించింది. తీవ్రమైన వేడి, శీతల గాలి కలయికతో ఏర్పడిన ఈ అల్పపీడన వ్యవస్థ కారణంగా రియో గ్రాండే డో సుల్ రాష్ట్రంలో ఈ తుఫాను సంభవించింది. గతంలో 2021లో కాపావో డా కానోవాలో గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో కూడిన గాలులు, తుఫాను సమయంలో మరో హవాన్ విగ్రహం కూలిపోయింది. అప్పుడు కూడా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

ఒక్కరోజులో రూ.15 లక్షల కోట్లు పెరిగిన మస్క్ సంపద

ప్రపంచ  కుబేరుడు, టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ మరోసారి చరిత్ర సృష్టించారు. ఆయన నికర సంపద ఫోర్బ్స్, బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం 600 బిలియన్ డాలర్లు దాటేసింది. ఐపీఓకు రాబోతున్న స్పేస్ ఎక్స్ విలువ అమాంతం పెరగడంతో దాంట్లో మెజార్టీ వాటా ఉన్న మస్క్ సంపద విపరీతంగా పెరిగింది. ఒక్కరోజులోనే ఏకంగా రూ. 15 లక్షల కోట్లకుపైగా సంపద పెరగడంతో ప్రస్తుతం మస్క్ గురించే అంతా చర్చించుకుంటున్నారు. దిగ్గజ పారిశ్రామిక వేత్త, టెస్లా, స్పేస్ ఎక్స్, ట్విట్టర్ (x) సంస్థల యజమాని, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎలాన్ మస్క్  నికర సంపద సోమవారం (డిసెంబర్ 16)  రికార్డు స్థాయిలో 600 బిలియన్ డాలర్లు దాటేసింది. మస్క్‌కు మెజార్టీ వాటా ఉన్న స్పేస్ ఎక్స్.. ఐపీఓకు వస్తుందన్న వార్తల నేపథ్యంలో దాని విలువ భారీగా పెరగడంతో మస్క్ సంపద కూడా రికార్డు స్థాయిలో పెరిగింది. స్పేస్ ఎక్స్ విలువ సుమారు 800 బిలియన్ డాలర్లు అంటూ భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ. 72 లక్షల కోట్లుగా  లెక్కగట్టారు. దీంతో ఇందులో సుమారు 42 శాతం వాటా ఉన్న మస్క్ సంపద  ఒక్కరోజులోనే గణనీయంగా పెరిగింది. ఫోర్బ్స్ బిలియనీర్స్ జాబితా ప్రకారం చూస్తే మస్క్ సంపద డిసెంబర్ 15-16 మధ్య ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో 168 బిలియన్ డాలర్లు (రూ. 15.26 లక్షల కోట్లు) పెరిగి.. 677 బిలియన్ డాలర్లకు (రూ. 61 లక్షల కోట్లకు) చేరిందని తెలిపింది. దీంతో ప్రపంచంలోనే 600 బిలియన్ డాలర్ల సంపద దాటిన తొలి వ్యక్తిగా మస్క్ సరికొత్త చరిత్ర సృష్టించారు. ఇదే సమయంలో ఈవీ కార్ మేకర్ టెస్లా షేర్లు కూడా ఇటీవలి కాలంలో పెరుగుతున్న నేపథ్యంలో మస్క్ సంపద విపరీతంగా పెరిగిందని చెబుతున్నారు. ఇందులో కూడా మస్క్‌కు 12 శాతం వాటా ఉంది. టెస్లా షేరు   సోమవారం (డిసెంబర్ 15)సెషన్‌లోనూ 4 శాతం పెరిగి 475.31 డాలర్ల వద్ద స్థిరపడింది. ఈ స్టాక్ ధర ఈ ఏడాదిలోనే ఇప్పటివరకు  25 శాతానికిపైగా పెరిగింది. 6 నెలల్లో 44 శాతం పుంజుకుంది. మరోవైపు.. ఫ్రంట్ ప్యాసింజర్ సీటులో సేఫ్టీ మానిటర్స్ లేకుండానే ఉండే రోబోటాక్సీల్ని ప్రస్తుతం పరీక్షిస్తున్నట్లు మస్క్ ప్రకటించడం కూడా టెస్లా షేరు పెరిగేందుకు కారణమైంది.బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం మస్క్ సంపద ఒక్కరోజులో 167 బిలియన్ డాలర్లు (రూ. 15.16 లక్షల కోట్లు) పెరగ్గా.. 638 బి. డాలర్లుగా ఉందని తెలిసింది. ఇది భారత కరెన్సీలో రూ. 58 లక్షల కోట్లకు సమానం. ఏదేమైనా మొత్తంగా 600 బిలియన్ డాలర్ల సంపద దాటేశారు. స్పేస్ ఎక్స్ వచ్చే ఏడాది ఐపీఓకు వచ్చేందుకు ప్లాన్ చేస్తుండగా.. సుమారు 30 బిలియన్ డాలర్ల వరకు నిధుల్ని సమకూర్చాలని చూస్తోంది. ఇది భారత కరెన్సీలో రూ. 2.75 లక్షల కోట్లకుపైనే ఉంటుంది. తద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద ఐపీఓగా చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతోంది. అంతకుముందు ఈ ఏడాది నవంబరులో మస్క్‌కు 1 ట్రిలియన్ డాలర్ (సుమారు రూ. 90 లక్షల కోట్లు) పే ప్యాకేజీకి టెస్లా షేర్ హోల్డర్లు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఇది కార్పొరేట్ చరిత్రలోనే అతిపెద్ద పే ప్యాకేజీ కావడం విశేషం. ఇక్కడ టెస్లా నిర్దేశించిన లక్ష్యాల్ని మస్క్ చేరుకుంటే.. దశల వారీగా ఇది మస్క్‌కు అందుతుంది. దీంతో మస్క్ ట్రిలియనీర్‌గా అవతరిస్తారు.

నోట్లో పడ్డ ఆకు ఉమ్మినందుకు రూ.30 వేల జరిమానా

బ్రిటన్‌లో చట్టాలు పకడ్బందీగా అమలు చేస్తున్నామని అధికారులు చెప్పుకుంటుంటే.. తాజాగా బ్రిటన్‌లో చట్టాల అమలు తీరుపై మరోసారి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. స్థానికంగా నివసించే 86 ఏళ్ల రాయ్ మార్ష్.. తన నోట్లోకి గాలికి వచ్చి పడిన ఒక ఆకును ఉమ్మేసినందుకు గానూ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఏకంగా  30,337 రూపాయలు జరిమానా విధించడం సంచలనం సృష్టించింది.  గ్రేట్ బ్రిటన్‌లో ఆస్థమాతో బాధపడుతున్న వృద్ధుడిని ఏమాత్రం కనికరం చూపకుండా వేధించారని ఆయన కూతురు సోషల్ మీడియా ద్వారా ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయ పోరాటం తర్వాత ఫైన్ తగ్గించినా, ఇటువంటి చిన్న చర్యలకు భారీ జరిమానాలు విధిస్తున్న లింకన్‌షైర్ కౌన్సిల్‌పై ప్రజలు మండిపడుతున్నారు. సాధారణంగా ఎక్కడైనా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు గాలికి కొట్టుకొస్తూ.. ఒంటిపై, ముఖంపై దుమ్మూ ధూళి పడుతుంటాయి. ఒక్కోసారి చెత్తాచెదారం కూడా కొట్టుకొస్తూ నోట్లోనూ పడుతుంటుంది. అలా ఎండిపోయిన ఆకులో, కాగితాలో వచ్చి నోట్లో చేరితే వెంటనే మనం ఉమ్మేస్తుంటాం. ఇదంతా అందరూ చేసేదే. దీంట్లో పెద్ద తప్పేమీ లేదు. కానీ ఇదే పని చేసినందుకు ఓ 86 ఏళ్ల వృద్ధుడికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.36 వేల జరిమానా విధించారు బ్రిటన్ అధికారులు.  గాలికొచ్చిన ఆకు నోట్ల పడ్డందుకు ఉమ్మినందుకే ఇంత జరిమానా వేయడం తీవ్ర విమర్శల పాలవుతోంది. బ్రిటన్‌లో చట్టాన్ని అతిగా అమలు చేసిన ఆ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 86 ఏళ్ల వృద్ధుడు రాయ్ మార్ష్.. తన నోట్లోకి గాలికి వెళ్లిన ఒక ఆకును ఉమ్మేసినందుకు గానూ స్థానిక అధికారులు ఏకంగా 250 పౌండ్లు (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.30,337) జరిమానా విధించారు. న్యాయ పోరాటం తర్వాత జరిమానా 150 పౌండ్లకు (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.18,202) తగ్గించినప్పటికీ.. ఈ  నిర్దోషి చర్యకు భారీ మూల్యం చెల్లించుకోవడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

సర్వీస్ రివాల్వర్ మిస్సింగ్.. ఎస్సై భానుప్రకాష్ పై క్రిమినల్ కేసు

హైదరాబాద్ పోలీసు శాఖలో తీవ్ర సంచలనం సృష్టించిన ఎస్సై భాను ప్రకాష్ వ్యవహారంలో పోలీసు శాఖ  సీరియస్ యాక్షన్ కు దిగింది. భాను ప్రకాష్ సర్వీస్ రివాల్వర్ మిస్సింగ్ కేసులో ఆయనపై క్రిమినల్ కేసు నమోదైంది. భాను ప్రకాష్ వ్యవహారంపై పోలీసుల దర్యాప్తులో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగుచేశాయి. భాను ప్రకాష్ సర్వీస్ రివాల్వర్ మే నెల నుంచే మిస్సైందని తేలింది. అంతే కాకుండా భాను ప్రకాష్ సర్వీస్ రివాల్వర్ చోరీకి గురి కాలేదనీ, స్వయంగా భాను ప్రకాషే తన గన్ ను దొంగతనంగా బయటకు తీసుకువెళ్లినట్లు పోలీసుల దర్యాప్తులో రూఢీ అయ్యింది.   స్టేషన్ లో సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన అధికారులు   భాను ప్రకాష్ గన్ తీసుకువెళ్లడం సీసీ కెమేరాల్లో రికార్డు కాకుండా ఉండేందుకు  కెమెరాకు అడ్డుగా టేబుల్‌ను పెట్టి, ఆ తర్వాత గన్‌ను తన పాకెట్‌ లో పెట్టుకుని బయటకు వెళ్లినట్టు  పోలీసులు గుర్తించారు. అతడు గన్ ను తీసుకువెళ్లిన రోజు నుంచే అది మిస్సైందని గుర్తించారు. ఇక పోతే భాను ప్రకాష్ ఆర్థిక అరాచకత్వంపై కూడా పోలీసులు కూపీ లాగారు.  భాను ప్రకాష్ ఆన్‌లైన్ బెట్టింగ్‌లో కోటి రూపాయల వరకు నష్టపోయినట్టు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఈ నష్టాల కారణంగానే సర్వీస్ గన్‌ను విక్రయించినట్టు పోలీసులు అనుమాని స్తున్నారు.   ఈ కేసులో మరెవరిదైనా ప్రమేయం ఉందా?, గన్ ఎవరికి అమ్మాడు? అనే కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. 

శ్రీ చరణ్ రెడ్డికి ప్రభుత్వోద్యోగం, ఇంటి స్థలం.. ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కార్

తెలుగు తేజం, టీమ్ ఇండియా మహిళా క్రికెట్ జట్టు ప్లేయర్ శ్రీచరణ్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ హోదా కలిగిన ఉద్యోగాన్ని కల్పిస్తూ సోమవారం (డిసెంబర్ 15) ఉత్తర్వులు జారీ చేసింది. మహిళల వన్డే వరల్డ్ కప్ క్రికెట్ టోర్నీలో టీమ్ ఇండియా విజేతగా నిలవడంలో  శ్రీచరణ్ రెడ్డి కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. డప జిల్లాకు చెందిన 21 ఏళ్ల శ్రీచరణి, లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో రాణిస్తున్నారు. ఈ ఏడాది శ్రీలంకలో జరిగిన వన్డే సిరీస్‌తో ఆమె అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. ఇటీవల జరిగిన ఐసీసీ మహిళల ప్రపంచ కప్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి, జట్టు విజయంలో ముఖ్య భూమిక పోషించింది. ఆ తరువాత ఆమె అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారాలోకేష్ ను కలిశారు. ఆ సందర్భంగా ఆమెను సన్మానించిన రాష్ట్ర ప్రభుత్వం, అప్పుడే ఆమెకు గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగం, కడపలో వెయ్యి గజాల ఇంటి స్థలం ఇస్తామని ప్రకటించింది. ఇప్పుడు ఆ ప్రకటన మేరకు ఉద్యోగం కల్పించి, అలాగే కడపలో వెయ్యి గజాల ఇంటి స్థలాన్నీ కేటాయిస్తూ ఉత్తర్వ్యులు జారీ చేసింది.

సోనియా, రాహుల్ కు ఢిల్లీ కోర్టులో ఊరట

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలకు   ఊరట లభించింది. ఈ కేసులో వారిరువురితో పాటు మరో ఐదుగురిపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడి) దాఖలు చేసిన చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకునేందుకు ఢిల్లీ కోర్టు మంగళవారం (డిసెంబర్ 16) నిరాకరించింది. అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌ (ఏజేఎల్) కాంగ్రెస్‌ పార్టీ రూ.90 కోట్ల రుణం అందించి దాని ఆస్తుల్ని ఆధీనంలోకి తీసుకోగా.. రాహుల్‌, సోనియాకు మెజార్టీ వాటా ఉన్న యంగ్‌ ఇండియా రూ.50 లక్షలు మాత్రమే కాంగ్రెస్‌ పార్టీకి చెల్లించి ఏజేఎల్‌ను సొంతం చేసుకొన్నట్లు ఈడీ చెబుతోంది.   కాగా ఎఫ్ ఐఈర్ లేకుండా మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద ఇడి దాఖలు చేసిన ఫిర్యాదును  సమర్థించలేమని ఢిల్లీ రోస్‌ అవెన్యూ కోర్టు పేర్కొంది. అంతే కాకుండా ఇదే కేసులో   ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం ఇప్పటికే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిందని పేర్కొన్న కోర్టు, ఇప్పుడు ఈడి చార్జిషీటుపై ముందస్తుగా స్పందించలేమని పేర్కొంది. నేషనల్‌ హెరాల్డ్‌ మాతృసంస్థ అయిన అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌(ఏజేఎల్)ను మోసపూరితంగా స్వాధీనం చేసుకోవడానికి కుట్రపన్నారని ఆరోపిస్తూ సోనియా, రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ విదేశీ విభాగం చీఫ్‌ శామ్‌ పిట్రోడా సహా ఐదుగురిపై ఆర్థిక నేరాల విభాగం  గత నెలలో నివేదికను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈడి అందించిన సమాచారం ఆధారంగా ఇఒడబ్ల్యు ఈ నివేదికను సమర్పించింది.