శ్రీ చరణి రెడ్డికి ప్రభుత్వోద్యోగం, ఇంటి స్థలం.. ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కార్
posted on Dec 16, 2025 @ 11:25AM
తెలుగు తేజం, టీమ్ ఇండియా మహిళా క్రికెట్ జట్టు ప్లేయర్ శ్రీచరణి రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ హోదా కలిగిన ఉద్యోగాన్ని కల్పిస్తూ సోమవారం (డిసెంబర్ 15) ఉత్తర్వులు జారీ చేసింది. మహిళల వన్డే వరల్డ్ కప్ క్రికెట్ టోర్నీలో టీమ్ ఇండియా విజేతగా నిలవడంలో శ్రీచరణి రెడ్డి కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. కడప జిల్లాకు చెందిన 21 ఏళ్ల శ్రీచరణి, లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో రాణిస్తున్నారు.
ఈ ఏడాది శ్రీలంకలో జరిగిన వన్డే సిరీస్‌తో ఆమె అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. ఇటీవల జరిగిన ఐసీసీ మహిళల ప్రపంచ కప్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి, జట్టు విజయంలో ముఖ్య భూమిక పోషించింది. ఆ తరువాత ఆమె అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారాలోకేష్ ను కలిశారు. ఆ సందర్భంగా ఆమెను సన్మానించిన రాష్ట్ర ప్రభుత్వం, అప్పుడే ఆమెకు గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగం, కడపలో వెయ్యి గజాల ఇంటి స్థలం ఇస్తామని ప్రకటించింది. ఇప్పుడు ఆ ప్రకటన మేరకు ఉద్యోగం కల్పించి, అలాగే కడపలో వెయ్యి గజాల ఇంటి స్థలాన్నీ కేటాయిస్తూ ఉత్తర్వ్యులు జారీ చేసింది.