గాలిలో దీపం.. ప్రజారోగ్యం
posted on Oct 22, 2012 @ 12:04PM
రాష్ట్రంలో డెంగ్యూ, స్వైన్‌ఫ్లూ లాంటి విషజ్వరాలు ముసురుకొని ప్రజల ప్రాణాలను హరిస్తున్నప్పటికీ ప్రభుత్వానికి చీమకుట్టినట్టు లేదు. సంబంధిత శాఖామాత్యులు ఏం చేస్తున్నారో తెలియదు. ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారో తెలియదు. విషజ్వరాల బారినపడిన రోగులతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. వర్షాకాలంలో దోమలు విజృంభించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంటాయి. లార్వా దశలోనే వాటిని నిర్మూలించి ప్రజారోగ్యాన్ని కాపాడడానికి ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు రూపొందించుకొని, అమలు చేయడం కనీస కర్తవ్యం. ఈ బాధ్యతను ప్రభుత్వం నిర్వర్తించలేదు. దాని ఫలితమే ప్రస్తుత హెల్త్ ఎమర్జెన్సీ పరిస్థితి. దోమల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులను కూడా సద్వినియోగం చేయడం లేదు. ప్రజారోగ్యం పట్ల మన నాయకులకు ఎంత చిన్నచూపో చెప్పడానికి ఇక్కడ ఒక ఉదాహరణ. లార్వా దశలో దోమల నివారణకు కేంద్ర ప్రభుత్వం ఒక్కో మండలానికి రెండున్నర లక్షల రూపాయలు కేటాయించింది. ఈ పథకం అమలుకు అవసరమైన సామగ్రి తయారు చేసే ఒక ప్రైవేటు సంస్థ ప్రతినిధి, తెలంగాణ ప్రాంతంలో ఒక మండలాధ్యక్షుడిని కలిశాడు. పథకం గురించి వివరించాడు. అప్పుడు ఆ నాయకుడినుంచి వచ్చిన స్పందన ఏమిటంటే... ‘పండక్కి బట్టలు కొనుక్కోవడానికి ఈ డబ్బులు పంపించారు కానీ దోమలను చంపడానికి కాదు’ అని! వినగానే నవ్వు రావచ్చు కానీ, ఇది యదార్ధ సంఘటన.