విజయమ్మ బైబిల్ పాఠాలు
posted on Oct 22, 2012 @ 12:02PM
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ బైబిల్ పట్టుకుని సభలలో పాల్గొనడంపై మరో విడత వివాదం చెలరేగుతోంది. ఆమె మత ప్రచారం చేస్తున్నట్టుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో విజయమ్మ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదు. బైబిల్ పట్టుకుని ఉపన్యసిస్తే.. ఆ వ్యక్తిని క్రిస్టియన్ ఫాదర్ అనే అనుకుంటారు. విజయమ్మ బైబిల్ పట్టుకొని సభలో పాల్గొనకూడదనే రూలేమీ లేదు. అయితే భారతదేశం లౌకిక ప్రజాస్వామిక దేశం. విజయమ్మ ఒక సెక్యులర్ రాజకీయ పార్టీకి గౌరవ అధ్యక్షురాలు. అటువంటి హోదాలో వున్న వ్యక్తి ప్రత్యేకించి ఒక మత గ్రంథాన్ని చేతిలో ధరించి బహిరంగ వేదికలపై పాల్గొనడం ఆక్షేపణీయమే. తాను చర్చిలకే కాకుండా దేవాలయాలు, మసీదులను కూడా సందర్శిస్తుంటానని ఆమె చెప్పారు. అన్ని మతాలపై విశ్వాసం వుందని సెలవిచ్చారు. బైబిల్ పట్టుకుంటే ధైర్యంగా వుంటుందని, మైకు ముందు నిలబడి ధైర్యంగా మాట్లాడేందుకు శక్తి వస్తుందని విజయమ్మ చెప్పుకున్నారు. ఆమెకు ఎలాగూ అన్ని మతాలపై విశ్వాసం వుంది కాబట్టి, మరింత ధైర్యం చేకూరేందుకు, మరింత వాగ్ధాటితో మాట్లాడే శక్తిని కూడగట్టుకునేందుకు విజయమ్మ బైబిల్‌తో పాటు భగవద్గీత, ఖురాన్‌లను కూడా చేతిలో పట్టుకొని సభలలో పాల్గొంటే ఎవరినుంచీ ఏ ఆక్షేపణా వుండదు కదా?