Read more!

మద్యపానం కంటే మహా ప్రమాదకరమైన అలవాటు.. తెలీకుండానే ప్రజల ఆయుష్షు హాం.. ఫట్..

జీవితకాలాన్ని తగ్గించడంలోనూ, ప్రాణ ప్రమాదాలు పెంచడంలోనూ మద్యపానం ఎప్పుడూ ప్రథమ స్థానంలోనే ఉంటుంది. దీని కారణంగా క్యాన్సర్ లు చాలా తొందరగా వచ్చేస్తాయి. ఇన్నాళ్ళు మనుషులలో  ఉన్న చాలా చెడ్డ అలవాటు అంటే మద్యపానంనే పేర్కొనేవారు, దాన్నే చూపించేవారు. కానీ మద్యపానం కంటే అతిపెద్ద  ప్రమాదకరమైన అలవాటు చాలా మంది ప్రజలలో ఉంది.  ఇది మనిషి జీవితకాలాన్నిగణనీయంగా తగ్గిస్తుందని తేలింది.అసలంత ప్రమాదకరమైన అలవాటు ఏమిటి? ప్రమాదమని తెలియకుండానే ప్రజలు దీని బారిన ఎలా పడుతున్నారు తెలుసుకుంటే..

ఈ రోజుల్లో ప్రజలు గంటల తరబడి ఆఫీసులలో కూర్చొని పని చేయవలసి వస్తోంది.  సగటున ఒక ఉద్యోగి రోజుకు 9 నుండి 10 గంటలు కంప్యూటర్ల ముందు కూర్చుని పనిచేస్తున్నారు.  ఇలా పనిచేసేవారిలో చాలామందికి శారీరక శ్రమ చేసే అలవాటు ఉండదు. ఎందుకంటే ఉరుకులు పరుగుల మీద ఆఫీసులకు వెళ్ళడం, ఆ తరువాత  అక్కడ 10గంటలు పని చేయడం తిరిగి ఇంటికి చేరుకోవడంతో చాలా అలసిపోతారు. ఆ తరువాత ఇంట్లో కూడా టీవి, మొబైల్ బ్రౌజింగ్ లో సమయం గడుపుతారు. దీంతో అసలు శారరీక శ్రమ చేసే వెలుసుబాటే ఉండదు.
మరికొందరు రోజంతా మంచం లేదా సోఫాపై పడుకుంటారు. పెద్దగా పనులు చేయకుండానే రోజు గడిపేస్తారు. ఇలా ప్రత్యేకత ఏమీ లేకుండా నిశ్చలమైన జీవనశైలి కలిగిన వ్యక్తులను మీద చేసిన పరిశోధనలలో చాలా షాకింగ్ విషయాలు బయటకొచ్చాయి.

దాదాపు 12వేల మంది జీవనశైలిని పరిశోధకులు పరిశీలించారు. వీరు కనీసం రెండేళ్ళపాటు ఫిజికల్ యాక్టివిటీ రీడింగ్  ట్రాక్ చేయగల డిజిటల్ పరికరాన్ని తమ వెంటే ఉంచుకున్నారు.  వీరిలో ప్రతి రోజూ సగటున 10గంటల సేపు నిశ్చలంగా కూర్చుని ఉన్నవారిలో  ఆరోగ్య పరంగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ప్రతిరోజూ 12గంటల కంటే ఎక్కువ సేపు కూర్చుని పనిచేసేవారిలో 7శాతం మంది  5సంవత్సరాలలో ఒకరి తరువాత  మరొకరు మరణించారు.  ప్రతిరోజూ 12గంటలు కూర్చుని పనిచేసి రోజులో 22నిమిషాల కంటే తక్కువగా శారీరక శ్రమ చేసేవారిలో మరణ ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది.

ఎక్కువ సేపు కూర్చుని పనిచేయడం అనేది ఇప్పటి ఉద్యోగాల రీత్యా తప్పించుకోలేని విషయం.  కానీ దీని వల్ల కలిగే ప్రమాదాలను తప్పించుకోవాలంటే మాత్రం ప్రతిరోజూ కనీసం 22నిమిషాల కంటే ఎక్కువసేపు వ్యాయామం చెయ్యాలి. లేకపోతే 10 నుండి 12 గంటలు పనిచేయడమనే అలవాటు ముందుగానే మరణాన్ని వెంటబెట్టుకొస్తుంది. వ్యాయామానికి కూడా షెడ్యూల్ ప్లాన్ చేసుకోవాలి. సైక్లింగ్, రన్నింగ్, ఏరోబిక్ వ్యాయామాలు మొదలైనవి రోజులో కనీసం 10నిమిషాలు అయినా ఉండాలి. ఇవి మాత్రమే కాకుండా ఇంటి పని, తోట పని మొదలైనవి సొంతంగా చేసుకుంటే చాలా మంచిది.

బిజీ షెడ్యూల్ కారణంగా వ్యాయామం చేయడానికి సమయం లేదని చెప్పేవారు కనీసం 10నిమిషాలు అయినా వ్యాయామాలు చేయడం ద్వారా మరణ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.  కేవలం వ్యాయామం చేయడం ద్వారా మరణ ప్రమాదాన్ని 35శాతం తగ్గించుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. కాబట్టి ప్రతిరోజూ కనీసం 22నిమిషాలకు తగ్గకుండా వ్యాయామం చేయడం, వీలైన వరకు శారీరక శ్రమ చేయడం  వల్ల మరణ ప్రమాదాన్ని దూరంగా ఉంచవచ్చు.

                                                     *నిశ్శబ్ద.