కేధార్ నాథ్ స్టేట్ బ్యాంకులో రూ.4.25కోట్లు గంగ పాలు
posted on Jun 24, 2013 @ 3:43PM
ఒకవైపు ఉత్తరాఖండ్ ను హటాత్తుగా ముంచెత్తిన వర్షాలతో వేలాది మంది మృత్యువుతో పోరాడుతుంటే, వారిని రక్షించేందుకు ప్రభుత్వం, స్వచ్చంద సంస్థలు కృషి చేస్తున్నాయి. అయినప్పటికీ, అనేక వేల మంది ప్రజలు, ముఖ్యంగా మహిళలు, వృద్దులు, పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఎక్కడపడితే అక్కడ గుట్టలు గుట్టలుగా పడి ఉన్నశవాలను చూస్తే మనిషన్న వాడికి గుండె కరిగి కన్నీరవక మానదు. కానీ, మానవులలో దానవులు ఎప్పుడూ పొంచి ఉండనే ఉంటారు. చనిపోయిన వారి ఒంటి మీద ఉండే బంగారు, వెండి వస్తువులను ఒలుచుకొనే ప్రయత్నంలో కొందరు దుండగులు, కత్తులు గొడ్డళ్ళతో శరీర భాగాలను నరికి మరీ ఆభరణాలు వలుచుకు పోతునట్లు సమాచారం.
ఇక, కేదార్ నాథ్ మందిరానికి దగ్గరలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ఏకంగా రూ.5కోట్లు మాయమయ్యాయి. వరదలు రాక మునుపు ఉన్న డబ్బు, తగ్గిన తరువాత కనబడలేదు. కేదార్ నాథ్ మందిరం కమిటీ సభ్యుడు రాజ్ కుమార్ చెప్పిన దాని ప్రకారం, వరదలు ముంచుకు రాగానే, బ్యాంక్ సిబ్బందితో సహా అందరూ ప్రాణాలు రక్షించుకొనేందుకు పక్కనే ఉన్న గుడిలోకి పరుగులు తీసారు. అప్పటికి, బ్యాంక్ లో రూ.5కోట్ల నగదు ఉన్నట్లు ఖచ్చితమయిన లెక్కలున్నాయి. అయితే వరదల దాటికి బ్యాంకులోకి కూడా నీరు ప్రవేశించడంతో లోనున్నకంపూటర్లు, బల్లలు వంటి వాటితో సహా నగదు మొత్తం కొట్టుకుపోయింది.
అయితే ఆ సమీపంలో ఉన్న కొందరికి డబ్బు కట్టలు దొరికినట్లు ఆయన చెప్పారు. వరద ఉద్రుతి తగ్గిన తరువాత ఒక యువకుడు ఆర్మీ హెలికాఫ్టర్ లో ఎక్కబోతుండగా, అనుమానం వచ్చిన అధికారులు అతని బ్యాగులు తెరిచి చూస్తే అందులో రూ.83లక్షల నగదు దొరికింది. అయితే ఆ వ్యక్తి ఆ నగదు గురించి అడిగినప్పుడు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అతనిని అధికారులు పోలీసులకి అప్పగించారు. ఉత్తరాఖండ్ డీజీపీ సత్యవ్రత్ బన్సాల్, మీడియాతో మాట్లాడుతూ ఆ డబ్బు బ్యాంకు నుండి మాయమయినదేనని దృవీకరించారు.
బ్యాంకు అధికారులు మిగిలిన నోట్ల సంఖ్యలు కూడా మీడియాకు విడుదల చేసి, ఎవరికయినా ఆ డబ్బు దొరికినట్లయితే బ్యాంకుకు అందజేయాలని కోరారు. అయితే, మిగిలిన నాలుగు కోట్ల పాతిక లక్షలు గంగ పాలు అయిందో లేక ఎవరికయినా దక్కిందో తెలియదు కానీ, ఈ వార్త మాత్రం కేధార్ నాథ్ లో ఇప్పుడు సంచలనం రేకెత్తిస్తోంది.
కేధార్ నాథ్ మందిరం రోజూవారి ఆదాయం రూ.1లక్ష రూపాయలను ఏరోజుకారోజు సాయంత్రం బ్యాంకులో జమా చేస్తుంటారు. బ్యాంకులో కేవలం రూ.2.5కోట్లు మాత్రమే నిలువ చేసే అవకాశం ఉండగా, ఆ రోజు మాత్రం మెయిన్ బ్రాంచీకి డబ్బు తరలించ లేకపోవడంతో బ్యాంకులో ఉన్న రూ.5కోట్లు నగదు గంగ పాలయింది. ఇప్పడు ఆ డబ్బులో కేవలం రూ. 83లక్షల మాత్రమె దొరికింది. మిగిలినది దొరుకుతుందనే నమ్మకం కూడా లేదు.