రాహుల్‌సేనలో తూర్పు ఆధిక్యం?
posted on Oct 31, 2012 @ 12:24PM
అఖిల భారత కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి రాహుల్‌గాంధీ తన తరుపున ఓ 50మందితో ఏర్పాటు చేసిన సేనలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ముగ్గురున్నారు. వీరిలో మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు, కందుల లక్ష్మీ దుర్గేశ్ గురించి రాష్ట్రంలో తెలియని వారు లేరు. వీరు తూర్పుగోదావరి జిల్లాలోని కాంగ్రెస్ నేతల తలలో నాలుకలా మెదులుతారు. ప్రత్యేకించి పార్టీ కార్యక్రమాల్లోనూ చురుకుగా ఉంటారు. అటువంటి వీరికి రాహుల్‌సేనలో కీలకమైన బాధ్యతలు దక్కటం తూర్పుగోదావరి వాసులను ఆనందానికి గురి చేసింది. రాజకీయ సమీకరణలు లెక్కించటంలోనూ వీరిద్దరూ దిట్టలే. సమీకరణల ఆధారంగానే తమ అభ్యర్థుల్లో ఎవరికి ఎంత మెజార్టీ వస్తుందో కూడా లెక్కించే అనుభవం సహజంగానే రుద్రరాజుకు అలవాటు. మీడియా వేసే అంచనాల్లో లోపాలను కూడా ఈయన ఎన్నోసార్లు ఎత్తిచూపిన సందర్భాలూ ఉన్నాయి. ఇక కందుల లక్ష్మీ దుర్గేష్ అభ్యర్థుల నడవడిక ఆధారంగా వారు ఎంతకాలం పార్టీ మారకుండా సేవ చేయగలరో అంచనా వేయగలరు. ఈయన అంచనా ఇప్పటి వరకూ తప్పలేదని రాజమండ్రి వాసులు బళ్లగుద్ది మరీ చెబుతుంటారు. వీరిద్దరినీ జాతీయస్థాయిలో ఉపయోగించటం వల్ల వారి మేధస్సు పెరిగి భవిష్యత్తులో పరిణతి చెందిన రాజకీయనాయకులుగా ఎదిగే అవకాశాలుంటాయని జిల్లావాసులు భావిస్తున్నారు.