చంద్రబాబు పాదయాత్ర తో పార్టీ వెనక్కి
posted on May 22, 2013 @ 6:47PM
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని భారత దేశంలో ఎక్కడా లేని విధంగా వేల కోట్లు సంపాదించి ఇప్పుడు జైల్లో ఉన్నారని, అలాంటి వ్యక్తి సీఎం అయితే మన పరిస్థితి ఏమిటన్నది ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేళంలో సీఎం మాట్లాడుతూ..దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెసు పార్టీ ద్వారానే ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగాడనే విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు గుర్తుంచుకోవాలని ముఖ్యమంత్రి అన్నారు.
కొత్తగా వచ్చిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కాంగ్రెసు పార్టీ పథకాలను తమ పార్టీ జెండాలో పెట్టుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న పథకాలు కాంగ్రెసు పార్టీవే తప్ప కిరణ్ కుమార్ రెడ్డివో మరొకరివో కాదన్నారు. ముఖ్యమంత్రి స్థానంలో తాను ఉన్నా, బొత్స సత్యనారాయణ ఉన్నా కొనసాగుతాయన్నారు. అవి కాంగ్రెసు పార్టీ పథకాలు కాబట్టి వ్యక్తిగతంగా ఎవరివి కావన్నారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎంత దూరం నడిచినా ఒరిగేదేమీ లేదన్నారు. ఆయన ఎంత నడిచారో అంతకంటే ఎక్కువే ఆ పార్టీ నష్టపోతుందన్నారు. కాంగ్రెసు పార్టీ రెండు రూపాయల బియ్యాన్ని రూపాయికి, పావలా వడ్డీని సున్నా వడ్డీకి చేసిందని, జగన్ పార్టీ జెండాలోని ఆ పథకాలను మార్చుతారా చెప్పాలని సీఎం ప్రశ్నించారు. మన పథకాలు వారి జెండాలో పెట్టుకోవడం విడ్డూరమన్నారు. కాంగ్రెసు పార్టీ తమను గుర్తించి టిక్కెట్ ఇచ్చిందని, కార్యకర్తల సహకారంతో తాము గెలిచామన్నారు.