కాంగ్రెస్ లో అఖిలం చిచ్చు !
posted on Jan 1, 2013 @ 3:26PM
రాష్ట్ర కాంగ్రెస్ విభాగంలో తెలంగాణాఫై ఢిల్లీ లో జరిగిన అఖిల పక్ష సమావేశం చిచ్చు రగిల్చినట్లు కనిపిస్తోంది. ఈ సమావేశం అనంతరం ఆ పార్టీ నేతలు ఎవరికీ ఇష్టం వచ్చినట్లు వారు ప్రకటనలు ఇస్తూ పోతున్నారు.
ఈ సమావేశం పనికిమాలిందనీ, నెల రోజుల్లోపు తెలంగాణా వస్తుందని తనకు అసలు నమ్మకం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత కె.కేశవ రావు తేల్చి చెప్పారు. మరోవైపు, రాష్ట్రం ఇప్పటిలాగే ఉంటుందని, అసలు విడిపోదని మాజీ మంత్రి, శాసనసభ్యుడు గాదె వెంకట రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. గాదె ప్రకటనఫై ఆ పార్టీ నేతలు కాస్త తీవ్రంగానే ప్రతిస్పందించారు. ఆయన ఆలాంటి రెచ్చగొట్టే ప్రకటనలు చేయవద్దని, అసలు అలా చెప్పే అధికారం ఆయనకు పార్టీ అధిష్టానం ఇచ్చిందా అని ఓ శాసనమండలి సభ్యుడు విమర్శించారు.
మరోవైపు షిండే ప్రకటనఫై విశ్వాసం ఉంచాలని, సమస్య పరిష్కారానికి అనువైన వాతావరణం కల్పించాలని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యానారాయణ తన పార్టీ నేతలకు హితవు పలుకుతున్నారు. గాదె అభిప్రాయం వ్యక్తిగతం అయి ఉండవచ్చని బొత్స అన్నారు. అంతే సురేష్ రెడ్డి చెప్పింది కాంగ్రెస్ పార్టీ నిర్ణయమా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. తాను ఆ సమావేశంలో ఎలాంటి వైఖరి అవలంభించాననే విషయాన్ని మాత్రమే గాదె చెపుతున్నారు.
ఇలా కాంగ్రెస్ లో ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు భిన్నమైన ప్రకటనలు ఇచ్చుకొంటూ పోతున్నారు.