కేంద్రం జగన్‌తో లాలూచీ పడిందా?
posted on Sep 17, 2012 @ 11:52AM
కేంద్రం జగన్‌తో లాలూచీ పడిందని టిడిపి అధినేత చంద్రబాబు ఆరోపిస్తున్నారు. అక్రమాస్తుల కేసులో అరెస్టయి, చంచల్‌గూడా జైల్లో ఉన్న జగన్‌తో కేంద్రం లోపాయి కారీగా ఒప్పందం కుదుర్చుకుందన్న అనుమానం చంద్రబాబు మాటల్లో వ్యక్తమౌతోంది. రాష్ట్రపతి ఎన్నికల వరకూ జగన్ విషయంలో కఠినంగా వ్యవహరించిన కేంద్రం అనంతర పరిణామాల ఫలితంగా కొంతమేరకు సానుకూల దృక్పధంతోనే ఉన్నట్లుగా విమర్శలు వస్తున్నాయి. సిబిఐ న్యాయవాదులను మార్చడం ద్వారా జగన్ కేసును నీరుగార్చడం ఇందులో ప్రధాన అంశంగా చెప్పవచ్చు. ఇది విషయాన్ని చంద్రబాబు ప్రస్తావిస్తూ` జగన్ అక్రమాస్తుల కేసులో సిబిఐ తరఫు న్యాయవాదుల్ని ఎందుకు మార్చవలసి వచ్చిందో కేంద్రం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ న్యాయవాదుల్ని మార్చవద్దంటూ సిబిఐ చేసిన విజ్ఞప్తులను కేంద్రం ఏకపక్షంగా ఎందుకు పక్కన పెట్టిందో వివరించాలన్నారు. అవినీతి పరులపై కేసులు నమోదు చేయించి. లోంగదీసుకుని కాంగ్రెస్‌లో చేర్చుకునేందుకే కేంద్రం ఇటువంటి ఎత్తుగడలు వేస్తోందని ఆయన విమర్శించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో రాబోయో రోజుల్లో జగన్ తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి! చూద్దాం... ఏం జరుగుతుందో...