కారణం ఏదైనా సభలో రగడే జరిగింది!
posted on Sep 17, 2012 @ 1:42PM
అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు మొదలయ్యాయి. తొలిరోజునే సభలో గందరగోళ పరిస్థితి కనిపించడంతో స్పీకర్ సభని గంటసేపు వాయిదా వేశారు. ఉదయం సభ ప్రారంభం కాగానే తెలంగాణకోసం వాయిదా తీర్మానాన్ని ప్రవేశెపెట్టాలని టిఆర్ ఎస్ సభ్యులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం దీనికి ఒప్పుకోకపోవడంతో టిఆర్ ఎస్ సభ్యులంతా తీవ్రస్థాయిలో నిరసన తెలుపుతూ పోడియంలోకి దూసుకెళ్లారు. గంటసేపు సభ వాయిదా పడింది. తిరిగి సమావేశమైన తర్వాతకూడా పరిస్థితిలో ఎలాంటి మార్పూ లేదు. టిఆర్ఎస్ సభ్యులు జై తెలంగాణ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేస్తూ పోడియంలోకి దూసుకెళ్లారు. సజావుగా సాగే పరిస్థితి కనిపించకపోవడంతో స్పీకర్ రెండోసారి అరగంటపాటు సభనివాయిదా వేశారు. తిరిగి మూడోసారి సమావేశమైన తర్వాతకూడా అదే పరిస్థితి. ఈసారి సభ రేపటికి వాయిదాపడింది. ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసి విద్యుత్ సమస్యలపై స్వల్పకాలిక చర్చ చేపట్టేందుకు స్పీకర్ అనుమతి ఇచ్చినా ప్రయోజనం లేకపోయింది. ఫీజులు, కరెంట్, రైతుల సమస్యలు, కరువు లాంటి అంశాలను ఆధారంగా చేసుకుని ప్రభుత్వంమీద ముప్పేట దాడి చేయాలని గట్టిగా అనుకుని మరీ సభలోకి అడుగుపెట్టిన విపక్షాలు సభలో విలువైన ప్రజా సమస్యలగురించి చర్చించడంకంటే ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడంమీదే ఎక్కువ ధ్యాసను చూపించాయి. తెలంగాణ తీర్మానమో లేక విద్యుత్ సమస్యో.. ఏదో ఒకదానిమీద చర్చ జరిపితే ఫలితం కానీ.. సభని సమావేశ పరచలేదంటూ ముందు సొడ్లుపెట్టి, తీరా సభలోకొచ్చాక ఇలా కాలాన్ని వృథా చేయడం ఎంతవరకూ సమంజసమో ప్రజలకోసం పోరాడుతున్న, ప్రజలకోసమే పాటుపడుతున్న నేతలే ఆలోచించుకోవాలి.