కాంగ్రెసుతో పెట్టుకొంటే మరంతే!
posted on Jan 21, 2013 @ 9:47PM
కాంగ్రెస్ పార్టీతో స్నేహం అంటే పులి మీద సవారి వంటిది. అది సజావుగా నడుస్తున్నంత కాలం అంతా బాగున్నట్టే కనిపిస్తుంది. గానీ, దైర్యం చేసి క్రిందకి దిగితే మాత్రం ప్రాణం మీదకి వస్తుంది. ఒకప్పుడు జగన్ మోహన్ రెడ్డి కూడా ‘ఆ పులిని నేనే కదా సవారి చేసేది’ అని క్రిందకు దిగితే, ఎక్కడో తేలాడు. మాయావతి, ములాయం సింగులు కూడా అప్పుడప్పుడు దైర్యం చేసి క్రిందకి దిగినా మళ్ళీ వెంటనే బుద్ధిగా పైకెక్కి కూర్చొని, కిందకి దిగలేక పైన కూర్చోనలేకా బిక్కు బిక్కుమంటూ దానితో సాగుతున్నారు.
ఈ మద్యనే మజ్లిస్ పార్టీ కూడా క్రిందకు దిగి, దాని పులితోక పట్టుకొని ఆడుకోబోయింది. అది కొంత గ్రేస్ పీరియడ్ కూడా ఇస్తూ గాండ్రుమంటూ మెత్తగా హెచ్చరించినా లెక్కజేయకుండా దానితో చెలగాటమాడాలని మజ్లిస్ నేతలు ప్రయత్నించారు. ఆ పులి సుతారంగా కొట్టిన ఓ చిన్న దెబ్బకి ఒకేసారి ముగ్గురు మజ్లిస్ శాసన సభ్యులు అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ మరియు ఖాద్రీ కోర్టు గడపల మీద పడ్డారు. అక్బరుద్దీన్ పరిస్థితయితే మరీ దారుణంగా ఉంది. ఒక జైలు నుండి మరొక జైలుకు, ఒక పోలీసు స్టేషన్ నుండి మరో స్టేషనుకు, ఒక కోర్టు నుండి మరొక కోర్టుకి తిరుగుతూ చేసిన తప్పుకి లెంపలు వేసుకొంటున్నాడిప్పుడు.
మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ కూడా ఒకానొకప్పుడు పులి మీద సవారి చేస్తుండగా వాపును బలుపని బ్రమసి పోలీసులను తుపాకులు చూపి బెదిరించడం, సాక్షాత్ జిల్లా కలెక్టర్ మీదనే నోరు పారేసుకొవడం వంటి చిలిపి పనులు చాలానే చేసాడు. అప్పుడు జనం అతనెక్కిన పులిని చూసి భయపడి వెనక్కి తగ్గితే, అదంతా తనను చూసే అనుకొన్నాడు. అయితే, ఈ మద్యనే పులి మీద నుంచి దిగేసాడు గనుక ఆ నాటి తన చిలిపి పనులకి ఈ రోజు కటకటాల పాలయ్యాడు. మరి కాంగ్రెసుతో పెట్టుకొంటే అంతే!