కేసీఆర్ నేల విడిచి సాము.. బాబు బూచి అంటే జనం నమ్ముతారా?

Publish Date:Dec 21, 2025

బీఆర్ ఎస్ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్ మరోసారి నేల విడిచి సాము చేశారు.  కేసీఆర్ సుదీర్ఘ కాలం తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన పార్టీ ఓటమికి కారణాలు, ఇటీవలి కాలంలో పార్టీలో సంక్షోభ పరిస్థితులపై మాటమాత్రమేనా ప్రస్తావించకుండా.. ఏక‌కాలంలో అటు కేంద్రాన్ని, ఇటు రాష్ట్రంలోని కాంగ్రెస్ స‌ర్కారుని, పనిలో పనిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై విమర్శలు గుప్పిస్తూ వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని మోడీ సర్కార్ తెలంగాణకు శనిలా దాపురించిందని శాపనార్ధాలు పెట్టారు.   రాష్ట్రానికి అన్యాయం జ‌రుగుతుంటే.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ దద్దమలా చూస్తూ కూర్చుందంటూ దుయ్యబట్టారు. అలాగే చంద్రబాబునా యుడు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు పేరుకు పాలమూరును దత్తత తీసుకుని, అభివృద్ధి పేరిట శంకుస్థాపన ఫలకాలకే పరిమితమయ్యారనీ, ఆయన హయాంలో శంకుస్థాపన ఫలకాలకు అయిన ఖర్చుతో ఏకంగా ఓ ప్రాజెక్టే కట్టవచ్చంటూ విమర్శలు గుప్పించారు. సాగునీటి ప్రాజెక్టులలో తెలంగాణ అన్యాయంపై ఆయన మాట్లాడినా, ఆయన అసలు లక్ష్యం మాత్రం చంద్రబాబును రెచ్చగొట్టి చంద్రబాబు  లేదా, తెలుగుదేశం పార్టీ నుంచి ప్రతి విమర్శలు రావాలనీ, అలా వస్తే మొత్తం పరిస్థితిని తెలంగాణ వర్సెస్ ఏపీగా మార్చి ఏకకాలంలో తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీనీ, కేంద్రంలో మోడీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్నీ ఇరుకున పెట్టాలన్నట్లుగా కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అంతర్గత సంక్షోభంలో కూరుకుపోయి, రాష్ట్రంలో పార్టీ ఉనికి మాత్రంగా మిగిలిన ప్రస్తుత పరిస్థితులలో తెలంగాణ సెంటిమెంట్ ను ఆసరా చేసుకుని రాష్ట్రంలో బలోపేతం కావాలన్న ఉద్దేశం వినా కేసీఆర్ మాటలలో రాష్ట్రానికి జలాల విషయంలో అన్యాయం జరుగుతోందన్న ఆవేదన కానీ, ఆందోళన కానీ కనిపించలేదని అంటున్నారు. ఒక వేళ అటువంటిదేమైనా ఉంటే.. తన కుమార్తె కవిత కాళేశ్వరం ప్రాజెక్టును దండగమారి ప్రాజెక్టు అనడంపై స్పందించి కనీసం ఆమె వ్యాఖ్యలను ఖండించి ఉండేవారని చెబుతున్నారు.  పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాప్యంపై కాంగ్రెస్ ను దుమ్మెత్తి పోసిన ఆయన.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న రేవంత్ ప్రభుత్వానికి ఇంత కాలం సమయం ఇచ్చామనీ, ఇక నుంచి మాత్రం ఊరుకునేది లేదనీ హెచ్చరించారు. త్వరలో బహిరంగ సభలు ఏర్పాటు చేసి మరీ రేవంత్ సర్కార్  వైఫల్యాలను ఎండగడతామని హెచ్చరించారు.  కేసీఆర్ మీడియా సమావేశం పెట్టి కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పించినా, ఆయన మాటలు విన్న ఎవరికైనా తెలంగాణలో బీఆర్ఎస్ ప్రధాన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీయా అన్న అనుమానం రాకమానదు. ఎందుకంటే కేసీఆర్ ప్రెస్ మీట్ మొత్తం చంద్రబాబు జపంగా మారిపోయింది. కనీసం ఓ 50 సార్లు ఆయన చంద్రబాబు పేరు ప్రస్తావించారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయానికి కాంగ్రెస్, బీజేపీలు కాదు చంద్రబాబే కారణమని తేల్చేశారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ కు చంద్రబాబు గురువు అన్నారు. బాబును కాదనీ రేవంత్ ఏం చేయరన్నారు. అలాగే కేంద్రంలో మోడీ సర్కార్ మనుగడకు కీలకంగా ఉన్న చంద్రబాబు అభీష్ఠం మేరకే కేంద్ర ప్రభుత్వం నడుచుకుంటోందంటూ ఆరోపణలు గుప్పించారు.  కేసీఆర్ వైఖరి చూస్తుంటే.. తెలంగాణలో బీఆర్ఎస్ రాజకీయంగా బలపడాలన్నా, కనీసం ఉనికిని చాటుకోవాలన్నా చంద్రబాబు ను లాగకుండా సాధ్యం కాదని ఆయన భావిస్తున్నట్లు కనిపిస్తోంది. వాస్తవానికి బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్) 2018 ఎన్నికలలో విజయం సాధించి రెండో సారి అధికారంలోకి రావడానికి కేసీఆర్ రగిల్చిన సెంటి ‘మంటే’ కారణమనడంలో సందేహం లేదు. అయితే రెండో సారి అధికారంలోకి వచ్చిన తరువాత కేసీఆర్ జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలన్న లక్ష్యంతో స్వయంగా తానే సెంటిమెంట్ ను నీరుగార్చేశారు. పార్టీ పేరులో తెలంగాణను తీసేశారు. అందుకే నీట తగాదాలు, సాగర్ వివాదం అంటూ 2023 ఎన్నికల ముందు ఎంత ప్రయత్నించినా జనం తిరస్కరించారు. కేసీఆర్ రాజకీయ అవసరాల కోసం సెంటిమెంట్ పని చేయదన్న విషయాన్ని సందేహాలకు అతీతంగా తెలంగాణం 2023 ఎన్నికలలో తీర్పు ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సెంటిమెంటు అంటూ పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రిని బూచిగా చూపాలని కేసీఆర్ చేస్తున్న ప్రయత్నం నేల విడిచి సామేనని అంటున్నారు పరిశీలకులు.  

కేసీఆర్, మోడీ.. డీల్ సెట్ అయ్యిందా?

Publish Date:Dec 22, 2025

చాలా మంది అనుకుంటున్న‌ట్టు.. కేసీఆర్   ఫామ్ హౌస్ లో కూర్చోవడానికి ఆరోగ్యం కారణం కాదట... ఆయన అరోగ్యం శారీర‌క‌మైన‌ది కాదు,  ఆర్ధిక‌ప‌ర‌మైన‌ది, బయటకు తెలియని రాజకీయపరమైనది అనంటున్నారు.   తెలంగాణలో ఇప్పుడిప్పుడే బ‌ల‌ప‌డుతున్న‌ ఒక శ‌తృవును ఢీ కొట్టాలంటే.. మ‌రో ఇద్ద‌రు మితృలుగా కలవాలి అన్న భావనతో కేసీఆర్ ఉన్నారంటున్నారు.  రేవంత్ దేశంలో మ‌రెక్క‌డా లేని విధంగా.. తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీని  మ‌రింత బ‌ల‌ప‌రుస్తూ ముందుకెళ్తున్నారు. దీంతో ఇటు మోడీకి, అటు కేసీఆర్ కి ఒక ర‌క‌మైన మితృత్వం అవ‌స‌ర‌మైంది. ఎలాగైనా స‌రే ఇక్క‌డ పాగా వేయాలన్న పట్టుదలతో ఉన్న మోడీ ఏకకాలంలో ఇటు కేసీఆర్, అటు రేవంత్ ఇద్దరికీ సమప్రాధాన్యత ఇస్తూ పొలిటికల్ గేమ్ అడుతున్నారు. అందులో భాగంగానే  కేసీఆర్ కి అనుకూలంగా ఉండే కిషన్ రెడ్డిని పార్టీ అధ్యక్షుడిని చేశారు. అదేమంత ఫలితం ఇచ్చినట్లు కనబడదు.  నెక్స్ట్ స్టెప్ లో.. కేసీఆర్ అండ్ కో    లోక్ స‌భ‌లో లోపాయికారిగా స‌హ‌క‌రిస్తామ‌ని  మోడీకి మాటిచ్చారంటున్నారు. అన్నట్లుగానే  కేసీఆర్ తాను జీరో  అయ్యి మరీ బీజేపీకి 8 ఎంపీ  సీట్ల‌తో ఒక ఊపు ఉత్సాహం కలిగించేలా 2024 సార్వత్రిక ఎన్నికలలో సహకరించారంటారు పరిశీలకులు. అయినా స‌రే బీజేపీ కేంద్ర నాయ‌క‌త్వం  క‌నిక‌రించ‌కుండా కేసీఆర్ లాంటి మ‌ద‌గ‌జాన్ని సంపూర్ణంగా  గుప్పెట్లో పెట్టుకోవాల‌న్న యోచనతో   క‌వితను బీఆర్ఎస్ నుంచి బయటకు పంపేందు కూడా సై అన్న కేసీఆర్.. ఆ తరువాత బీజేపీతో అసలు డీల్ స్టార్ట్ చేశారని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ అన్నారు.  సరే సుదీర్ఘ విరామం తరువాత కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి బయటకు రావడాన్ని పరిగణనలోనికి తీసుకుంటే..కేంద్రంతో అదే నండీ మెడీతో ఏదో డీల్ సెట్ అయినట్లే కనిపిస్తోందం టున్నారు విశ్లేషకులు.   గత దశాబ్దంనర కాలంగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ఫాలో అవుతున్న పాలసీని నిశితంగా గమనిస్తున్న వారు కూడా కేటీఆర్, మడీ మధ్య డీల్ సెట్ అయ్యిందనే భావించాల్సి వస్తోందంటున్నారు. ఇంతకీ మోడీ పాలసీ ఎంటంటారా?.. భారీగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పార్టీల అగ్రనాయకులను తొలుత కేసులతో భయపెట్టి, ఆ తరువాత   కమలం శరణ్యం అనేలా దారికి తెచ్చుకోవడం. కేసీఆర్ విషయంలోనూ మోడీ అదే పాలసీని అవలంబించి ఉంటారని అంటున్నారు.   ఈ నేపథ్యంలోనే ఇటీవల  రేవంత్ చేసిన కామెంట్ ను కీలకంగా భావించాల్సి ఉంటుంది. ఫార్ములా వన్ రేస్ కేసులో  కేటీఆర్ విచార‌ణ‌కు,  కాళేశ్వ‌రం వ్య‌వ‌హారంలో కేసీఆర్, హ‌రీష్ ల అరెస్టుకు ఈడీ, సీబీఐకి అనుమ‌తులివ్వ‌డంలో కేంద్రం ఆమోదయోగ్యం కాని జాప్యం చేస్తున్నదని రేవంత్ ఇటీవల ఆరోపించిన సంగతి తెలిసిందే. సరే ఆ తరువాత కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనుకోండి, అది వేరే సంగతి.   కాళేశ్వరం వ్యవహారంలో ఇంకా ఎటువంటి కదలికా రాలేదన్నది తెలిసిన సంగతే. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ తన సుదీర్ఘ అజ్ణాతాన్ని వీడి మీడియా ముందుకు వచ్చి బీజేపీ, కాంగ్రెస్ లపై విమర్శలు గుప్పించడం చూస్తుంటూ.. కేంద్రంలో ఆయన ఏదో ఒక అండర్ స్టాండింగ్ కు వచ్చినట్లే భావించాల్సి వస్తుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కేసీఆర్ ఆదివారం (డిసెంబర్ 21) మీడియా సమావేశంలో విమర్శలు గుప్పిస్తూనే మోడీ గారు అని సంబోధించడాన్ని వారు ప్రత్యేకంగా గుర్తు చేస్తున్నారు. గతంలో మోడీయా, బోడీయా అన్న కేసీఆర్ ఇప్పుడు మర్యాదపూర్వకంగా మోడీగారూ అంటూ విమర్శించడమే ఏదో ఒప్పందం జరిగే ఉంటుందనడానికి నిదర్శనంగా చెబుతున్నారు. 

మాట మార్చిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

Publish Date:Aug 28, 2025

  ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు 75 ఏళ్లకు రిటైర్ అవ్వాలని వ్యాఖ్యానించిన ఆర్ఎస్ఎస్ చీఫ్ ఇవాళ మాట మార్చారు. 75 ఏళ్లకు రిటైర్ అవ్వాలని నేను ఎవరికీ చెప్పలేదు అన్నారు. 75 ఏళ్ల తర్వాత కూడా చురుగ్గా పనిచేసే శక్తి ఉందని ఆయన తెలిపారు.సంఘ్ ఎలా చెప్తే అలా నడుచుకుంటామని వెల్లడించారు. కేంద్రం, ఆర్‌ఎస్‌ఎస్‌ మధ్య ఎలాంటి విభేదాలు లేవని  ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ స్పష్టం చేశారు.  . రాష్ట్రీయ స్వయం సేవక్‌  సంఘ్‌ వందేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కొన్ని విషయాల్లో అభిప్రాయ బేధాలు ఉండొచ్చు.. వివాదం కాదంటూ చెప్పుకొచ్చారు. దేశ ప్రయోజనాలే ఇద్దరి ప్రాధాన్యతగా పేర్కొన్న మోహన్‌ భగవత్‌..  బీజేపీ అధ్యక్షుడి ఎన్నికను ఆర్‌ఎస్‌ఎస్‌ శాసించదన్నారు. ‘మేం సలహా ఇవ్వగలం  .. తుది నిర్ణయం వారిదేని తెలిపారు.  నూతన విద్యా విధానానికి మేం మద్దతిస్తున్నాం. ఇంగ్లీష్‌ నేర్చుకోవడంలో తప్పులేదు’’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ తరఫున ఆర్‌ఎస్‌ఎస్‌ నిర్ణయాలు తీసుకుంటుందని  ప్రతిపక్షాల నుండి వస్తున్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలతో తమకు మంచి సమన్వయం ఉందని మోహన్ భగవత్ వెల్లడించారు.  

మీకు తెలుసా? రిలేషన్ నిలబడటానికి ఈ అబద్దాలు చెప్పినా అస్సలు తప్పు లేదట..!

Publish Date:Dec 22, 2025

ప్రతి విషయంలోనూ నిజం మాట్లాడితేనే రిలేషన్ బాగుంటుందని కొందరు అనుకుంటారు. నిజాయితీ ఉన్నప్పుడు, నిజం మాట్లాడినప్పుడే ఆ వ్యక్తి జెన్యూన్ అని చెబుతూ ఉంటారు కూడా. అయితే ఎప్పుడూ నిజం మాట్లాడటం వల్ల రిలేషన్స్ లో  గొడవలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. భార్యాభర్తలలో ఎవరైనా ఏదైనా నిజం చెప్పినప్పుడు.. అది గొడవకు దారితీస్తే  వెంటనే వినిపించే మాట.. నీకు నిజం చెప్పాను చూడు.. నాది బుద్ధి తక్కువ అని. దీన్ని బట్టి అన్నిసార్లు నిజం చెప్పడం అంటే గొడవలను కోరి తెచ్చుకోవడమే అని అర్థం.  కొన్ని సందర్భాల్లో అబద్దాలు చెప్పడం వల్ల రిలేషన్ లో గొడవలు రావడానికి బదులు ఆ బంధం బలపడే అవకాశం,  ఇద్దరి మధ్య అపార్థాలు రాకుండా ఉండే అవకాశం ఉంటుందని రిలేషన్షిప్ నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా మూడు రకాల అబద్దాలు చెప్పడం వల్ల రిలేషన్ పాడవకుండా దృఢంగా మారుతుందని అంటున్నారు. ఇంతకీ ఆ అబద్దాలేంటో ఎందుకు మేలు చేస్తాయో తెలుసుకుంటే.. పొగడ్తలు.. మెచ్చుకోలు..  లైఫ్ పార్ట్నర్  లేదా స్నేహితుడు కొత్త హెయిర్ కట్, కొత్త పెయింటింగ్ లేదా కొత్త డ్రెస్ లేదా ఏదైనా సరే.. ఏదైనా  కొత్తగా చేసినప్పుడు ఒకవేళ అది నచ్చకపోతే..  మొహం మీద బాలేదని చెప్పడం కంటే బాగుందని మెచ్చుకుంటే మేలు. నిజం చెప్పి వారిని బాధపెట్టే బదులు,  వారికి ఒక చిన్న ప్రశంస ఇవ్వవచ్చు. "వావ్" లేదా "సూపర్" లాంటి పదాలతో పొగడ్త ఇవ్వడం వల్ల ఎదుటివారు సంతోషపడతారు. దీనివల్ల ఇద్దరి మధ్య బందం బలపడుతుంది. ఎప్పుడైనా తను చేసింది బాలేదని అర్థమైనా.. ఆ రోజు నన్ను బాధపెట్టడం ఇష్టం లేక ఇలా అన్నారు కదా.. అనే ఒక ఆలోచన ఎదుటివారి దృష్టిలో మిమ్మల్ని ఉన్నతంగా నిలబెడుతుంది. మద్దతు.. తప్పులు అందరూ చేస్తారు. అయితే ఏదో ఒక సందర్భంలో.. ఒకరు ముందు ఒకరు వెనుక చేయవచ్చు. ఆ మాత్రం దానికి మనిషిని నిందించకూడదు. మరీ ముఖ్యంగా నలుగురిలో ఉన్నప్పుడు మాత్రం వ్యక్తిని ఎప్పుడూ నిందించకూడదు. ఒకవేళ నలుగురిలో ఏదైనా తప్పు జరిగినా, అందరి ముందు దోషిలా నిలబడే పరిస్థితి వచ్చినా మనిషిని వెనకేసుకురావాలి.  సపోర్ట్ గా నిలబడాలి. అలా సపోర్ట్ గా ఉండటానికి నలుగురిలో అబద్దం చెప్పినా తప్పు లేదు. భరోసా.. మనకు బాగా కావలసిన వాళ్లు, మన స్నేహితులు, మనతో చనువుగా ఉండేవారు ఎప్పుడైనా జీవితం గురించి ఇబ్బందిగా, బాధగా మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు వెంటే మనకు కూడా బాగా బాధ కలుగుతుంది.  భవిష్యత్తు గురించి వాళ్ల మనసులో భయం కనిపించినప్పుడో లేదా దేని గురించైనా ఏమవుతుందో అని బాధపడుతున్నప్పుడో  వారికి ఊరట కలిగే విధంగా మాటలు చెప్పడం చాలా ముఖ్యం.  అలాంటప్పుడు ధైర్యం చెప్పడం,  భవిష్యత్తు గురించి భరోసా ఇవ్వడం,  భవిష్యత్తు గురించి ఆశ కలిగేలా మాట్లాడటం చాలా ముఖ్యం. వారిలో ఆశాభావం పెరిగి వారు ఆత్మవిశ్వాసం కలుగుతుంది అంటే అలాంటి సందర్భాలలో అబద్దం చెప్పినా తప్పేం లేదు. చివరగా చెప్పేది ఏంటంటే.. అబద్దం అనేది ఎవరినీ మోసం చేయాలని,  బాధపెట్టాలని కాదు.. ఇతరులు సంతోషిస్తారని, బాధ నుండి బయటకు రాగలుగుతారని అనిపిస్తే అబద్దం చెప్పడంలో తప్పేం లేదనేది పెద్దలు కూడా చెప్పే మాట. కానీ మనిషి జీవితాన్ని ఇబ్బందులలోకి తోసేలా.. నమ్మించి మోసం చేసేలా అబద్దాలు ఎప్పటికీ ఆడకూడదు.                                *రూపశ్రీ.
[

Health

]

అల్యూమినియం ఫాయిల్‌లో ఆహారాన్ని ప్యాక్ చేస్తున్నారా? ఈ నష్టాలు తెలుసా?

Publish Date:Dec 22, 2025

అల్యూమినియం ఫాయిల్ నేటి కాలంలో వంటింట్లో చాలా కీలకంగా మారింది. ధర పరంగా చూసినా, వాడకం పరంగా చూసినా సిల్వర్ ఫాయిల్ చాలా సౌకర్యంగా ఉంటుంది. పైగా ఇది  ఆహారాన్ని ఎక్కువ సేపు వేడిగా ఉంచుతుంది. అంతే కాకుండా ఆహారాన్ని వేడి చేయడానికి కూడా దీన్ని ఉపయోగిస్తారు.  ఆహారాన్ని ప్యాక్ చేయడానికి, వంట చేయడానికి, ఆహారాన్ని తిరిగి వేడి చేయడానికి ఇలా చాలా రకాలుగా సిల్వర్ పాయిల్ వాడతారు. అయితే ఇన్ని రకాలుగా ఉపయోగించే సిల్వర్ ఫాయిల్ ఆరోగ్యానికి చాలా చేటు చేస్తుందని తెలుసా? అందరూ సిల్వర్ ఫాయిల్ వల్ల ఎన్ని ఉపయోగాలో అనుకుంటారు. కానీ సిల్వర్ పాయిల్ ను వాడటం వల్ల ఆరోగ్యానికి చాలా నష్టాలు కూడా ఉన్నాయి. అసలు సిల్వర్ ఫాయిల్ ను ఎందుకు వాడకూడదు? సిల్వర్ ఫాయిల్ వాడటం వల్ల కలిగే నష్టాలేంటి? తెలుసుకుంటే.. అల్యూమినియం ఫాయిల్ ఎందుకు ప్రమాదం.. అల్యూమినియం ఫాయిల్ లో వేడి ఆహారం లేదా నిమ్మకాయ,  టమోటా లేదా స్పైసీ సాస్ వంటి ఆమ్ల గుణాలు ఉన్న పదార్థాలను ప్యాక్ చేసినప్పుడు అందులో మైక్రోస్కోపిక్ అల్యూమినియం కణాలు ఆహారంలోకి విడుదల అవుతాయి. ఆమ్ల గుణం ఉన్న పదార్థాలు వాడినప్పుడు ఇలా విడుదల అయ్యే తీవ్రత చాలా ఎక్కువ ఉంటుంది. దీని వల్ల అల్యూమినియం శరీరంలోకి ప్రవేశిస్తుంది. శరీరంలో సాధారణ స్థాయిల కంటే ఎక్కువ అల్యూమినియం ఉన్నప్పుడు అది తీవ్రమైన అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది. అల్యూమినియం ఫాయిల్ వాడటం వల్ల కలిగే నష్టాలు.. మెదడు, నాడీ వ్యవస్థ.. అల్యూమినియం ఒక న్యూరోటాక్సిన్. అంటే ఇది నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది. శరీరంలో అల్యూమినియం అధిక స్థాయిలో ఉండటం వల్ల మెదడు కణాలపై ప్రభావం పడుతుంది. మెదడులో అల్యూమినియం పేరుకుపోవడం వల్ల  అల్జీమర్స్ వ్యాధి వంటి న్యూరోడీజెనరేటివ్ వ్యాధుల ప్రమాదం పెరగడం జరుగుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎముకలు, మూత్రపిండాలు.. శరీరంలో అల్యూమినియం అధికంగా చేరడం వల్ల కాల్షియం,  ఫాస్ఫేట్ శోషణకు ఆటంకం కలుగుతుంది. ఇది ఎముక సాంద్రత తగ్గడానికి దారితీస్తుంది.  ఇది ఎముక బలహీనతకు దారితీస్తుంది. మూత్రపిండాల ప్రాథమిక విధి శరీరం నుండి అదనపు అల్యూమినియంను తొలగించడం. కానీ అధిక అల్యూమినియం మూత్రపిండాల పనితీరును దెబ్బతీస్తుంది. వేడి, ఆమ్ల ఆహారం.. అల్యూమినియం లీచింగ్ అనేది ఉష్ణోగ్రత,  ఆహారం  స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. నిమ్మకాయ, టమోటా,  వెనిగర్ వంటి వేడి ఆహారం లేదా ఆమ్ల ఆహారాలను ఫాయిల్‌లో ప్యాక్ చేసినప్పుడు అల్యూమినియం కణాలు ఆహారంలోకి వేగంగా లీచింగ్ అవుతాయి. వంట కోసం ఫాయిల్ ఉపయోగించినప్పుడు కూడా ఈ లీచింగ్ తీవ్రమవుతుంది. ప్రత్యామ్నాయాలు.. అల్యూమినియం ఫాయిల్‌కు సురక్షితమైన ప్రత్యామ్నాయంగా గాజు, సిరామిక్ లేదా స్టెయిన్‌లెస్ స్టీల్ కంటైనర్‌లను ఉపయోగించాలి. ఫాయిల్ తప్పనిసరిగా ఉపయోగించాల్సి వస్తే, చల్లని,  పొడి ఆహారాన్ని మాత్రమే ప్యాక్ చేయడం మంచిది.  ఆమ్ల ఆహారాలను అల్యూమినియం ఫాయిల్ తో డైరెక్ట్ గా టచ్ చేయకూడదు.  మరీ ముఖ్యంగా ఎల్లప్పుడూ ఫుడ్-గ్రేడ్ బటర్ పేపర్‌ను ఉపయోగించాలి. ఆ తరువాత దాన్ని సిల్వర్ పాయిల్ లో ప్యాక్ చేయాలి.                            *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...