బెజవాడ బిజీవాడ
posted on Aug 18, 2015 @ 4:41PM
ఏపీ సీఎం చంద్రబాబు నాలుగు రోజులు విజయవాడలో ఉండే పాలన కార్యక్రమాలు చూసుకోవాలని నిర్ణయం తీసుకున్నసంగతి తెలిసిందే. ఒక్క చంద్రబాబే కాదు ముఖ్యమైన అధికారులు కూడా విజయవాడలోనే ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే చాలామంది విజయవాడలోనే ఉండి అన్నిపనులు చూసుకుంటున్నారు. అంతేకాదు చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా హైదరాబాద్ నుండి ఇక్కడి వచ్చి ఉంటున్నారు. ఇంకా ఇరవై వేల మంది ఉద్యోగులు ఇక్కడికి తరలిరావాల్సి ఉంది. అయితే రాజధాని పూర్తయ్యేంత వరకూ తాత్కాలిక రాజధాని అయిన విజవాడలోనే వారికి కార్యలయాలు కాని వసతి గృహాలు కాని కేటాయించనున్నారు. దీనికోసం జవహర్ కమిటీ కూడా గట్టి ప్రయత్నమే చేస్తుంది.
ఇదిలా ఉండగా ఇప్పుడు చంద్రబాబు వారానికి నాలుగు రోజులు విజయవాడలోనే ఉండి అక్కడి నుండే అన్ని సమీక్షలు, భేటీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దీంతో బెడవాడ కాస్త ఒక్కసారిగా బిజీవాడగా మారింది. సీఎం క్యాంపు ఆఫీసుకు వచ్చే మంత్రులు, అధికారులు పోలీసులతో క్యాంప్ ఆఫీస్ సందడిగా మారిపోయింది. అంతేకాదు దేశ, విదేశ వ్యాపార ప్రతినిధులు కలిసేందుకు కూడా బెజవాడ నుంచే అపాయింట్‌మెంట్స్ ఇచ్చారు. మొత్తానికి తాత్కాలిక రాజధాని అయిన బెజవాడ ఇప్పటికే చాలా బిజీబిజీ అయిపోవడంతో మిగిలిన శాఖలు కూడా త్వరగా ఇక్కడకు వచ్చేందుకు సమాయత్తమవుతున్నాయి.