48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్‌

 

పెన్షన్ల పంపిణీ, సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీలో పాల్గొనని 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ 48 మంది శాసన సభ్యులకు తక్షణమే నోటీసులు జారీ చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.పెన్షన్ల పంపిణీలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనాల్సిందేనని సీఎం తెలిపారు. 

నోటీసులు తీసుకున్న  శాసన సభ్యులకు వివరణ తర్వాత చర్యలకు వెనకాడబోమని ముఖ్యమంత్రి స్ఫష్టం చేశారు. ఎమ్మెల్యేలు కార్యకర్తలను కలుపుకొని వెళ్లాలని తెలిపారు. ప్రజా దర్బార్‌లో ఎమ్మెల్యేలు పాల్గొనాల్సిందేనని తెలిపారు. విశాఖలో ఈ నెల 14,15 సీఐఐ సమ్మిట్ నిర్మాణాత్మకంగా జరుగుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. పెట్టుబడుల లక్ష్యంగా మంత్రి లోకేశ్ తీవ్ర కృషి చేస్తున్నారని తెలిపారు. గడుపులోపే క్వాంటమ్ కంప్యూటర్ అమరావతికి వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. మీడియాతో చంద్రబాబు చిట్‌చాట్‌ నిర్వహించారు.


అమరావతి బ్రాండ్‌ ఇమేజ్‌ రోజురోజుకూ పెరుగుతోందని ముఖ్యమంత్రి  తెలిపారు. హైదరాబాద్‌ స్థాయిలో భారీ ఈవెంట్లు ఇప్పుడు అమరావతిలో జరుగుతున్నాయని చెప్పారు. ప్రభుత్వం కూడా ఈవెంట్లకు పూర్తి స్థాయిలో ప్రోత్సాహం ఇస్తోందని, ఇటీవల జరిగిన తమన్‌ మ్యూజికల్‌ నైట్‌, విజయవాడ ఉత్సవ్‌, ఇళయరాజా మ్యూజికల్‌ నైట్‌ వంటి కార్యక్రమాలు రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చాయని పేర్కొన్నారు. ఓవైపు ఈవెంట్లు, మరోవైపు భారీ పెట్టుబడులతో ఏపీ వేగంగా అభివృద్ధి దిశగా దూసుకెళ్తోందని సీఎం చెప్పారు. 

నాయుడుపేటలో తెలంగాణకు చెందిన ప్రీమియర్‌ ఎనర్జీస్‌ సంస్థ పెట్టుబడులు పెట్టడం శుభ పరిణామమని అభివర్ణించారు. అంతేకాకుండా పార్టీ వ్యవహారాలపై కూడా సీఎం సమీక్ష నిర్వహించారు. పార్టీ కమిటీలు నెలాఖరులోగా పూర్తి చేసేలా కసరత్తు జరుగుతోందని తెలిపారు. పార్లమెంటు కమిటీల ఏర్పాటుపైనా చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని చెప్పారు. పార్టీని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
 

ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది : ఆర్మీ చీఫ్ ద్వివేది

  పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలు లక్ష్యంగా గత ఏడాది చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'  కొనసాగుతోందని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది అన్నారు. పాకిస్థాన్ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా సమర్థవంతంగా తిప్పికొడతామని హెచ్చరించారు. 2026లో తొలిసారి ద్వివేది మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పాకిస్థాన్ ఎలాంటి పొరపాట్లు చేసిన ఆపరేషన్ సిందూర్ సమయంలో ఇండియన్ ఆర్మీ మోహరించిన బలగాలు భూతల దాడులు చేసేందుకు కూడా సన్నద్ధంగా ఉన్నాయని తెలిపారు.  జమ్మూకశ్మీర్‌లోని నౌషెరా-రాజౌరి సెక్టార్‌లో తాజాగా పాకిస్థాన్ వైపు నుంచి వచ్చిన డ్రోన్‌ల సంచారాన్ని గుర్తించడంపై మాట్లాడుతూ, ఈ అంశం మంగళవారం నాడు పాకిస్థాన్‌తో డీజీఎంఓ స్థాయిలో ప్రస్తావనకు వచ్చిందని, పాక్‌ను కంట్రోల్‌లో ఉండాల్సిందిగా చెప్పామని అన్నారు. ఎలాంటి పరిస్థితులైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు క్షిపణి, రాకెట్ ఫోర్స్‌ను ఇండియన్ ఆర్మీ సిద్ధం చేస్తోందన్నారు.  జమ్మూకశ్మీర్‌లో జనవరి 10న సుమారు ఆరు డ్రోన్‌లు, జనవరి 11,12 తేదీల్లో రెండు నుంచి మూడు డ్రోన్‌లు కనిపించాయని చెప్పారు. అవి చాలా చిన్న డ్రోన్‌లని, లైట్లు వెలుగుతూ తక్కువ ఎత్తులో ఎగురుతున్నాయని, డిఫెన్సివ్ డ్రోన్‌లు కావచ్చని అన్నారు. పాక్‌లో ఎనిమిది ఉగ్రవాద శిబిరాలు ఇప్పటికీ చురుకుగా ఉన్నాయని,  వీటిలో రెండు అంతర్జాతీయ సరిహద్దుకు ఎదురుగా, ఆరు నియంత్రణ రేఖ వెంబడి ఉన్నాయని ద్వివేదీ పేర్కొన్నారు.  ఎలాంటి కదలికలు కానీ శిక్షణా కార్యకలాపాలు కానీ ఉన్నట్టు గుర్తించినట్లయితే అవసరమైన ఏ చర్యనైనా తీసుకుంమని స్పష్టం చేశారు. కవ్వింపు చర్చలకు దిగితే కచ్చితంగా పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని పాక్‌ను హెచ్చరించారు.

ఏపీలో బార్లు, వైన్ షాపుల్లో ఇకపై ఒకే ధరకు మద్యం

  ఏపీ ఎక్సైజ్ పాలసీలోరాష్ట్ర ప్రభుత్వం పలు ముఖ్యమైన మార్పులు చేసింది. బార్ల వ్యాపారులకు,  బార్ల వినియోగదారులకు ఊరటనిచ్చేలా బార్లపై విధించిన అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్‌ను పూర్తిగా రద్దు చేసింది. 2019 నవంబర్ నుంచి బార్లపై ఉన్న ప్రత్యేక అలర్ట్‌నీ తొలగిస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం.. ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేశ్ కుమార్ మీనా.. జీఓ ఎంఎస్ నంబర్ 24ను జారీ చేశారు.  వైసీపీ ప్రభుత్వ హయాంలో వైన్ షాపుల్లో ధరల కంటే బార్లలో ప్రతి క్వార్టర్ మందుపై రూ.50 నుంచి రూ.60 వరకు ఎక్కువ ట్యాక్స్ వసూలు చేశారు. ఇకపై రిటైల్ షాపులు, బార్ల మధ్య ఒకే మద్యానికి రెండు ధరలు ఉండవు. వైన్‌షాపుల్లో, బార్లలో ధరలు ఒకేలా ఉండేలా చర్యలు తీసుకుంటారు. ఏపీఎస్‌బీసీఎల్ డిపోల నుంచి బార్లకు సరఫరా చేసే ఐఎంఎఫ్‌ఎల్, ఎఫ్‌ఎల్‌పై అదనపు పన్ను విధింపు ఉండకూడదని ఆదేశాలు జారీ చేశారు.   ఎక్సైజ్ చట్టాల ప్రకారం కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తూ, 2025 బార్ లైసెన్స్ నిబంధనల్లో సవరణలు చేస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం బార్ల వ్యాపారులకు, బారులకు వెళ్లే మందుబాబులకు పెద్ద ఊరటగా మారనుంది. ఇలాంటి మార్పులతో బార్ల వ్యాపారులకు గణనీయంగా ఖర్చులు తగ్గే అవకాశం ఉంది.  డైరెక్టర్ ఆఫ్ ఎక్సైజ్, డిస్టిలరీస్ కమిషనర్, APSBCL అధికారులు ఈ మార్పుల అమలుకు బాధ్యత వహించనున్నారు. ఈ ఉత్తర్వులు మంగళవారం నుంచి (2026 జనవరి 13) నుంచి అమలులోకి వస్తాయి. గతంలో బార్లకు రిటైల్ షాపుల కంటే ఎక్కువ ధరకు మద్యం సరఫరా అవుతుండటం వల్ల వ్యాపారంలో ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి తలెత్తేది. ఇప్పుడు ధరల సమానత్వంతో బార్లకు బిగ్ రిలీఫ్‌ అనే చెప్పుకోవచ్చు.

మహిళా ఐఏఎస్ అధికారి లక్ష్యంగా అనుచిత పోస్టుల కేసు దర్యాప్తునకు సజ్జనార్ నాయకత్వంలో సిట్

మహిళా ఐఏఎస్ అధికారిణిని లక్ష్యంగా చేసుకుని కొన్ని న్యూస్ చానెళ్లు, యూట్యూబ్ చానెళ్లు, సోషల్ మీడియా అవమానకరమైన, అసభ్యకరమైన కంటెంట్ పోస్ట్ చేడయం, అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఫొటోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడాయాలో పోస్టు చేసిన కేసుల దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటైంది. ఈ రెండు కేసులనూ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. దీంతో లోతైన దర్యాప్తునకు  డీజీపీ శివధర్ రెడ్డి 8 మంది సభ్యులతో కూడిన  సిట్ ఏర్పాటు చేశారు. ఈ సిట్ కు హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వం వహిస్తారు.   సీఎం రేవంత్ రెడ్డి ఫొటోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసిన  కావలి వెంకటేశ్‌ అనే వ్యక్తిపై కాంగ్రెస్ నేత గుళ్ల నరసింహ ఫిర్యాదు మేరకు  నారాయణపేట జిల్లాలో కేసు నమోదైంది.   మరోవైపు, ఓ మంత్రికి, మహిళా ఐఏఎస్ అధికారిణికి సంబంధించి తప్పుడు వార్తలు ప్రసారం చేశారంటూ  రెండు న్యూస్‌ చానళ్లతో పాటు పలు యూట్యూబ్ చానెళ్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్‌పై హైదరాబాద్ సీసీఎస్‌లో  ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్  ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.   ఈ రెండు కేసులనూ సిట్ దర్యాప్తు చేయనుంది. 

కాంగ్రెస్‌లో కల్వకుంట్ల కవితకు నో ఎంట్రీ : టీ పీసీసీ చీఫ్

  తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే అవకాశమే లేదని పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్ తేల్చిచెప్పారు.. కవిత కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ కొద్దిరోజులుగా వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. తాజాగా మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో పీసీసీ చీఫ్ మాట్లాడుతూ..తెలంగాణాలో బీఆర్ఎస్ పార్టీకి గతం తప్ప.. భవిష్యత్తు లేదంటూ వ్యాఖ్యానించారు.  మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ అవినీతి గురించి కవిత నిజాలు చెప్తున్నారన్నారు. తాము చేసిన ఆరోపణలపై కవిత సమాధానం రూపంలో రుజువైందని చెప్పారు. కవిత మాటలతో కేసీఆర్ అవినీతి నిజమని ప్రజలు అర్థం చేసుకుంటున్నారని ఆయన చెప్పారు. కేసీఆర్.. కుమారుడికి ఒక జిల్లా, కూతురికి ఒక జిల్లా, అల్లుడికి ఒక జిల్లా ఇచ్చారని పీసీసీ చీఫ్ ఆరోపణలు గుప్పించారు. కేసీఆర్ అశాస్త్రీయంగా జిల్లాలను విభజించారని మండిపడ్డారు.  శాస్త్రీయంగా జిల్లాల పునర్విభజన చేయాలని కమిటీ వేస్తున్నామని తెలిపారు. సికింద్రాబాద్‌ను ఎవరు ముట్టుకున్నారని తలసాని శ్రీనివాస్ యాదవ్ గాబరాపడుతున్నారని ప్రశ్నించారు. వ్యక్తిగత జీవితాలతో ఆడుకునే హక్కు ఎవరికీ లేదన్నారు. మహిళా అధికారులపై ఆధారాలు లేకుండా వార్తలు రాస్తే ఎంత ఇబ్బంది పడతారో అర్థం చేసుకోవాలన్నారు. సోషల్ మీడియాను కట్టడి చేయాలన్నారు. పదేళ్లలో వచ్చిన ఉద్యోగాలు ఎన్ని? రెండేళ్లలో ఇచ్చిన ఉద్యోగాలు ఎన్నో నిరుద్యోగులు అర్థం చేసుకోవాలని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.  

జోహో వ్యవస్థాపకుడి అత్యంత ఖరీదైన విడాకులు

  టెక్ దిగ్గజం జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వేంబు తన విడాకుల వ్యవహారంతో ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. తన భార్య ప్రమీలా నాయర్‌తో విడిపోతున్న సందర్భంగా సెటిల్‌మెంట్ కింద ఆయన దాదాపు రూ. 15,000 కోట్ల విలువైన ఆస్తులను వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది భారతదేశంలోనే అత్యంత ఖరీదైన విడాకులుగా నిలవడమే కాకుండా.. ప్రపంచంలోనే నాలుగో అత్యంత భారీ సెటిల్‌మెంట్‌గా రికార్డులకెక్కింది.  బిల్ గేట్స్, జెఫ్ బెజోస్ వంటి దిగ్గజాల జాబితాలోకి ఇప్పుడు శ్రీధర్ వేంబు పేరు చేరింది. శ్రీధర్ వేంబు, ఆయన భార్య ప్రమీలా శ్రీనివాసన్ మధ్య గత కొన్నేళ్లుగా సాగుతున్న విడాకుల పోరాటం కీలక మలుపు తిరిగింది. విడాకుల ప్రక్రియ కొనసాగుతుండగానే.. ప్రమీల ఆర్థిక ప్రయోజనాలను కాపాడేందుకు శ్రీధర్ వేంబును 1.7 బిలియన్ డాలర్లు, అంటే సుమారు రూ. 15,000 కోట్లుల విలువైన బాండ్‌ను కోర్టులో డిపాజిట్ చేయాలని కాలిఫోర్నియా కోర్టు ఆదేశించింది.  ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. బిల్ గేట్స్, జెఫ్ బెజోస్ వంటి దిగ్గజాల తర్వాత నాలుగో అత్యంత ఖరీదైన విడాకుల కేసుగా ఈ కేసు రికార్డు సృష్టించింది.ప్రస్తుతం శ్రీధర్ వేంబు నికర ఆస్తి విలువ సుమారు 5.85 బిలియన్ డాలర్లుగా అంచనా. కాలిఫోర్నియా కోర్టు ఈ బాండ్ ఆర్డర్‌తో పాటు జోహోకు చెందిన కొన్ని అమెరికా విభాగాలపై పర్యవేక్షకుడిని కూడా నియమించింది. శ్రీధర్ వేంబు తరపు లాయర్లు ఈ ఆదేశాలను సవాలు చేస్తూ అప్పీల్‌కు వెళ్లారు. మరి ఈ బిలియన్ డాలర్ల వివాదం చివరకు ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.  

డెలివరీ బాయ్ అవతారమెత్తిన ఎంపీ

  గిగ్ వర్కర్ల (డెలివరీ బాయిస్)  సమస్యలను పార్లమెంటులో ఇటీవల లేవనెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ  రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా  తాజాగా బ్లింకిట్ డెలివరీ బాయ్‌ అవతారం ఎత్తారు. డెలివరీ ఏజెంట్ దుస్తులు ధరించి కస్టమర్లకు వస్తువులు డెలివరీ చేశారు. 'బోర్డు రూములకు దూరంగా అట్టడుగు స్థాయిలో.. ఐ లివ్డ్ దైర్ డే..' అంటూ ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పోస్ట్ చేశారు.  ఈ వీడియోలో బ్లింకిట్ యూనిఫారం వేసుకున్న చద్దా డెలివరీ బ్యాగ్‌ తగిలించుకుని రైడర్‌తో కలిసి ప్రయాణం సాగించారు. స్టోర్‌లో వస్తువులు కలెక్ట్ చేసుకుని డెలివరీ లొకేషన్‌కు బయలుదేరారు. అక్కడకు చేరుకోగానే లిఫ్ట్‌ ఎక్కి రైడర్‌ను చద్దా అనుసరించారు. 'స్టే ట్యూన్డ్' అంటూ ఆ వీడియో ముగుస్తుంది. చద్దా ఇటీవల గిగ్ వర్కర్లు దేశవ్యాప్త సమ్మె జరిపిన న్యూఇయర్ ఈవ్‌లో పాల్గొన్నారు.  పని గంటలతో సహా తాము ఎదుర్కొంటున్న సమస్యలపై గిగ్ వర్కర్లు ఈ ఆందోళన జరిపారు. కస్టమర్లకు పది నిమిషాల్లో డెలివరీ ఇస్తామంటూ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫాంలు ఇస్తున్న హామీలతో చద్దా విభేదిస్తున్నారు. ఇలాంటి డెడ్‌లైన్‌ల వల్ల రైడర్లపై ఒత్తిడి పెరుగుతుందని, భద్రతతో రాజీ పడాల్సి వస్తుందని అంటున్నారు. ఇదే విషయాన్ని గత ఏడాది రాజ్యసభ జీరో అవర్‌లో చద్దా ప్రస్తావించారు.  జనం రోబోలు కాదని, వాళ్లలోనూ తండ్రులు, భర్తలు, సోదరులు, కుమారులు ఉన్నారని అన్నారు. వారి గురించి సభ ఆలోచించాలని కోరారు. 10 నిమిషాల్లో డెలివరీ అనే క్రూర నిబంధనకు తెరపడాలని అన్నారు. తాజాగా, వారి కష్టనష్టాలను స్వయంగా తెలుకునేందుకు డెలివరీ బాయ్‌గా ఆయన అవతారం ఎత్తడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ఏపీలో పోటా పోటీ విగ్ర‌హాలు..?

  ఏపీలో కొండ‌ల‌పై పోటా పోటీ విగ్ర‌హాల గురించి ప్ర‌ముఖంగా చ‌ర్చ న‌డుస్తోంది. కూట‌మి స‌ర్కార్ క‌మ్మ వారు అధికంగా ఉండే నీరుకొండ గ్రామం కొండ‌పై రూ. 1750 కోట్ల‌తో ఎన్టీఆర్  విగ్ర‌హం పెడతామ‌న్న ప్ర‌క‌ట‌న  చేసింది. దీంతో వైయ‌స్, రంగా  విగ్ర‌హాల  ప్ర‌స్తావ‌న సైతం విన‌ వ‌స్తోంది. క‌మ్మ‌ల‌ను చూసిన రెడ్లు.. తాము ఎక్కువ‌గా ఉండే పెనుమాక గ్రామం కొండ‌పై వైయ‌స్ విగ్ర‌హం అంత‌కన్నా మించిన ఎత్తుతో,, సుమారు మూడు వేల కోట్ల వ్య‌యం చేస్తూ.. విగ్ర‌హం పెట్ట‌డం ఖాయంగా తెలుస్తోంది.ఇక క‌మ్మ, రెడ్ల‌ను చూసి కాపులు తామేమీ త‌క్కువ కాదంటున్నార‌ట‌. కాపులు ఎక్కువ‌గా ఉండే ఉండ‌వ‌ల్లి గ్రామం కొండ‌ లేదా ఎర్రుపాలెం కొండ‌పై వంగ‌వీటి మోహ‌న రంగా విగ్ర‌హం పెడ‌తార‌ట‌. దీంతో ఏపీలో ప్ర‌స్తుతం పోటా పోటీ విగ్ర‌హాల వ్య‌వ‌హారం ఒకింత జోరుగానే  సాగుతోంది. కొంద‌రు క‌మ్మ వారైతే ఎన్టీఆర్ విగ్ర‌హాన్ని వ‌ద్ద‌నే అంటున్నార‌ట‌. కారణం ఇదిగో ఇదేనంటున్నారు. ఇప్పుడు మీరు రెచ్చిపోయి ఎన్టీఆర్ విగ్ర‌హాన్ని పెడితే.. వ‌చ్చే రోజుల్లో అవి వైయ‌స్, రంగా విగ్ర‌హాలుగా ఒక‌టికి మూడ‌వుతాయని వీరు తీవ్ర నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నార‌ట‌. ఉన్న స‌మ‌స్య‌లు చాల‌వ‌న్న‌ట్టు వైసీపీ ఇదే విగ్ర‌హ వ్య‌వ‌హారంపై కొత్త రాగం అందుకుంది. మెడిక‌ల్ కాలేజీల‌కు ఏడాదికి వెయ్యి కోట్లు ఖ‌ర్చు చేయ‌లేని కూట‌మి స‌ర్కార్.. సుమారు రెండు వేల కోట్ల‌తో ఈ ఎన్టీఆర్ విగ్ర‌హం పెట్ట‌డ‌మేంట‌ని రివ‌ర్స్ లో వ‌స్తోంది. దీంతో పాటు ద‌ళితుల‌ను కూడా ఎగ‌దోసి.. మా సొమ్ముతో క‌మ్మ వారి కుల ప్ర‌తీక అయిన ఎన్టీఆర్ విగ్ర‌హం పెట్ట‌డ‌మేంట‌ని ఒక ర‌క‌మైన ప్ర‌చారం చేయిస్తోంది. కొంద‌రైతే క‌మ్మ‌వారికి ఎన్టీఆర్ విగ్ర‌హాలు పెట్టుకునేంత సొమ్ములు కూడా లేవా? అన్న చ‌ర్చ‌కు తెర‌లేపారు. ఇదంతా ఇలా ఉంటే గ‌తంలో గుంటూరు ఎంపీ  గా ప‌ని చేసిన జ‌య‌దేవ్ గ‌ల్లా పార్ల‌మెంటులో బీజేపీ స‌ర్కార్ వేల కోట్ల‌తో నిర్మించిన స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్, శివాజీ విగ్ర‌హాల వీడియోని వైర‌ల్ చేస్తున్నారు.  వీట‌న్నిటి  న‌డుమ ఈ విగ్ర‌హాల వ్య‌వ‌హారం ఎక్క‌డి వ‌ర‌కూ వెళ్తుందో తేలాల్సి ఉంది.

వివేకా హత్య కేసు.. మరోసారి సుప్రీం కు డాక్టర్ సునీత

మాజీ మంత్రి వివేకానందరెడ్డి  హత్య కేసు లో ఆయన కుమార్తె సునీత మళ్లీ సుప్రీం మెట్లెక్కారు.  తన తండ్రి వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగింపునకు ట్రయల్ కోర్టు పాక్షిక అనుమతి మాత్రమే ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఆమె సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  సీబీఐ విచారణ అంశంపై నిర్ణయం తీసుకోవాలని హైదరాబాద్ నాంపల్లిలోని  సీబీఐ ప్రత్యేక కోర్టు ను గతంలో సుప్రీంకోర్టు ఆదేశించింది.   దీనిపై విచారణ జరిపిన ట్రయల్ కోర్టు కేవలం ఇద్దరి పాత్రపై మాత్రమే విచారణ జరపాలని  ఆదేశాలు ఇచ్చింది. తాము లేవనెత్తిన అంశాలకు విరుద్ధంగా పాక్షిక విచారణకు ట్రయల్ కోర్టు ఆదేశాలిచ్చిందనీ, సుప్రీం ధర్మాసనం ఇచ్చిన మార్గదర్శకాలను ట్రయల్ కోర్టు పట్టించుకోలేదని సునీత సుప్రీం ను ఆశ్రయించారు.   దీంతో ప్రస్తుత అప్లికేషన్తో పాటు పెండింగ్ లో  ఉన్న అన్ని పిటిషన్లపై విచారణను సుప్రీం కోర్టు వచ్చే మంగళవారానికి  వాయిదా వేసింది.

కెనడాలో భారీ చోరీ కేసు...ఇండియన్‌లో నిందితుడు

  400 కిలోల స్వచ్ఛమైన బంగారాన్ని విమానాశ్రయం నుంచే మాయం చేసిన హైటెక్ దోపిడీ కేసులో కెనడా పోలీసులు పురోగతి సాధించారు. ముఖ్యంగా కెనడా చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో జరిగిన రూ. 160 కోట్లకు పైగా విలువైన గోల్డ్ హీస్ట్‌ కేసులో పోలీసులు మరో కీలక నిందితుడిని వేటాడి పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వెళ్తూ టొరంటో ఎయిర్‌పోర్టులో దిగగానే అరెసలాన్ చౌదరిని బేడీలు వేసి అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో అసలు సూత్రధారి, ఎయిర్ కెనడా మాజీ ఉద్యోగి సిమ్రాన్ ప్రీత్ పనేసర్ ప్రస్తుతం భారత్‌లో తలదాచుకున్నట్లు వెల్లడవ్వడం అంతర్జాతీయ స్థాయిలో కలకలం రేపుతోంది.  కెనడా నేర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జరిగిన సుమారు 20 మిలియన్ డాలర్ల విలువైన బంగారు దోపిడీ కేసులో కెనడా పోలీసులు మరో కీలక విజయాన్ని అందుకున్నారు. 'ప్రాజెక్ట్ 24K' పేరుతో జరుగుతున్న ఈ భారీ దర్యాప్తులో భాగంగా.. తాజాగా 43 ఏళ్ల వయసు కల్గిన అరెసలాన్ చౌదరి అనే వ్యక్తిని పీల్ రీజినల్ పోలీసులు అరెస్ట్ చేశారు. దుబాయ్ నుంచి వస్తున్న ఇతడు.. టొరంటో పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అడుగు పెట్టగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  2023 ఏప్రిల్ 17వ తేదీన స్విట్జర్లాండ్‌లోని జూరిచ్ నుంచి ఒక కార్గో విమానం టొరంటో విమానాశ్రయానికి చేరుకుంది. అందులో సుమారు 400 కిలోల స్వచ్ఛమైన బంగారం,  2.5 మిలియన్ డాలర్ల విదేశీ కరెన్సీ ఉన్నాయి. అయితే విమానాశ్రయ ప్రాంగణంలోని ఒక సురక్షిత ప్రాంతానికి ఈ రవాణాను తరలించిన కొద్ది సేపటికే అది అదృశ్యం అయింది. ఎయిర్ కెనడా వ్యవస్థలను మోసం చేసి, నకిలీ పత్రాల ద్వారా పలువురు దుండగులు ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.  ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన సిమ్రాన్ ప్రీత్ పనేసర్ (33) ప్రస్తుతం భారత్‌లో తలదాచుకున్నట్లు పోలీసులు బలంగా నమ్ముతున్నారు. ఎయిర్ కెనడా మాజీ ఉద్యోగి అయిన పనేసర్.. ఎయిర్‌లైన్ సిస్టమ్స్‌ను మార్చడం ద్వారా ఈ కార్గో షిప్‌మెంట్‌ను పక్కదారి పట్టించాడని ఆరోపణలు ఉన్నాయి. గతేడాది ఇతడిని చండీగఢ్ శివార్లలోని ఒక అద్దె ఫ్లాట్‌లో గుర్తించినప్పటికీ.. అతడు తప్పించుకుని పారిపోయాడు. ప్రస్తుతం భారత్‌లో ఉన్న పనేసర్ కోసం కెనడా వ్యాప్తంగా అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో పాటు అంతర్జాతీయ దర్యాప్తు సంస్థల సహకారంతో గాలింపు ముమ్మరం చేశారు.  ఈ భారీ దోపిడీకి సంబంధించి ఇప్పటి వరకు పది మందిపై ఆరోపణలు వచ్చాయి. వారిలో ఎక్కువ మంది భారత సంతతి వ్యక్తులే కావడం గమనార్హం. ముఖ్యంగా తాజాగా అరెస్టయిన అరెసలాన్ చౌదరిపై దొంగతనం, నేరపూరిత కుట్ర వంటి కేసులు నమోదు చేశారు. 2024 మేలో భారత్ నుంచి కెనడాకు వస్తుండగా అర్చిత్ గ్రోవర్ అనే నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. ఎయిర్ కెనడా మాజీ ఉద్యోగి పరంపాల్ సిద్ధూ, అమిత్ జలోటా, ప్రసాత్ పరమలింగం, అలీ రజా తదితరులు ఇప్పటికే అరెస్టు అయ్యారు. మరో నిందితుడు దురాంటే కింగ్-మెక్లీన్ ప్రస్తుతం ఆయుధాల అక్రమ రవాణా కేసులో అమెరికా కస్టడీలో ఉన్నాడు.

వేగవంతంగా అమరావతి రెండో విడత ల్యాండ్ పూలింగ్

  అమరావతిలో పలు ప్రాజెక్టులకు ల్యాండ్ పూలింగ్ జరుగుతోంది.  పెదకూరపాటు సెగ్మెంట్ అమరావతి మండలంలోని 3 గ్రామాల్లో మొదటి రోజే 1000 ఎకరాలు పూలింగ్‌కు ఇచ్చారని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. మూడు గ్రామాల్లో 25 శాతం ల్యాండ్ పూలింగ్ పూర్తైందని చెప్పుకొచ్చారు. అమరావతి మండలం కర్లపూడిలో మంగళవారం (13-1-26) రోడ్డు పనులకు మంత్రి నారాయణ, పెదకూరపాడు ఎమ్మెల్యే బాష్యం ప్రవీణ్ శంకుస్థాపన చేశారు.   ల్యాండ్ పూలింగ్ ప్రారంభానికి వెళ్లిన మంత్రిని రోడ్డు వేయాలని రైతులు కోరారు. రైతులు అడిగిన వెంటనే రోడ్డు నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేయించి.. కాంట్రాక్ట్ సంస్థకు పనులు అప్పగించారు. కర్లపూడి నుంచి అనంతవరం వరకు.. 2.9 కిలోమీటర్ల రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. వారం రోజుల్లో రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని కాంట్రాక్ట్ సంస్థకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. భూములిచ్చిన రైతులను తాను ప్రత్యేకంగా అభినందిస్తున్నానని అన్నారు.  ఎమ్మెల్యే ప్రవీణ్ దగ్గరుండి రైతులను ఒప్పిస్తున్నారని తెలిపారు. అమరావతి అభివృద్ధి జరగాలంటే ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ అవసరమని చెప్పుకొచ్చారు. నెల రోజుల్లోగా 80 శాతం భూమి ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకుంటానని ఎమ్మెల్యే ప్రవీణ్ చెప్పారని అన్నారు. 80 శాతం పూలింగ్ పూర్తి కాగానే మాస్టర్ ప్లాన్ డిజైన్ చేసి, టెండర్లు పిలుస్తామని వెల్లడించారు.